8th Pay Commission: జాతీయ పింఛను వ్యవస్థను (National Pension System - NPS) మెరుగుపరిచేందుకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అధ్యక్షతన నలుగురు సభ్యుల కమిటీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో, ఎనిమిదో వేతన సంఘం (8th Pay Commission) ఏర్పాటుకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 8వ వేతన సంఘం 2023లో ఏర్పాటు కావచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఏడో వేతన సంఘాన్ని 2014లో ఏర్పాటు చేశారు, ఆ సిఫార్సులను 2016లో అమలు చేశారు. ప్రతి 10 సంవత్సరాలకు ఒక కొత్త వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తారు.
ఆశ్చర్యపరిచిన ఆర్థిక మంత్రి
గత ఏడాది ఆగస్టులో జరిగిన పార్లమెంటు సమావేశాల్లో, ఎనిమిదో వేతన సంఘం అంశం ప్రస్తావనకు వచ్చింది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు మోదీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా పార్లమెంటు సభ్యుడు ఆర్థిక మంత్రిత్వ శాఖను ప్రశ్నించారు. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధ్రు ఈ ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఈ సమాధానం ఇచ్చారు. 8వ వేతన సంఘం ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రస్తుతానికి ఎలాంటి ప్రతిపాదన లేదని సమాధానం చెప్పారు. ఇటీవల, లోక్‌సభలో ఆర్థిక బిల్లును ఆమోదించిన సందర్భంగా.. ప్రభుత్వ ఉద్యోగుల కోసం జాతీయ పింఛను వ్యవస్థను మరింత మెరుగుపరచాలని నిర్ణయించామని, దాని కోసం ఆర్థిక కార్యదర్శి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. ఆర్థిక మంత్రి ప్రకటించిన ఈ నిర్ణయం కొంత ఆశ్చర్యాన్ని, ఆసక్తిని రేకెత్తించింది.
లోక్‌సభ ఎన్నికల కాలం
2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు కేవలం ఏడాది మాత్రమే సమయం ఉంది. కాబట్టి, ప్రభుత్వ ఉద్యోగుల ఓటు బ్యాంక్‌ను కాపాడుకోవడం అధికార పార్టీకి చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో, పరిస్థితిలో, జాతీయ పెన్షన్ వ్యవస్థను మెరుగుపరచడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఇదే ఊపులో, ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుకు కూడ మోదీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వవచ్చని భావిస్తున్నారు. పే కమిషన్ ఏర్పాటు చేయకపోతే, లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల అసంతృప్తికి మోదీ ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ప్రతిపక్షాలు NSP లాగా దీనిని కూడా పెద్ద ఎన్నికల ప్రచార అంశంగా మార్చుకోవచ్చు. నేషనల్ పెన్షన్ స్కీమ్ విషయంలో.. కేంద్రం, ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల మధ్య ఇప్పటికే వివాదం నడుస్తోంది. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ వంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించారు. ఈ పరిస్థితుల్లో, NSPను సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అందుకే, ఎనిమిదో వేతన సంఘాన్ని కూడా ఏర్పాటు చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
పే కమిషన్ వ్యవస్థ 1947 నుంచి ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి 10 సంవత్సరాలకు ఒక కొత్త పే కమిషన్‌ను ఏర్పాటు చేస్తుంది. ఆ కమిటీ సిఫార్సుల ఆధారంగా కేంద్ర ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పింఛను పెంచుతారు. 2014 ఫిబ్రవరి 24న, అప్పటి UPA ప్రభుత్వం ఏడో వేతన సంఘాన్ని ఏర్పాటు చేసింది. కేంద్ర ఉద్యోగుల జీతాలు భారీగా పెంచాలని 6వ, 7వ వేతన సంఘాలు సిఫారసు చేయగా, అందుకు అంగీకరించిన ఆయా కేంద్ర ప్రభుత్వాలు 2006, 2016లో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను పెంచాయి.