భారత ఈ-కామర్స్‌ దిగ్గజాలు మరోసారి బాహాబాహీ తలపడుతున్నాయి! వినియోగదారులకు ఒకేసారి పండగ ఆఫర్లు ఇస్తున్నాయి. తాజాగా ఫ్లిప్‌కార్ట్‌ తన బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ తేదీలను ముందుకు జరిపింది. అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ కన్నా ఒక రోజు ముందుగానే విక్రయాలు ఆరంభించనుందని తెలిసింది.


వాస్తవంగా అక్టోబర్‌ 7 నుంచి 12  వరకు బిగ్‌ బిలియన్ డేస్‌ ఎనిమిదో ఎడిషన్ నిర్వహిస్తామని ఫ్లిప్‌కార్ట్‌ మంగళవారం ప్రకటించింది. అయితే అక్టోబర్‌ 4 నుంచి నెల రోజుల పాటు గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ నిర్వహిస్తున్నామని అమెజాన్‌ ప్రకటించడంతో నిర్ణయం మార్చుకుంది. దానికన్నా ఒకరోజు ముందుగానే విక్రయాలు మొదలు పెడతామని తాజాగా అంతర్గత ఆదేశాలు జారీ చేసింది. ఇక ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌ కంపెనీ మింత్రా సైతం 'బిగ్‌ ఫ్యాషన్‌ ఫెస్టివల్‌' పేరుతో అక్టోబర్‌ 3 నుంచి 10 వరకు సేల్‌ నిర్వహించనుంది.


Also Read: స్థిరంగా పసిడి ధర.. వెండి మాత్రం దిగువకు.. నేటి తాజా ధరలివే..


త్వరలోనే ఈ మార్పు చేసిన తేదీలు ఫ్లిప్‌కార్ట్‌ యాప్‌, వెబ్‌సైట్లో ప్రదర్శించనుందని పీటీఐ వర్గాలు తెలిపాయి. విక్రయదారులకు ఇప్పటికే మార్పు గురించి తెలియజేసిందని సమాచారం. కరోనా మహమ్మారితో నష్టపోయిన వ్యాపారస్థులు, విక్రయదారులకు బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ పునరుత్తేజం కలిగిస్తుందని ఆ సంస్థ సీఈవో కల్యాణ్‌ కృష్ణమూర్తి ఉద్యోగులతో అన్నారు. ఈ సేల్‌ ద్వారా సరఫరా విభాగంలో వేల మందికి ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు.


Also Read: విజయవాడలో భారీగా పెరిగిన ఇంధన ధరలు.. మిగతా చోట్ల ఇలా..


పండుగ వేళల్లో పోటాపోటీగా విక్రయాలు నిర్వహించడం అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌కు కొత్తేం కాదు. గతంలోనూ ఒకేసారి ఫెస్టివ్‌ సేల్స్‌ ఆఫర్లు ప్రకటించారు. భారీ రాయితీలు ఇవ్వడం, కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించడం, ఈఎంఐ ఆఫర్లు ప్రకటించడం వారికి అలవాటే. దసరా, దీపావళి ముందు ఈ-కామర్స్‌ సంస్థలు భారీగా పెట్టుబడులు పెడుతుంటాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు ఆఫర్లు ప్రకటిస్తాయి. తమ భాగస్వాములను సిద్ధం చేసి విక్రయాలు చేపడతాయి. సరఫరా విభాగంలో ఇబ్బందులు రాకుండా చూసుకుంటాయి.


Also Read: అక్టోబర్లో బ్యాంకులకు 21 రోజులు సెలవు.. ఆర్థిక లావాదేవీలు ప్లాన్‌ చేసుకోండి!


గతేడాది పండుగల వేల భారత ఈ కామర్స్‌ సంస్థలు 9 బిలియన్‌ డాలర్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. గతంతో పోలిస్తే ఈ సారి 25 శాతం అధికంగా విక్రయాలు నమోదువుతాయని రెడ్‌సీర్‌ కన్సల్టింగ్‌ సంస్థ చెబుతోంది. ఇక వార్షిక టర్నోవర్‌ 49-52 బిలియన్‌ డాలర్లుగా ఉండనుందని అంచనా వేస్తోంది. గత 38.2  బిలియన్‌ డాలర్లతో పోలిస్తే ఇది 37 శాతం ఎక్కువ కావడం గమనార్హం.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి