Gautam Adani Net worth: భారత బిలియనీర్ గౌతమ్ అదానీ, ప్రపంచ సంపన్నుల జాబితాలో కాస్త ఊరట దక్కించుకున్నారు. అదానీ గ్రూప్ (Adani Group) షేర్లలో ఇటీవలి నష్టాల తర్వాత కూడా, ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితాలో (Forbes real time billioniers list‌) అదానీ గ్రూప్ యజమాని ఐదు స్థానాలు ఎగబాకారు. 


రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (Reliance Industries) ఛైర్మన్‌ ముఖేష్ అంబానీ (Mukesh Ambani), ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 12వ స్థానంలో ఉన్నారు.


అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ (Hindenburg Research) రిపోర్ట్ వచ్చినప్పటి నుంచి గౌతమ్ అదానీకి కష్టాలు ఎక్కువయ్యాయి. 2023 జనవరి 24న ఈ నివేదిక బయటకు వచ్చిన తర్వాత అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లలో భారీ పతనం కనిపించింది. గత 9 ట్రేడింగ్ రోజుల్లో, అదానీ గ్రూప్‌లోని మొత్తం 10 లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 9.5 లక్షల కోట్లు, అంటే 49 శాతం తగ్గింది.


ఇప్పుడు గౌతమ్ అదానీ స్థానం ఏమిటి?
ఒకప్పుడు ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడిగా ఉన్న బిలియనీర్ గౌతమ్ అదానీ, ఈ ఏడాది ప్రారంభం నుంచి నష్టాలను చవిచూస్తున్నారు. గత రెండు వారాలుగా పరిస్థితులు మరీ దారుణంగా తయారయ్యాయి. దీంతో, గత వారంలో, ప్రపంచ కుబేరుల జాబితాలో 22వ స్థానానికి ఆయన పడిపోయారు. రిచ్ లిస్ట్‌లో, గౌతమ్ అదానీ (Gautam Adani in Rich List) మంగళవారం 5 స్థానాలు ఎగబాకి 17వ ర్యాంక్‌కు చేరుకున్నారు. 


ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్‌ లిస్ట్‌ ప్రకారం, గౌతమ్‌ అదానీ నికర విలువ ‍‌(Gautam Adani Net worth) 60.8 బిలియన్‌ డాలర్లు.


ముఖేష్ అంబానీ నికర విలువ ఎంత?
ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం, ముఖేష్ అంబానీ గౌతమ్ అదానీ కంటే ఐదు స్థానాలు పైన, 12వ స్థానంలో ఉన్నారు. ఈ రిపోర్ట్‌ ప్రకారం ముఖేష్ అంబానీ ఆస్తుల నికర విలువ ‍‌(Mukesh Amabni Net worth) 82.8 బిలియన్ డాలర్లు.


భారత కుబేరుల్లో ఎవరికి ఎంత నష్టం?
ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. బిలియనీర్ గౌతమ్ అదానీ 1.2 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూడగా, ముఖేష్ అంబానీ సంపదలో 264 మిలియన్ డాలర్లు ఆవిరయ్యాయి. ఇప్పుడున్న తాజా గణాంకాల ప్రకారం, గౌతమ్ అదానీ నికర విలువ కంటే ముఖేష్ అంబానీ సంపద విలువ 22 బిలియన్‌ డాలర్లు ఎక్కువ.


గౌతమ్ అదానీకి 13 రోజుల్లో 117 బిలియన్ డాలర్ల నష్టం
గౌతమ్ అదానీ 2022 సంవత్సరంలో విపరీతంగా సంపాదించారు. ప్రపంచ సంపన్నులందరినీ దాటుకుంటూ బిలియనీర్స్‌ లిస్ట్‌లో పైపైకి దూసుకెళ్లారు. అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ కంటే ఒక మెట్టు పైన కొంతకాలం పాటు కొనసాగారు. కానీ, 2023 సమయంలో ఆయన అదృష్టం తిరగబడింది. ముఖ్యంగా, హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత గౌతమ్ అదానీ సంపద అతి వేగంగా కిందకు పడిపోయింది. కేవలం 13 రోజుల్లోనే అదానీ గ్రూప్ మార్కెట్ విలువ 117 బిలియన్ డాలర్లు తగ్గింది.


ALSO READ: అదానీ స్టాక్స్‌పై NSE మరో అనూహ్య నిర్ణయం, నేరుగా ఇన్వెస్టర్ల మీద ప్రభావం!