UPI Lite E-Mandate: 'యూపీఐ లైట్‌'ను మరింత విస్తృత పరిచేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించేలా, UPI లైట్‌ను ఇ-మాండేట్ (E-Mandate) కిందకు తీసుకురావరానున్నట్లు తెలిపింది. యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌‌) విధానాన్ని మరింత సౌలభ్యంగా మారుస్తూ తీసుకొచ్చిన వెర్షన్‌ యూపీఐ లైట్‌.


UPI లైట్‌ను రెండేళ్ల క్రితం, 2022 సెప్టెంబర్‌లో లాంచ్‌ చేశారు. ఇది మనీ వాలెట్‌లా పని చేస్తుంది. దీనిలో గరిష్టంగా రూ. 2,000 వరకు లోడ్‌ చేసుకోవచ్చు. ఈ డబ్బుతో చాలా సులభంగా చిన్నపాటి చెల్లింపులు చేయవచ్చు. యూపీఐ లైట్‌ ద్వారా చేసే చెల్లింపులకు పిన్‌ (PIN) నొక్కాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం, UPI లైట్‌ రోజువారీ పరిమితి రూ. 2000. అంటే, యూపీఐ లైట్‌ ద్వారా ఒక్క రోజులో రూ. 2,000 వరకు చెల్లింపులు చేయొచ్చు. అయితే, ఒకే లావాదేవీలో రూ. 500 మించి చెల్లింపు చేయలేరు.


కొత్త మార్పు ఏంటి?
ఇ-మాండేట్ సిస్టమ్‌లోకి యుపీఐ లైట్‌ను రిజర్వ్‌ బ్యాంక్‌ తీసుకువస్తోంది. దీనివల్ల యూపీఐ లైట్‌ మరింత సౌకర్యవంతంగా మారుతుంది, వినియోగం ఇంకా పెరుగుతుంది. ఇ-మాండేట్ సిస్టమ్‌ కిందకు రావడం వల్ల UPI వాలెట్‌లో బ్యాలెన్స్‌ ఆటోమేటిక్‌గా లోడ్‌ అవుతుంది. డబ్బును లోడ్‌ చేయడం యూజర్‌ మర్చిపోయినప్పటికీ, నిర్దేశిత పరిమితి (లిమిట్‌) కంటే బ్యాలెన్స్‌ తగ్గగానే, లింక్‌ చేసిన బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి యూపీఐ లైట్‌లోకి ఆటోమేటిక్‌గా డబ్బు లోడ్‌ అవుతుంది. ఈ లిమిట్‌ను వినియోగదారు నిర్ణయించుకోవాలి. దీనివల్ల, వాలెట్‌లో ఎప్పుడూ బ్యాలెన్స్‌ తగ్గదు. ఎక్కడికి వెళ్లినా డబ్బుకు ఇబ్బంది లేకుండా డిజిటల్ చెల్లింపులు చేయడం సులభం అవుతుంది.


ఆర్‌బీఐ 'పరపతి విధాన కమిటీ' నిర్ణయాలను ‍‌(RBI MPC Meeting June 2024 Decisions) ఈ రోజు ప్రకటించిన ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌  (RBI Governor Shaktikanta Das), యూపీఐ లైట్‌లో తీసుకొస్తున్న మార్పులు గురించి కూడా వెల్లడించారు.


ఫాస్టాగ్‌ యూజర్లకు శుభవార్త
ఫాస్టాగ్‌తో పాటు నేషనల్‌ కామన్‌ మొబిలిటీ కార్డ్‌ (NCMC) వంటి వాటిని ఈ మాండేట్‌ సిస్టమ్‌ పరిధిలోకి తీసుకువస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ చెప్పారు. దీనివల్ల, వినియోగదారు నిర్ణయించిన పరిమితి కంటే వాలెట్‌లో డబ్బులు తగ్గితే, లింక్‌ చేసిన బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి ఆటోమేటిక్‌గా వాలెట్‌లోకి డబ్బు వచ్చి చేరుతుంది. దీనివల్ల, టోల్‌ గేట్‌ చెల్లింపులు & ప్రయాణ సమయాల్లో ఎలాంటి ఇబ్బంది ఎదురుకాదు.


వడ్డీ రేట్లలో ఎనిమిదోసారీ మార్పు లేదు
ఆర్‌బీఐ 'మానిటరీ పాలసీ కమిటీ' ‍‌సమావేశం నిర్ణయాలు మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా వచ్చాయి. ఈసారి కూడా రెపో రేట్‌ను (RBI Repo Rate) స్థిరంగా ఉంచుతూ RBI MPC నిర్ణయం తీసుకుంది. దీంతో, రికార్డ్‌ స్థాయిలో వరుసగా ఎనిమిదోసారి కూడా రెపో రేట్‌ మారలేదు. ప్రస్తుతం రెపో రేట్‌ 6.50 శాతంగా ఉంది. MPCలోని ఆరుగురు సభ్యుల్లో నలుగురు రెపో రేట్‌ను మార్చకూడదని ఓటు వేశారు. భారత ఆర్థిక వ్యవస్థపై తన అంచనాలను రిజర్వ్ బ్యాంక్ పెంచింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ GDP వృద్ధి రేటు అంచనాను 7 శాతం నుంచి 7.2 శాతానికి పెంచింది.


మరో ఆసక్తికర కథనం: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో చంద్రబాబు గెలుపు ఎఫెక్ట్‌- భువనేశ్వరికి ఐదు రోజుల్లోనే రూ.584 కోట్ల లాభం