Gold Imports: గత ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో (2022 ఏప్రిల్ - 2023 ఫిబ్రవరి కాలంలో) భారతదేశంలో బంగారం దిగుమతులు దాదాపు 30 శాతం తగ్గి 31.8 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఎల్లో మెటల్ దిగుమతి 45.2 బిలియన్ డాలర్లుగా ఉంది. 2022 ఆగస్టు నుంచి దేశంలోకి బంగారం దిగుమతులు తగ్గుతూ వచ్చాయి. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది.


వాణిజ్య లోటుపై పడని ప్రభావం
బంగారం దిగుమతులు గణనీయంగా తగ్గినప్పటికీ, దేశ వాణిజ్య లోటుపై పెద్దగా ప్రభావం చూపకపోవడం విశేషం. దిగుమతులు - ఎగుమతుల మధ్య వ్యత్యాసాన్ని వాణిజ్య లోటుగా పిలుస్తారు. 2022-23 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఫిబ్రవరి కాలంలో వాణిజ్య లోటు $247.52 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం (2021-22) ఇదే కాలంలో ఇది 172.53 బిలియన్ డాలర్లుగా ఉంది.


బంగారం దిగుమతులు ఎందుకు తగ్గాయి?
పరిశ్రమ నిపుణుల చెబుతున్న ప్రకారం.. బంగారంపై అధిక దిగుమతి సుంకం, ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల వల్ల దిగుమతుల్లో క్షీణతకు దారి తీసింది. పరిమాణం పరంగా, భారతదేశం ఏటా 800 నుంచి 900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. గత ఆర్థిక సంవత్సరం 11 నెలల కాలంలో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 0.3 శాతం క్షీణించి 35.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దేశ వాణిజ్య లోటును నియంత్రించేందుకు, కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని గత ఏడాది 10.75 శాతం నుంచి 15 శాతానికి పెంచింది.


“భారతదేశం, 2022-23 ఏప్రిల్-జనవరి కాలంలో దాదాపు 600 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. అధిక దిగుమతి సుంకం కారణంగా ఇది తగ్గింది. దేశీయ పరిశ్రమకు సాయం చేయడం, ఎగుమతులను ప్రోత్సహించడానికి ఎక్సైజ్‌ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించాలి" - రత్నాలు, ఆభరణాల ఎగుమతి ప్రోత్సాహక మండలి (GJEPC) మాజీ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ కొల్లిన్ షా


పెరిగిన వెండి దిగుమతులు
అయితే, గత ఆర్థిక సంవత్సరం తొలి 11 నెలల్లో వెండి దిగుమతులు 66 శాతం పెరిగి 5.3 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.


ఆర్‌బీఐ దగ్గర 8 శాతం బంగారం
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (World Gold Council) లెక్క ప్రకారం... ఫిబ్రవరి నెలలో బంగారం కొనుగోలు తర్వాత, ప్రపంచంలోని మొత్తం బంగారం నిల్వల్లో 8 శాతం ఇప్పుడు భారత్‌ వద్ద ఉంది. డేటా ప్రకారం, 2022 మొదటి త్రైమాసికం (జనవరి-మార్చి కాలం) ముగింపు నాటికి భారతదేశం వద్ద మొత్తం 760.42 టన్నుల బంగారం ఉంది. రెండో త్రైమాసికం (ఏప్రిల్‌ - జూన్‌ కాలం) ముగింపు నాటికి 767.89 టన్నులు, మూడో త్రైమాసికం (జులై - సెప్టెంబర్‌ కాలం) ముగింపు నాటికి 785.35 టన్నులు, 2022 నాలుగో త్రైమాసికం (అక్టోబర్‌ - డిసెంబర్‌ కాలం) ముగింపు నాటికి 787.40 టన్నుల నిల్వలు ఉన్నాయి. అంటే, గత ఏడాది కాలంలోనే దాదాపు 30 టన్నుల బంగారాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ కొనుగోలు చేసింది.


ప్రపంచ ఆర్థిక వృద్ధిలో మందగమనం కారణంగా గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్‌లో తలెత్తిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, మెరుగైన రాబడి & సురక్షితమైన పెట్టుబడి కోసం గోల్డ్‌ మీద ఆర్‌బీఐ ఫోకస్‌ పెట్టింది, బంగారాన్ని పోగు చేసింది.  2020 జూన్ - 2021 మార్చి మధ్య కాలంలో 33.9 టన్నుల బంగారాన్ని ఆర్‌బీఐ కొనుగోలు చేసింది. 2021-22లో దీనికి దాదాపు రెట్టింపు, అంటే 65 టన్నుల బంగారాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ కొనుగోలు చేసింది. 2020 ఏప్రిల్ - 2022 సెప్టెంబర్ మధ్య కాలంలో ఏకంగా 132.34 టన్నుల బంగారాన్ని బయ్‌ చేసింది. ఇదే సమయంలో, దేశంలోని మొత్తం భారతీయుల వద్ద కలిపి దాదాపు 25,000 టన్నుల పసిడి పోగు పడి ఉంది.