Securities Transaction Tax Hike: మీరు స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్‌ చేస్తుంటే, ఇకపై ఎక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆప్షన్‌ సెల్లింగ్‌పై సెక్యూరిటీ లావాదేవీల పన్నును (Securities Transaction Tax) పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. 


ఏప్రిల్ 1 నుంచి అమలు
కోటి రూపాయల విలువైన ఆప్షన్స్‌ను సెల్‌ చేస్తే, దీనిపై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్‌గా రూ. 1700 ఇప్పుడు వసూలు చేస్తున్నారు. ఇకపై రూ. 2100 చెల్లించాల్సి ఉంటుంది. కొత్త నిబంధన 2023-24 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి, అంటే ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుంది.


లోక్‌సభలో ఆర్థిక బిల్లును (Finance Bill) ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman). ఫ్యూచర్స్‌ కాంట్రాక్టుల విక్రయంపై సెక్యూరిటీ ట్రాన్జాక్షన్‌ టాక్స్‌ను (STT) 25 శాతం పెంచారు. ఫ్యూచర్స్‌లో ట్రేడింగ్ చేసేవాళ్లు రూ. 1 కోటి టర్నోవర్‌ ఇప్పుడు రూ. 1000 ఎస్‌టీటీ చెల్లిస్తున్నారు, ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి రూ. 1250 చెల్లించాల్సి ఉంటుంది. ఫైనాన్స్ బిల్లులో సవరణ ద్వారా సెక్యూరిటీ ట్రాన్జాక్షన్‌ టాక్స్‌లో ఈ మార్పును తీసుకు వచ్చారు.


జీరోధ (Zerodha) సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ ఈ లెక్కను ఇంకాస్త వివరంగా చెప్పారు. సెక్యూరిటీల లావాదేవీల పన్నును పెంచిన తర్వాత, రిటైల్ పెట్టుబడిదార్లు ఇంట్రా డేలో నిఫ్టీ ఫ్యూచర్‌ను విక్రయించడం లేదా కొనుగోలు చేయడం ద్వారా, ప్రతి నిఫ్టీ లాట్‌కు రూ. 855 లేదా 1.7 పాయింట్ల STT చెల్లించాల్సి ఉంటుంది. ఆ ట్రేడర్‌ 10 నిఫ్టీ లాట్‌లలో ట్రేడింగ్ చేస్తే, అదనంగా 17 పాయింట్ల STT చెల్లించాలి. ఎక్స్ఛేంజ్ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీ, GST, బ్రోకరేజ్, సెబీ విధించే ఛార్జీలకు అదనంగా దీనిని చెల్లించాలి.






 


స్టాక్‌ మార్కెట్‌లోని ఈక్విటీ షేర్లు, ఫ్యూచర్స్, ఆప్షన్‌ల కొనుగోలు & అమ్మకాలపై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్‌ను విధించడం 2004లో ప్రారంభమైంది. ప్రస్తుతానికి.. డెరివేటివ్స్ విభాగంలో (ఫూచర్స్‌ & ఆప్షన్స్‌) ట్రేడ్స్‌పై మాత్రమే సెక్యూరిటీస్‌ లావాదేవీలపై పన్ను పెంపు నిర్ణయం తీసుకున్నారు. ఈక్విటీల్లో ట్రేడ్‌ చేసే వాళ్లకు STT పెంపు వర్తించదు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.