Gold-Silver Prices June 2024: గత కొన్ని నెలలుగా, పెట్టుబడిదార్లకు బంగారం & వెండి ఫస్ట్ ప్రయారిటీగా మారాయి. ఆర్థిక మాద్యం, ప్రపంచ స్థాయి ఉద్రిక్తతల కారణంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. దాదాపు రెండు, మూడేళ్లుగా ఈ తంతు కొనసాగుతోంది. హఠాత్తుగా విరుచుకుపడే ఆర్థిక తుపాన్లను తట్టుకునే రక్షణ కవచంలా పసిడి నిల్వలు పని చేస్తాయి. ఆ దేశానికి ఆర్థిక భద్రత కల్పిస్తాయి. అందుకే, గత కొన్నేళ్లుగా చాలా దేశాలు పసిడి నిల్వలను (Gold Reserves) పెంచుకుంటున్నాయి. ఈ లిస్ట్‌లో చైనా అగ్రగామిగా నిలిచింది. డ్రాగన్ కంట్రీ తన గోల్డ్ రిజర్వ్స్‌ను నిరంతరం పెంచుకుంటూ పోయింది. దీంతో, అంతర్జాతీయ మార్కెట్‌లో పసుపు లోహం (Yellow Metal) రేట్లకు రెక్కలు వచ్చాయి.
బంగారం కొనుగోళ్లకు స్వస్థి పలికిన చైనా
ఇప్పుడు, చీనీ దేశం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకుంది. బంగారం కొనుగోలుకు స్వస్తి పలికింది. బంగారాన్ని ఎగబడి కొంటున్న చైనా, గోల్డ్ మెటల్ ఇక మాకు అక్కర్లేదని గట్టిగా చెప్పడంతో శుక్రవారం (07 జూన్ 2024) అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలు ఏకంగా 3 శాతానికి పైగా పతనమయ్యాయి. ఔన్స్ (28.35 గ్రాములు) బంగారం ధర 2,401 డాలర్ల నుంచి 2,311 డాలర్ల దగ్గరకు దిగి వచ్చింది. ఔన్స్ గోల్డ్ రేట్ ఒక్క రోజులోనే ఏకంగా 90 డాలర్లు తగ్గింది. ఇటీవలి కాలంలో ఒక్క రోజులో ఇంత భారీ పతనాన్ని మార్కెట్ చూడలేదు.
అమెరికాలో జాబ్ డేటా చాలా బలంగా ఉండడం కూడా బంగారం ధర తగ్గడానికి మరొక కారణం. జాబ్ డేటా స్ట్రాంగ్ ఉండడం వల్ల, వచ్చే సమీక్షలో కూడా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గవని మార్కెట్ లెక్కగట్టింది. దీనివల్ల కూడా గ్లోబల్ మార్కెట్‌లో పసిడి రేటు పతనమైంది. అమెరికాలో ఊహించిన దానికంటే ఎక్కువగా ఉద్యోగాలు పెరగడం, పెద్ద కొనుగోలుదారు పాత్ర పోషిస్తున్న చైనా వైఖరిలో మార్పు రావడంతో పసిడి పతనమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.
MCXలోనూ తగ్గిన బంగారం ధర
మన దేశం విషయానికి వస్తే... MCXలోనూ (Multi Commodity Exchange) బంగారం ధర ప్రపంచ పాటకు అనుగుణంగా స్టెప్పులు వేసింది, 2 శాతానికి పైగా క్షీణించింది. MCXలో గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాముల ధర రూ.73,131గా ఉంది.
ఇంటర్నేషనల్ మీడియా రిపోర్ట్స్‌ను బట్టి చూస్తే, చైనా సెంట్రల్ బ్యాంక్ గత నెలలో (మే 2024) బంగారం కొనుగోళ్లను ఆపేసింది. చీనీ దేశం గత 18 నెలలుగా పసిడిని కూడబెట్టింది. డిమాండ్ పెరిగే సరికి స్వర్ణ ప్రకాశం రికార్డ్ స్థాయికి చేరుకుంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు బంగారం ధరలు దాదాపు 15 శాతం పెరిగాయి.
బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. దీని ధరలు ఎప్పటికప్పుడు రికార్డ్ స్థాయికి చేరుకోవడానికి ఇదే కారణం. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకుల నిరంతర కొనుగోళ్లు, పెట్టుబడిదార్ల నుంచి విపరీతమైన డిమాండ్ కలిసి పసుపు లోహాన్ని సామాన్యుడికి అంతనంత ఎత్తుకు చేర్చాయి. ఇది కాకుండా... బంగారాన్ని ఉత్పత్తి చేయడం చాలా కష్టమైన పని. దీని డిమాండ్ - సరఫరా మధ్య ఎప్పుడూ చాలా పెద్ద గ్యాప్ ఉంటుంది. దీనివల్ల గోల్డ్ రేట్లు తగ్గకుండా పెరుగుతూనే ఉంటాయి.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి