Financial Rules Changed from 01 March 2024: క్యాలెండర్‌లో కొత్త నెల ప్రారంభం కాగానే, సంపన్నుడి నుంచి సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభావితం చేసే చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. వీటిలో కొన్ని విషయాలు నేరుగా డబ్బుతో ముడిపడి ఉంటాయి. క్యాష్‌ మ్యాటర్స్‌ను కోటీశ్వరులు పట్టించుకోకపోయినా పర్లేదు, కామన్‌ మ్యాచ్‌ కచ్చితంగా గమనించాలి. ఎందుకంటే, కొన్ని విషయాలు తెలీకపోతే ఇంట్లో బడ్జెట్‌తో పాటు ఒంట్లో బీపీ/షుగర్‌ కూడా పెరుగుతాయి. 


గ్యాస్‌ సిలిండర్‌ రేటు నుంచి ఫాస్టాగ్‌ వరకు, ఈ నెలలోనూ కొన్ని విషయాలు మారాయి. వీటి గురించి ముందే తెలుసుకుంటే, మీ జేబు మీద పడే అదనపు భారం నుంచి నేర్పుగా తప్పించుకోవచ్చు.


2024 మార్చి 01 నుంచి అమల్లోకి వచ్చిన ఆర్థిక మార్పులు (Financial changes effective from 01 March 2024)


- మహా శివరాత్రి పండుగకు ముందు, చమురు మార్కెటింగ్‌ కంపెనీలు (OMCs) 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను పెంచాయి, పెద్ద షాక్ ఇచ్చాయి. దేశంలోని వివిధ నగరాల్లో వాణిజ్య LPG సిలిండర్ ధర ఇప్పుడు మరో రూ. 25.50 వరకు పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్ ధర (Commercial LPG Cylinder Price Today) రూ. 25.50 పెరిగింది, రూ. 1,795 కు చేరింది. తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని అన్ని ప్రాంతాల్లో దాదాపు ఇదే స్థాయిలో రేట్లు ఉన్నాయి. అయితే, ఇళ్లలో వంటకు ఉపయోగించే 14 కిలోల గ్యాస్‌ బండ విషయంలో సామాన్య ప్రజలకు ఈసారి కూడా ఊరట లభించలేదు. ప్రస్తుతం, 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర (Domestic LPG Cylinder Price Today) హైదరాబాద్‌లో రూ. 955, విజయవాడలో రూ. 944.50 గా ఉంది. 14 కేజీల గ్యాస్‌ బండ రేటు గత ఆరు నెలలుగా తగ్గలేదు.


- విమాన ఇంధన ధరలను కూడా చమురు మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. ఈ రోజు నుంచి ATF ‍‌(Aviation Turbine Fuel Price) ధర కిలోలీటరుకు రూ.624.37 పెరిగింది. దీని ఆధారంగా విమాన టిక్కెట్ల రేట్లు కూడా పెరుగుతాయి.


- మార్చి 01 నుంచి, GST రూల్‌లో పెద్ద మార్పు వచ్చింది. ఇప్పుడు రూ. 5 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారాల్లో, ఇ-ఇన్‌వాయిస్ లేకుండా ఇ-వే బిల్లును రూపొందించలేరు. కొందరు వ్యాపారులు ఇ-ఇన్ వాయిస్ లేకుండానే ఇ-వే బిల్లులు జారీ చేస్తున్నట్లు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్‌ అమలు తీసుకొచ్చింది.


- నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI), "ఒక వాహనం ఒక ఫాస్ట్‌ట్యాగ్" గడువును పొడిగించింది, ఇది ప్రజలకు గొప్ప ఉపశమనం. ఇంతకుముందు ఫిబ్రవరి 29తో  ముగిసిన గడువును తాజాగా మార్చి 31 వరకు పెంచింది.


- దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు SBI, తన క్రెడిట్ కార్డులకు సంబంధించి కొత్త నిబంధన తీసుకొచ్చింది. క్రెడిట్ కార్డుల మినిమమ్ డే బిల్ కాలిక్యులేషన్‌ విషయంలో మార్పులు చేసింది. కొత్త నిబంధన మార్చి 15 నుంచి అమల్లోకి వస్తుంది. 


- మీకు ఈ నెలలో (మార్చి) బ్యాంక్‌లో ఏదైనా ముఖ్యమైన పని ఉందా?, మార్చి నెలలో పండుగలు, జాతీయ సందర్భాలన్నీ కలుపుని, బ్యాంక్‌లకు మొత్తం 14 రోజులు సెలవులు వచ్చాయి. ఈ నెలలో హాలిడేస్‌ లిస్ట్‌ చెక్‌ చేసుకున్నాకే బ్యాంక్‌కు బయలు దేరడం ఉత్తమం. లేకపోతే సమయం వృథా అయ్యే ప్రమాదం ఉంది.


మరో ఆసక్తికర కథనం: