Zomato News: దేశీయ ఫుడ్ డెలివరీ స్టార్టప్ కంపెనీ జొమాటో తాజాగా తన నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో సైతం కంపెనీ ఆదాయాలు భారీగా పెరగటంతో పాటు పన్ను తర్వాత లాభాల్లోకి రావటంతో జొమాటో షేర్లపై ఇన్వెస్టర్లు, బ్రోకరేజ్ సంస్థ సానుకూలంగా ఉన్నారు. కంపెనీకి చెందిన క్విక్ కామర్స్ వ్యాపారం సైతం బ్రేక్ ఈవెన్ సాధించటం కంపెనీపై నమ్మకాన్ని పెంచుతోంది. అయితే కంపెనీ ESOP ఖర్చులు ఊహించిన దానికంటే భారీగా పెరగటంతో మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో కంపెనీ షేర్లు పతనాన్ని నమోదు చేశాయి.


ఇదే క్రమంలో కంపెనీ కీలక ప్రకటన చేసింది. ఫుడ్‌టెక్ మేజర్ జొమాటో మార్చి త్రైమాసికంలో తన ఫిన్‌టెక్ అనుబంధ సంస్థ జొమాటో పేమెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ.39 కోట్ల పెట్టుబడిని రద్దు చేసింది. ఇదే క్రమంలో ఫిన్‌టెక్ విభాగం ఇటీవల RBI నుంచి పొందిన ఆన్‌లైన్ పేమెంట్ అగ్రిగేటర్, ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్ లైసెన్స్‌లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి తిరిగి సరెండర్ చేసిందని ఫైలింగ్స్‌లో పేర్కొంది. వాణిజ్యపరంగా ప్రాజెక్ట్ లాభసాటిగా లేనందున కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 


వాలెట్ లైసెన్సు కోసం దరఖాస్తు చేసిన కొన్ని సంవత్సరాల నుంచి దేశంలో చెల్లింపు ల్యాండ్‌స్కేప్ అభివృద్ధి చెందిందని, ఈ సమయంలో చెల్లింపుల వ్యాపారం వాణిజ్యపరంగా లాభదాయకంగా లేదని సరెండర్ వెనుక కారణాన్ని జొమాటో వెల్లడించింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న డిజిటల్ చెల్లింపుల వ్యాపారంలో తమకు సానుకూల వాతావరణం లేదని కంపెనీ గుర్తించినట్లు జొమాటో వెల్లడించింది. ఈ దశలో తాము వాణిజ్యపరంగా లాభదాయకమైన పేమెంట్స్ వ్యాపారాన్ని ఊహించలేమని చెబుతూ ఈ పరిణామాలను తాము గుర్తించినట్లు వెల్లడించింది. చెల్లింపుల కార్యకలాపాలను ప్రారంభించడానికి దగ్గరగా ఉన్నందున నిజమైన ప్రభావం మరింత స్పష్టంగా కనిపించిందని కంపెనీ మే 13న స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది.


రిజర్వు బ్యాంక్ గతంలో అందించిన లైసెన్స్ జొమాటోకి ఆన్‌లైన్ చెల్లింపులను స్వయంగా ప్రాసెస్ చేయడానికి, వాలెట్, క్యాష్ కార్డ్‌లు మొదలైన సేవలను తన కస్టమర్‌లకు అందించడానికి అనుమతిని అందించాయి. ఇది కంపెనీకి థర్డ్-పార్టీ యాప్‌లతో పాటు డిజిటల్ చెల్లింపులపై మరింత అంతర్గత నియంత్రణను అందిస్తుంది. గేట్‌వేలు, చెల్లింపుల యాప్‌లు రెండింటిలోనూ థర్డ్ పార్టీ చెల్లింపు సేవలతో అనుబంధించబడిన ఖర్చులను తగ్గించడం, ప్రాసెసింగ్ ఛార్జీలను ఆదా చేసుకునే ఆలోచనతో వాస్తవానికి కంపెనీ లైసెన్స్ కోసం అప్లై చేసింది. కానీ ప్రస్తుతం డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థలో పెరిగిన పోటీ జొమాటోను వెనుకడుగు వేసేలా ప్రేరేపించిందని తేలింది.


లైసెన్స్ సరెండర్ చేసినప్పటికీ జొమాటో పేమెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌(ZPPL)లో ఇతర కార్యకలాపాలు కొనసాగుతాయని, తాజా నిర్ణయం సంస్థ రాబడి, కార్యకలాపాలపై ఎటువంటి భౌతిక ప్రభావం చూపబోదని కంపెనీ వెల్లడించింది. ఆన్‌లైన్ ఫుడ్ అండ్ గ్రోసరీ డెలివరీ మేజర్ ఆగస్టు 2021లో రూ.20 కోట్ల అధీకృత షేర్ క్యాపిటల్‌తో ZPPLని విలీనం చేసింది. గడచిన ఏడాది కంపెనీ దేశంలోని ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ భాగస్వామ్యంతో జొమాటో యూపీఐ అనే పోరుతో సొంత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ ఆఫర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.