LPG cylinder price reduced today: కొత్త సంవత్సరం సందర్భంగా, జనవరి 01న ఎవరైనా కానుకలు ఇస్తారు. ఏప్రిల్ 01న సరదాగా ఫూల్స్ చేస్తారు. కానీ, ప్రభుత్వ చమురు కంపెనీలు (OMCలు) జనవరి 01నే ప్రజలను ఫూల్స్ చేశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గాయి కాబట్టి, మన దేశంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తారని మీడియా మొత్తం ఓవైపు కోడై కూస్తుంటే... గ్యాస్ కంపెనీలు మాత్రం జనాల్ని వెర్రివాళ్ల కింద జమకట్టాయి.
నూతన ఏడాది తొలి రోజున, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు LPG సిలిండర్ల ధరను తగ్గించాయి. ఆ కటింగ్ కూడా మామాలుగా లేదు. ఎంత తగ్గించారో తెలిస్తే... నవ్వాలో, ఏడవాలో కూడా అర్ధం కాదు.
ఘనత వహించిన చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇండియన్ ఆయిల్ (IOC), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) ఓ మీటింగ్ పెట్టుకుని, చర్చోపచర్చలు జరిపి, 19 కిలోల కమర్షియల్ LPG సిలిండర్ ధరను కేవలం రూపాయిన్నర తగ్గించాయి. ప్రభుత్వ చమురు కంపెనీలు ఎల్‌పీజీ సిలిండర్ల ధరను పక్షం రోజులకు ఒకసారి సమీక్షిస్తాయి.
ప్రధాన నగరాల్లో గ్యాస్ సిలిండర్ కొత్త ధరలు
రేట్లలో కోత తర్వాత... దేశ రాజధాని దిల్లీలో 19 కిలోల కమర్షియల్ LPG సిలిండర్ ధర (Commercial LPG Cylinder Price Today) రూ. 1,755.50కి చేరింది, ఇంతకు ముందు ఇది రూ. 1,757కి లభించేది. ఈ లెక్కన హస్తినలో ధర కేవలం 1.50 రూపాయలు మాత్రమే తగ్గింది. చెన్నైలో గరిష్టంగా రూ. 4.50 తగ్గింది, అక్కడ 19 కిలోల సిలిండర్ ఈ రోజు నుంచి రూ. 1,924.50కి అందుబాటులో ఉంటుంది. ముంబైలో రూ. 1.50 తగ్గి రూ. 1,708.50కి చేరుకుంది. కోల్‌కతాలో మరీ దారుణంగా 50 పైసలు పెరిగి రూ.1,869 కి చేరింది, నిన్నటి వరకు ఈ ధర రూ. 1,868.50 గా ఉంది.
గత 10 రోజుల వ్యవధిలో రెండోసారి
అంతకు ముందు, 2023 డిసెంబర్ 22న కూడా చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ రేట్లను తగ్గించాయి. అప్పుడు 19 కిలోల సిలిండర్ ధర రూ. 30.50 చొప్పున తగ్గింది. దీని కంటే ముందు, 2023 డిసెంబరు 1న కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల రేటు రూ. 21 చొప్పున పెరిగింది. 2023 నవంబర్‌లో రూ. 101, అక్టోబర్‌లో రూ. 209 మేర పెరిగింది. తద్వారా, గత 3 నెలల్లో కమర్షియల్ గ్యాస్ రేట్లు మూడు సార్లు పెరిగాయి, మొత్తం రూ.320 పైకి చేరాయి.
స్థిరంగా దేశీయ గ్యాస్ సిలిండర్ రేటు
దేశంలోని సామాన్య ప్రజలకు ఈసారి కూడా ఊరట దక్కలేదు. ఇళ్లలో వంట కోసం వాడే దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ ధర (Domestic LPG Cylinder Price Today) మారలేదు. రేట్లు తగ్గుతాయేమోనని కొన్ని నెలలుగా ప్రజలు ఎదురు చూస్తూనే ఉన్నారు, ప్రతిసారి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మొండి చెయ్యి చూపిస్తూనే ఉన్నాయి. చివరిసారిగా, 2023 ఆగస్టు 30న డొమొస్టిక్ గ్యాస్ రెట్లను సవరించారు.
ప్రస్తుతం, 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర దిల్లీలో రూ. 903, కోల్‌కతాలో రూ. 929, ముంబైలో రూ. 902.50, చెన్నైలో రూ. 918.50, హైదరాబాద్‌లో రూ. 955, విజయవాడలో రూ. 944.50 గా ఉంది. రవాణా ఛార్జీలను బట్టి ఈ రేటులో చిన్నపాటి మార్పులు ఉండొచ్చు.
LPG సిలిండర్ కొత్త రేట్లను ఎలా తెలుసుకోవాలి?
LPG సిలిండర్ రేటును ఆన్‌లైన్‌లో చెక్ చేయాలనుకుంటే, ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్‌సైట్ https://iocl.com/prices-of-petroleum-products లో చూడవచ్చు. ఈ సైట్‌లో LPG ధరలతో పాటు జెట్ ఫ్యూయల్, ఆటో గ్యాస్, కిరోసిన్ వంటి ఇంధనాల కొత్త రేట్లు కనిపిస్తాయి.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి