Balika Samridhi Yojana: దేశంలో 'బేటీ బచావో-బేటీ పఢావో' కార్యక్రమాన్ని కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం చాలా కాలంగా ప్రచారం చేస్తోంది. దేశంలో ఆడపిల్లలకు రక్షణ కల్పించడం, వాళ్లు సక్రమంగా చదువు కొనసాగించేలా చూడడం ఈ పథకం ఉద్దేశం. అయితే, మోదీ గవర్నమెంట్‌ రాకముందే దేశంలో ఇలాంటి పథకం అమల్లో ఉంది. ఆ స్కీమ్ పేరు 'బాలిక సమృద్ధి యోజన'. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి వాళ్ల చదువు స్కూల్‌ ఎడ్యుకేషన్ పూర్తయ్యే వరకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద ఆర్థిక సాయం అందిస్తుంది.


'బాలిక సమృద్ధి యోజన' ప్రయోజనాలేంటి?
1997లో, అప్పటి కేంద్ర ప్రభుత్వం 'బాలిక సమృద్ధి యోజన' ప్రారంభించింది. ఈ పథకం ద్వారా... ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి ఆమె 10వ తరగతి చదువు పూర్తయ్యే వరకు, చదువు ఖర్చుల కోసం కేంద్ర ప్రభుత్వం కొంత డబ్బు అందజేస్తుంది. ముందుగా, ఆడపిల్ల పుట్టగానే తల్లికి రూ. 500 ఆర్థిక సాయం అందిస్తారు. ఆ తర్వాత 10వ తరగతి వరకు, ప్రతి దశలో కొంత మొత్తం అందుతూ ఉంటుంది.


ఈ స్కీమ్‌ కోసం అప్లై చేసుకోవడానికి, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నివశించే పేద (BPL) కుటుంబాలు మాత్రమే అర్హులు. ఒక కుటుంబంలో ఇద్దరు కుమార్తెలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.


దరఖాస్తు కోసం ఏ పత్రాలు అవసరం?
బాలిక సమృద్ధి యోజన కింద మీ కుమార్తె పేరును చేర్చడానికి, మీరు కొన్ని రకాల ఫ్రూఫ్‌లు సబ్మిట్‌ చేయాలి. ఆడపిల్ల జనన ధృవీకరణ పత్రం (Birth Certificate), తల్లిదండ్రుల నివాస ధ్రువీకరణ పత్రం (Residence Certificate), తల్లిదండ్రులు లేదా బంధువు గుర్తింపు రుజువు (ID Proof) ఇవ్వాలి. ఐడీ ప్రూఫ్ కోసం రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్ మొదలైనవాటిని ఉపయోగించవచ్చు.


ఎలా దరఖాస్తు చేయాలి?
బాలిక సమృద్ధి యోజన కోసం ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి, అంగన్‌వాడీ కార్యకర్త వద్ద లేదా, ఆరోగ్య సేవ కేంద్రాలకు వెళ్లి సంబంధిత ఫారం తీసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి, ఫారాన్ని పూరించిన తర్వాత ఆన్‌లైన్ ద్వారా మాత్రమే సబ్మిట్‌ చేయాలి. ముఖ్యంగా, గ్రామీణ & పట్టణ ప్రాంత లబ్ధిదారులకు ఈ ఫారం భిన్నంగా ఉంటుంది. ఫారాన్ని ఎక్కడ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్నారో, మళ్లీ అదే ప్లాట్‌ఫామ్‌లో సబ్మిట్‌ చేయాలి. ఫారంలో అడిగిన సమాచారాన్ని మిస్‌ చేయకుండా నింపాల్సి ఉంటుంది.


ఎంత స్కాలర్‌షిప్ ఇస్తారు?
బాలికల విద్య సంబంధిత ఖర్చుల కోసం, బాలిక సమృద్ధి యోజన కింద, కేంద్ర ప్రభుత్వం వార్షిక స్కాలర్‌షిప్‌ను అందిస్తుంది.
1 నుంచి 3వ తరగతి వరకు ప్రతి తరగతికి సంవత్సరానికి రూ. 300
4వ తరగతిలో రూ. 500
5వ తరగతిలో రూ. 600
6 నుంచి 7వ తరగతి వరకు రూ. 700
8వ తరగతిలో రూ. 800
9 నుంచి 10వ తరగతి వరకు రూ. 1000 సాయం అందిస్తారు


బాలిక సమృద్ధి యోజనను గ్రామీణ ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ ద్వారా నిర్వహిస్తారు. పట్టణ ప్రాంతాల్లో ఆరోగ్య శాఖ అధికారులు ఈ పథకాన్ని అమలు చేస్తారు.


మరో ఆసక్తికర కథనం: కోరిన కోర్కెలు తీరుస్తున్న ₹2000 నోట్లు, అంతా మన మంచికేనట! 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial