Go First Airline:
వాడియా గ్రూప్‌కు చెందిన గో ఫస్ట్ (Go First) ఎయిర్‌లైన్స్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. స్వచ్ఛంద దివాలా ప్రక్రియకు దరఖాస్తు చేసుకుంది. ఇందుకోసం ఎన్‌సీఎల్‌టీని సంప్రదించింది. నిధుల లేమితో మే 3, 4 తేదీల్లో విమానాలను రద్దు చేసింది.
స్టేక్ హోల్డర్లు, ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడేందుకు దివాలా స్మృతిలోని సెక్షన్ 10 కింద నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌కు వెళ్లినట్టు గో ఫస్ట్ చీఫ్ కౌశిక్ ఖోనా తెలిపారు. అమెరికాకు చెందిన జెట్ ఇంజిన్స్ తయారీ కంపెనీ ప్రాట్ అండ్ వైట్నీ (P&W) ఇంజిన్లను సరఫరా చేయకపోవడంతో 50కి పైగా విమానాలను నేల మీదే ఉంచాల్సి వస్తోందని పేర్కొన్నారు. మే 1న దాదాపుగా 25 ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఆపేశామన్నారు. డబ్బులు లేకపోవడంతో మే 3, 4 తేదీల్లో తాత్కాలికంగా అన్ని సర్వీసులను నిలిపివేశామని ప్రకటించింది.
'స్వచ్ఛంద దివాలా ప్రక్రియకు వెళ్లడం దురదృష్టకరం! కంపెనీ ప్రయోజనాలను కాపాడుకొనేందుకు ఇలా చేయక తప్పడం లేదు' అని కౌశిక్ తెలిపారు. 2020, జనవరి నుంచి ప్రాట్ అండ్ వైట్నీ ఇంజిన్స్ పనిచేయడం లేదు. పదేపదే మొరాయిస్తున్నాయి. 2022 డిసెంబర్ నుంచి 50 శాతం ఇంజిన్లు పనిచేయడం మానేశాయి. ఎన్నిసార్లు కోరినా ప్రాట్ అండ్ వైట్నీ నుంచి సరైన స్పందన లేకపోవడం, ఇంజిన్లను సమయానికి సరఫరా చేయకపోవడం గో ఫస్ట్ కొంప ముంచింది. సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఆర్డర్‌నూ ఆ కంపెనీ అమలు చేయడం లేదు.
2023, ఏప్రిల్ 27లోపు కనీసం పది ఇంజిన్లను సర్వీస్ చేసి తిరిగివ్వాల్సిందిగా ఆర్బిట్రేషన్ సెంటర్ ఆదేశించింది. అంతేకాకుండా ప్రాట్ అండ్ వైట్నీ కంపెనీ నుంచి రూ.8000 కోట్లకు పైగా పరిహారం ఇప్పించాలని గో ఫస్ట్ అప్లై చేసింది. కంపెనీ సేవలకు అంతరాయం కలగడంతో మూడేళ్లుగా ప్రమోటర్ గ్రూప్ రూ.3200 కోట్లను పెట్టుబడి పెట్టింది. ఎన్ని చర్యలు తీసుకున్నా ఆర్థిక ఇబ్బందులు తప్పకపోవడంతో దివాలా చట్టం కింద దరఖాస్తు చేసింది. డీజీసీఏ, కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది.
వరుసగా రెండు రోజులు విమాన సేవలను రద్దు చేస్తున్నట్టు గో ఫస్ట్ ప్రకటించడంతో కస్టమర్లు, ప్యాసెంజర్లు కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ, డీజీసీకు (DGCA_ ఫిర్యాదులు చేస్తున్నారు. బుకింగ్స్ డబ్బులు రీఫండ్ చేయించాలని కోరుతున్నారు. 'ఎలాంటి కారణాలు లేకుండా మైగో ఎయిర్ టికెట్ బుకింగ్‌ను రద్దు చేశారు. G8 237 విమానం మే 3న పనిచేస్తున్నప్పుడు అధిక ధరలకు విక్రయించిన టికెట్లను రద్దు చేయాల్సిన అవసరం లేదు. ఫ్లైట్ బాగానే ఉన్నప్పుడు టికెట్లు ఎందుకు రద్దు చేయాలి?' అని సోషల్ మీడియాలో కొందరు ప్రశ్నించారు.
టికెట్ కొనుగోలుదారులు, ప్యాసెంజర్ల ఫిర్యాదులకు డీజీసీఏ వెంటనే స్పందించింది. మే 3, 4న షెడ్యూలు చేసిన విమాన ప్రయాణాలను రద్దు చేసినట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. కంపెనీ ప్రయాణాలు, టికెట్ల రద్దుకు కారణాలు ముందుగా తమకు తెలియజేయలేదని వివరించింది. నిబంధనలు ఉల్లంఘించడంతో గో ఫస్ట్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశామని ప్రకటించింది.