Vizag News : వేధింపులు ఎక్కువగా ఉన్నాయని తాను విశాఖ వదిలి హైదరాబాద్ వెళ్లి వ్యాపారం చేసుకుంటానని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేసిన ప్రకటన సంచలనం అయింది. ఏపీలో అసలు శాంతిభద్రతలు లేవనే విషయం అందరికీ స్పష్టయిందని విపక్షాలు విమర్శలు చేస్తూంటే.. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మాత్రం విచిత్రంగా స్పందించారు. ఆయన విశాఖను వీడి వెళ్లిపోవడం మంచిదేనంటున్నారు. విశాఖపట్నం లోక్ సభ సభ్యుడు ఎంవివీ సత్యనారాయణ ఇంట జరిగిన కిడ్నాప్ వ్యవహారంపై సిబిఐ, ఈడీల నేతృత్వంలో సమగ్ర విచారణ జరపాలని ... ఎంపీ భార్య, కుమారుడు, సన్నిహితుడైన ఆడిటర్ జీవీ లది అసలు కిడ్నాప్ ఏ కాదని అక్రమ లావాదేవులకు సంబంధించిన సెటిల్మెంట్ అని మూర్తి యాదవ్ ఆరోపిస్తున్నారు.
పోలీసుల ద్వారా చెప్పించిన కిడ్నాప్ కథ కూడా పలు అనుమానాలకు అవకాశం కల్పిస్తోందన్నారు. ఇప్పుడు ఈ కిడ్నాప్ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తెలివిగా విశాఖలో వ్యాపారం చేయనని ప్రకటన జారీ చేశారని అనుమానాలు వ్యక్తం చేశారు. సంవత్సరం క్రితం మరో భూమి వివాద సమయంలో ఇటువంటి ప్రకటనే చేసిన ఆయన ఆ తర్వాత సి బి సి ఎం సి చర్చి లాంటి వేల కోట్ల రూపాయల వివాదాస్పద ప్రాజెక్టులను చేపట్టారు. ఇప్పుడు కూడా వ్యూహాత్మకంగా జరిగిన కిడ్నాప్ వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకు మరో మారు విశాఖ బ్రాండ్ ను దెబ్బతీసే విధంగా ఆయన ప్రకటన చేశారన్నారు.
వాస్తవానికి ప్రశాంత విశాఖకే ఎంవీవీ అవసరం లేదని... భూ ఆక్రమణదారుడుగా పోలీస్ కేసులు ఎదుర్కొని జైలుకు వెళ్లి వచ్చిన ఎంవివి సత్యనారాయణ అవసరం విశాఖ కు లేదని పీతల మూర్తి యాదవ్ ప్రకటించారు. ఆయన కారణంగా విశాఖకు చాలా చెడ్డ పేరు వచ్చింది. ప్రభుత్వ భూములు గడ్డలు స్మశానాలు కబ్జా చేసి ,వివాదాస్పద స్థలాలు సెటిల్ చేసి భవనాలు నిర్మించే వ్యక్తిగా ఆయనకు విశాఖలో చాలా చెడ్డ పేరు ఉందన్నారు. కొనుగోలు దారులను క్షోభ పెట్టిన చరిత్ర ఆయనదని.. ఎంత త్వరగా ఆయన బయటికి వెళ్తే విశాఖకు అంత మేలు జరుగుతుందన్నారు. ఎంవివి తనతో పాటు అక్రమాల ఆడిటర్ గా, మనీ లాండరింగ్ కు పాల్పడే వ్యక్తి గా పేరుపొందిన జీవిని కూడా ఇక్కడనుంచీ తీసుకువెళ్తే విశాఖ వాసులు ఇంకా సంతోషిస్తారన్నారు.
కిడ్నాప్ వ్యవహారంలో వాటాల పంపిణీ ఉన్నందున ప్రభుత్వ పెద్దలు కూడా ఆయన జోలికి పోవడం లేదు. పార్టీని ప్రభుత్వాన్ని దెబ్బతీసే విధంగా ఎం వి వి ప్రయత్నం చేస్తుంటే, ఆయనకు అపాయింట్‌మెంట్ ఇచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్ర పోలీసుల ద్వారా ఎం వి వి ఇంటిలో జరిగిన కిడ్నాప్ వ్యవహారం బయటపడే అవకాశాలు లేవన్నారు. మిగిలిన రాజకీయ పార్టీలకు విశాఖవాసులకు ఆ విషయం ఇప్పటికే అర్థమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన సిబిఐ, ఈడీలు నేరుగా రంగంలోకి దిగి విశాఖ ఎంపీ ఎంవీవి సత్యనారాయణ, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి వెంకటేశ్వరావుల భూ వివాదాలు ఆర్థిక లావాదేవులపై సమగ్ర విచారణ జరపాలని మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరిద్దరి చేతుల మీదగా జరిగిన అన్ని లావాదేవీలను క్రమంగా పరిశీలించి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.