FPIs: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) తొలి నెల ఏప్రిల్‌లో ఇప్పటివరకు, భారతీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIలు) రూ. 8,767 కోట్ల పెట్టుబడులు పెట్టారు. దీనికి ముందు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో, FPIలు నికర అమ్మకందార్లుగా ఉన్నారు. అంటే, ఆ ఆర్థిక సంవత్సరం మొత్తంలో విదేశీ ఇన్వెస్టర్లు కొన్న షేర్ల విలువ కంటే అమ్మిన షేర్లు విలువ ఎక్కువగా ఉంది. 


డిపాజిటరీ డేటా 
డిపాజిటరీ డేటా నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఈ నెల 3-13 మధ్య కాలంలో ఎఫ్‌పిఐలు భారతీయ స్టాక్‌లలో రూ. 8,767 కోట్ల విలువైన నికర పెట్టుబడులు పెట్టారు. అంటే, అమ్మిన షేర్ల విలువ కంటే కొన్న షేర్ల విలువ 8,767 కోట్లు ఎక్కువగా ఉంది. 


ఏప్రిల్‌లో ఇప్పటివరకు, రూ. 1,085 కోట్లను డెట్ లేదా బాండ్ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడిదార్లు ఉపసంహరించుకున్నారు.


మార్చి నెలలో 
అంతకుముందు, మార్చి నెలలో రూ. 7936 కోట్ల షేర్లను నికరంగా కొన్నారు. అయితే, ఈ మొత్తంలో ఎక్కువ భాగం అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన అమెరికన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ GQG పార్ట్‌నర్స్ నుంచి వచ్చింది. అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులను మినహాయిస్తే, ఆ నెలలో ఓవర్సీస్‌ ఇన్వెస్టర్లు నికర అమ్మకందార్లుగా ఉన్నారు.


గత నెలలో FIIల షాపింగ్ జాబితాలో... సర్వీసెస్‌ (రూ. 7,246 కోట్లు), పవర్‌ (రూ. 3,214 కోట్లు), మెటల్స్ & మైనింగ్ (రూ. 2,938 కోట్లు), ఆటో (రూ. 2,695 కోట్లు), క్యాపిటల్ గూడ్స్ (రూ. 2,507 కోట్లు), కన్‌స్ట్రక్షన్‌ (రూ. 2,224 కోట్లు), FMCG (రూ. 1,765 కోట్లు), కన్‌స్ట్రక్షన్‌ మెటీరియల్స్‌ (రూ. 1,423 కోట్లు), కెమికల్స్‌ (రూ. 280 కోట్లు), కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ (రూ. 261 కోట్లు), రియాల్టీ (రూ. 104 కోట్లు) వరుసగా ఉన్నాయి.


మార్చి నెలలో రూ. 6,910 విలువైన ఐటీ స్టాక్స్‌ను ఓవర్సీస్‌ ఇన్వెస్టర్లు విక్రయించారు. ఆయిల్‌ & గ్యాస్ (రూ. 6,824 కోట్లు), హెల్త్‌కేర్ (రూ. 1,587 కోట్లు) నుంచి కూడా డాలర్లు బయటకు వెళ్లిపోయాయి.


2022-23లో 
2022-23 ఆర్థిక సంవత్సరంలో, భారతీయ స్టాక్ మార్కెట్ల నుండి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు రూ. 37,631 కోట్లను వెనక్కు తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు దూకుడుగా వడ్డీ రేట్ల పెంచడంతో FPIలు నెట్‌ సెల్లర్స్‌గా నిలిచారు. అంతకుముందు, 2021-22లో, ఇండియన్‌ మార్కెట్ నుంచి రికార్డు స్థాయిలో రూ. 1.4 లక్షల కోట్ల ఉపసంహరించుకున్నారు. 2020-21లో, FPIలు షేర్లలో రూ. 2.7 లక్షల కోట్లు, 2019-20లో రూ. 6,152 కోట్లు పెట్టుబడి పెట్టారు.


యుఎస్, ఐరోపాలో బ్యాంకింగ్ సంక్షోభంపై ఆందోళనలు తగ్గడం వల్ల ప్రపంచ దృక్పథం స్థిరంగా ఉంది. ఈ కారణంగా, భారతదేశంలోకి FPIల ఫండ్స్‌ ప్రవాహం పెరిగింది. ఇదే కాకుండా, ప్రస్తుతం భారత్‌లో షేర్ల విలువ సహేతుకమైన స్థాయికి వచ్చింది. అందువల్ల ఎఫ్‌పీఐలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. అయితే, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కఠినమైన ద్రవ్య విధానం ఇంకా కొనసాగవచ్చన్న సంకేతాలు దృష్ట్యా, ఎఫ్‌పీఐల ఇన్‌ఫ్లోస్‌ మున్ముందు అస్థిరంగా ఉండవచ్చు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.