Blinkit Profile: ఫుడ్‌ డెలివరీ కంపెనీ జొమాటో (Zomato), ఆన్‌లైన్‌ షాపింగ్‌ వేదిక బ్లింక్‌ఇట్‌ (Blinkit) విలీనానికి రెండు కంపెనీలు అంగీకరించాయని సమాచారం. గతేడాది ఆగస్టులో బ్లింక్‌ఇట్‌లో రూ.5.18 బిలియన్లను జొమాటో పెట్టుబడి పెట్టింది. 9 శాతం వరకు వాటా సొంతం చేసుకుంది. నగదు లేక ఇబ్బంది పడుతున్న కంపెనీలో మరో 150 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టబోతున్నామని జొమాటో సెబీకి తెలిపింది. ఒకటీ లేదా రెండు దశల్లో  ఈ డబ్బును ఇవ్వనుంది. 12 శాతం వడ్డీతో ఏడాది లోపలే తీర్చాలని ఒప్పందం కుదుర్చుకుంది.


గతంలో బ్లింక్‌ఇట్‌ పేరు గ్రోఫర్స్‌గా (Grofers) ఉండేది. ఏడాది కిత్రమే దీనిని కొత్తగా రీబ్రాండ్‌ చేశారు. గ్రాసరీస్‌ నుంచి ఎలక్ట్రానిక్స్‌ వరకు ఉత్పత్తులను వేగంగా డెలివరీ చేస్తామని బ్లింక్‌ఇట్‌ సీఈవో గతంలో హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఈ కంపెనీ సేవలు అందిస్తోంది. పోటీదారులు గంటల సమయం తీసుకుంటుంటే బ్లింక్‌ఇట్‌ మాత్రం పది నిమిషాల్లోనే సరకులను డెలివరీ చేస్తోంది. 


ప్రస్తుతం జొమాటో ఇచ్చిన రుణంతో ఈ కంపెనీ యూనికార్న్‌గా మారిందని తెలుస్తోంది. 'జీఐపీఎల్‌ పెట్టుబడి అవసరాలకు ఈ రుణం ఉపయోగపడుతుంది. రాబోయే రెండేళ్లలో మేం దాదాపుగా 400 మిలియన్‌ డాలర్లను ఈ ఈకామర్స్‌ కంపెనీలో ఇన్వెస్ట్‌ చేయాలని అనుకుంటున్నాం' అని జొమాటో తెలిపింది. యూనికార్న్‌ స్టేటస్‌ వచ్చినప్పటికీ ఈ రెండు కంపెనీలు విలీనానికి అంగీకరించినట్టు తెలిసింది.


రాబడి తక్కువగా ఉండటం, ఖర్చులు పెరిగిపోవడంతో బ్లింక్ఇట్‌ ఉద్యోగులను బయటికి పంపించేస్తోంది. డార్క్‌ స్టోర్లను మూసివేస్తోంది. వ్యాపారస్థులకు గడువు లోపల డబ్బులు చెల్లించడం లేదు.  నేపథ్యంలో విలీన ప్రతిపాదన రావడం గమనార్హం. ముంబయి, హైదరాబాద్‌, కోల్‌కతాలో  కొందరు రైడర్లు, పికర్స్‌, స్టోర్‌ మేనేజర్లను కంపెనీ పంపించేసింది. ప్రస్తుతం కంపెనీకి 2000కు పైగా ఉద్యోగులు ఉన్నారు. 30,000 మంది గ్రౌండ్‌ స్టాఫ్ ఉన్నారు. మొత్తంగా 5 శాతం స్టాఫ్‌పై లేఆఫ్‌ల ప్రభావం పడింది. దీనివల్ల రూ.600 కోట్ల వరకు ఆదా అవుతున్నట్టు తెలిసింది.