Adani Group News: అదానీ గ్రూప్, గతంలో వచ్చిన నష్టాలను భర్తీ చేసే మూడ్‌లో ఉంది. ఇందుకోసం కీలక స్టెప్ తీసుకుంది. ఈ వార్త బయటకు రావడంతో... ఈ రోజు (సోమవారం, 11 సెప్టెంబర్ 2023) మార్కెట్ ఓపెనింగ్ సెషన్‌లో అదానీ గ్రూప్ కంపెనీలు గ్రీన్ కలర్‌లో కళకళలాడాయి.
గౌతమ్ అదానీ నేతృత్వంలోని ప్రమోటర్ గ్రూప్, అదానీ గ్రూప్‌లోని రెండు కంపెనీల్లో తన వాటాను పెంచుకుంది. అదానీ గ్రూప్‌లోని ఫ్లాగ్‌షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో (adani enterprises) ప్రమోటర్ వాటా గతంలో 69.87 శాతంగా ఉండగా, దానిని 71.93 శాతానికి పెంచుకుంది. అదానీ గ్రూప్‌లోని మరో కంపెనీ పోర్ట్స్‌స్‌లో (Adani ports) తన వాటాను 63.06 శాతం నుంచి 65.23 శాతానికి పెంచుకుంది. గ్రూప్ కంపెనీల్లో వాటాను పెంచుకోవడం నెల రోజుల్లోనే ఇది రెండోసారి.
ఏ ప్రమోటర్ సంస్థలు వాటా తీసుకున్నాయి?
ప్రమోటర్ గ్రూప్ సంస్థ అయిన రీసర్జెంట్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్, అదానీ పోర్ట్స్‌లో 1 శాతం వాటాను ఓపెన్ మార్కెట్ ద్వారా కొనుగోలు చేసింది. 1.2 శాతం వాటాను ఎమర్జింగ్ మార్కెట్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ DMCC తీసుకుంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌లో... కెంపాస్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్, ఇన్ఫినిట్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్ కొనుగోలు చేశాయి.
షేర్లను ఎప్పుడు కొన్నాయి?
స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు అదానీ యాజమాన్యం సమర్పించిన ఫైలింగ్స్ ప్రకారం... ఈ షేర్లను ఆగస్టు 14 - సెప్టెంబర్ 8 తేదీల మధ్య ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా ఆయా కంపెనీలు కొనుగోలు చేశాయి.
అమెరికాకు చెందిన షార్ట్‌సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నుంచి బ్లాస్టింగ్ రిపోర్ట్ రిలీజ్ అయిన తర్వాత, అదానీ గ్రూప్ మీద మార్కెట్‌లో విశ్వాసం తగ్గింది, షేర్ ధరలు విపరీతంగా పడిపోయాయి. ఆ దాడి కోలుకుంటున్న సమయంలో, ఇంటర్నేషనల్ మీడియా సంస్థ 'ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్' (OCCRP), అదానీ గ్రూప్ మీద హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన తరహా ఆరోపణలే చేస్తూ ఆగస్టు నెలాఖరులో ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం.... 'గుర్తు తెలియని' మారిషస్ ఫండ్స్ ద్వారా అదానీ గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీల షేర్లలోకి వందల మిలియన్ల డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. అదానీ గ్రూప్ ప్రమోటర్ కుటుంబంతో వ్యాపార సంబంధాలు ఉన్న కొందరు వ్యక్తులు అదానీ గ్రూప్ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టి లాభాలు సంపాదించారని OCCRP విమర్శించింది. దీంతో, అదానీ గ్రూప్ మీద నమ్మకం మరోమారు మసకబారింది.
ఆ ఆరోపణల ప్రభావాన్ని తగ్గించి ఇన్వెస్టర్లు, షేర్ల హోల్డర్లలో నమ్మకం పెంచడానికి అదానీ గ్రూప్ రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే, గ్రూప్ కంపెనీల్లో వాటా పెంచుకుంది.
అదానీ గ్రూప్‌లో GQG పార్ట్‌నర్స్ వాటా
అమెరికన్ ఇన్వెస్టర్ సంస్థ GQG ప్యాటర్న్స్, అదానీ గ్రూప్ కంపెనీల్లో మరింత పెట్టుబడి పెట్టి వాటా పెంచుకున్న వారం రోజుల వ్యవధిలోనే, అదానీ ప్రమోటర్ గ్రూప్ కంపెనీలు కూడా వాటాలు పెంచుకోవడం విశేషం. గత నెలలో, GQG పార్ట్‌నర్స్, బల్క్ డీల్ ద్వారా అదానీ పోర్ట్స్‌స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్‌ోల (APSEZ) తన వాటాను 5.03 శాతానికి పెంచుకుంది. ఇప్పుడు, అదానీ గ్రూప్‌నకు చెందిన 10 కంపెనీల్లో ఐదింటిలో GQG వాటా ఉంది. GQG ఇప్పటి వరకు అదానీ గ్రూప్ కంపెనీల్లో రూ.38,700 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (QIA) అదానీ గ్రీన్ ఎనర్జీలో రూ.4,100 కోట్లు, బెయిన్ క్యాపిటల్ రూ.1,440 కోట్లు ఇన్వెస్ట్ చేసింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం:తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial