కొన్ని రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లోని జబల్ పూర్ ఎయిర్ పోర్టులో దిగుతూ క్రాష్ అయింది. ఆ ఘటనలో ప్రాణనష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ విమానం క్రాష్‌కు సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఆ విమానంలోని ప్రయాణికుడే ఆ వీడియోను చిత్రీకరించాడు. ‘రామిరో క్రూజ్’ అనే యూట్యూబ్ ఛానెల్లో ఆ విమానం క్రాష్ అయిన వీడియో కనిపించింది. నిమిషాల్లోనే అది వైరల్ గా మారింది. ఆ వీడియోకు ‘ఢిల్లీ నుంచి జబల్ పూర్ వస్తున్న ఫ్లైట్ ఇది. ఆ ఘటనలో భయపడిన ప్రయాణికుల్లో నేను ఒకడిని’ అని క్యాప్షన్ పెట్టారు. దీన్ని బట్టి అందులో ప్రయాణించిన వ్యక్తికి చెందిన ఛానెల్ అది అయ్యుండొచ్చని భావిస్తున్నారు నెటిజన్లు. 


ఆ వీడియోలో ప్రయాణికుల అరుపులు, మాటలు వినిపించాయి. అందరూ తమకు తాము ధైర్యం చెప్పుకునేందుకు ‘రిలాక్స్ రిలాక్స్’ అంటుండడం వీడియో బ్యాక్ గ్రౌండ్‌లో వినిపిస్తుంది. వీడియోలో ఆరోజు ఏం జరిగిందో కూడా ఆ ప్రయాణికుడు వివరించాడు. ‘రన్ వే పై విమానం ల్యాండ్ కాలేదు. తరువాత విమానం నేలపై ల్యాండ్ అయ్యేటప్పుడు చాలా బలంగా నేలను తాకి, బౌన్స్ అయ్యింది. వేగంగా వెళుతుండడంతో విమానాన్ని పైలెట్లు ఆపలేకపోయారు. నాతో పాటూ 55 మంది ప్రయాణికులు క్షేమంగా ఉన్నందుకు దేవుడికి ధన్యవాదాలు. మా ప్రాణాలను ప్రమాదంలో పడేసిన పైలట్ కచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి’ అని చెప్పాడాయన. 


ఈ విమానం క్రాష్ ఘటన మార్చి 12, 2022న జరిగింది. ఇప్పటికే ఈ ఘటనపై  భారత పౌర విమానయాన నియంత్రణ సంస్థ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విచారణకు ఆదేశించింది. ఈ ఘటనకు కారణం ఏమిటనేది తెలియాల్సి ఉంది.  







Also read: హార్వర్డ్ నిపుణులు చెప్పిన ఆరు ఉత్తమ ఆహారాలు ఇవే, తింటే డాక్టర్ అవసరం తగ్గుతుంది


Also read: పక్కకి తిరిగి నిద్రపోతే ఎన్ని లాభాలో తెలుసా?