Flipkart Fined: రకరకాల వస్తువుల కోసం అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈ-కామర్స్‌ సైట్స్‌లో ఆర్డర్లు చేయడం మనందరికీ అలవాటే. అందరికీ, ఆర్డర్‌ చేసిన వస్తువే చేతికొచ్చినా, అడపాదడపా కొన్ని చేదు అనుభవాలూ ఎదురవుతుంటాయి. ఒక వస్తువు కోసం డబ్బు చెల్లిస్తే మరొక వస్తువు రావడం, లేదా అసలు ఏ వస్తువూ రాకపోవడం కూడా అప్పుడప్పుడు జరుగుతుంటాయి. 


నగదు చెల్లింపు తర్వాత కూడా డెలివరీ కాని ఫోన్ 
బెంగళూరులోని రాజాజీనగర్‌కు చెందిన దివ్యశ్రీకి కూడా ఫ్లిప్‌కార్ట్‌లో ఇలాంటి అనుభవమే ఎదురైంది. 2022 జనవరి 15వ తేదీన ఫ్లిప్‌కార్ట్‌ ప్లాట్‌ఫామ్ ద్వారా రూ. 12,499 విలువైన ఒక మొబైల్ ఫోన్ కోసం ఆమె ఆర్డర్‌ పెట్టారు. క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా వాయిదాల పద్ధతిలో చెల్లింపు చేసే ఆప్షన్‌ను ఆమె ఎంచుకున్నారు. పేమెంట్‌ ప్రాసెస్‌ మొత్తం విజయవంతంగా పూర్తయింది, ఆమె క్రెడిట్‌ కార్డ్‌లో సంబంధిత మొత్తం ఫ్రీజ్‌ అయింది. అంటే, క్రెడిట్‌ కార్డ్‌ కంపెనీ ఆ డబ్బును ఆమె తరపున చెల్లించింది. మరుసటి రోజులో ఫోన్‌ డెలివరీ అవుతుందని దివ్యశ్రీకి ఫ్లిప్‌కార్ట్‌ నుంచి కన్ఫర్మేషన్‌ మెసేజ్‌ వచ్చింది. అయితే.. తర్వాతి రోజు కాదు కదా, ఎన్ని రోజులు ఎదురు చూసినా ఆమెకు ఫోన్‌ అందలేదు.


ఫ్లిప్‌కార్ట్‌ కస్టమర్‌ కేర్‌కు దివ్యశ్రీ చాలా సార్లు ఫోన్‌ చేశారు. కానీ, అటువైపు నుంచి సంతృప్తికర సమాధానం రాలేదు, ఆర్డర్‌ చేసిన మొబైల్‌ ఫోన్‌ కూడా ఇంటికి రాలేదు. ఫోన్‌ అందకపోయినా, క్రెడిట్‌ కార్డ్‌ కంపెనీకి EMIలు చెల్లించాల్సి వచ్చింది. విసుగు చెందిన రాజశ్రీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.


న్యాయస్థానాన్ని ఆశ్రయించిన బాధితురాలు
బెంగళూరు అర్బన్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లో రాజశ్రీ పిటిషన్ వేయగా, కోర్టు విచారణ చేపట్టింది. దీనికి సంబంధించి కోర్టు ఫ్లిఫ్‌కార్ట్‌ కంపెనీకి నోటీసు కూడా పంపింది. అయితే ఫ్లిప్‌కార్ట్ తన ప్రతినిధిని కూడా విచారణ న్యాయస్థానం వద్దకు పంపలేదు. విచారణ పూర్తి చేసిన కోర్టు ఈ-కామర్స్ కంపెనీకి భారీ జరిమానా విధించింది.


న్యాయస్థానం ఆదేశాలు ఏంటి?
మొబైల్ ఫోన్ కోసం ఈ-కామర్స్ కంపెనీకి దివ్యశ్రీ చెల్లించిన రూ. 12,499తో పాటు, ఆ మొత్తం మీద 12 శాతం వార్షిక వడ్డీని కూడా కలిపి చెల్లించాలని కమిషన్ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. కోర్టు ఖర్చుల కింద బాధితురాలికి మరో రూ. 10 వేలు చెల్లించాలని కూడా ఆదేశించింది. అలాగే, సేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆ కంపెనీకి రూ. 20 వేల జరిమానా (Penalty on Flipkart‌‌) విధించింది. అంటే, ఫ్లిప్‌కార్ట్ మొత్తం రూ. 42,500 పైగా చెల్లించాల్సి ఉంటుంది. దీనికి వడ్డీ మొత్తం కలిపితే ఇంకా పెరుగుతుంది. అంటే, ఫోన్‌ విలువ కంటే మూడు రెట్లకు పైగా మొత్తాన్ని ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌ చెల్లించాల్సి ఉంటుంది.


సేవల విషయంలో ఫ్లిప్‌కార్ట్ 'పూర్తి నిర్లక్ష్యం' ప్రదర్శించడం మాత్రమే కాకుండా, అనైతిక పద్ధతులను కూడా అనుసరించిందని బెంగళూరు వినియోగదారుల కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. సకాలంలో ఫోన్ ఇవ్వకపోవడంతో వినియోగదారు ఆర్థికంగా నష్టపోయారని, 'మానసికంగా బాధ పడ్డారని' వెల్లడించింది. ఈ అన్నింటికీ పరిహారంగా, మూడు రెట్లకు పైగా ఆర్థిక శిక్షణను ఆ కంపెనీకి న్యాయస్థానం విధించింది.