FIIs Stake: ప్రపంచంలోని ఏ స్టాక్‌ మార్కెట్‌నైనా ముంచేది, తేల్చేదీ విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) & దేశీయ మ్యూచువల్ ఫండ్స్‌. ఈ పెట్టుబడి సంస్థలు ఏ స్టాక్స్‌ను కొంటే ఆ స్టాక్స్‌ తారాజువ్వల్లా పైకి దూసుకెళ్తాయి. ఏ స్టాక్స్‌ను అమ్ముకుంటూ వెళ్తే అవి దారం తెగిన గాలిపటంలా నేలకూలతాయి.  


2022 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు విపరీతమైన ర్యాలీ చేశాయి, దలాల్ స్ట్రీట్‌ డార్లింగ్స్‌గా నిలిచాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐలు) & దేశీయ మ్యూచువల్ ఫండ్స్‌ ఈ కంపెనీల్లో తమ యాజమాన్యాన్ని భారీగా పెంచుకోవడమే దీని వెనుకున్న కారణం.


దేశీ, విదేశీ పెట్టుబడిదార్ల వాటాలు పెరుగుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు - స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI), బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (Bank Of Baroda), కెనరా బ్యాంక్‌ (Canara Bank), ఇండియన్‌ బ్యాంక్‌ (Indian Bank), పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (Punjab National Bank), యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (Union Bank Of India), బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (Bank Of India).


మిడ్‌ క్యాప్ స్పేస్‌లో ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్ వంటి స్టాక్స్‌లో ఎఫ్‌ఐఐల హోల్డింగ్స్‌ గణనీయంగా పెరిగాయి. 


బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద ఎఫ్‌ఐఐల మోజు మరీ ఎక్కువగా ఉంది. డిసెంబర్ త్రైమాసికం సహా వరుసగా గత నాలుగు త్రైమాసికాలుగా ఈ స్టాక్‌లో వాటా పెంచుకుంటూ వచ్చాయి. సెప్టెంబర్‌ క్వార్టర్‌ కంటే డిసెంబర్‌ క్వార్టర్‌లో తమ స్టేక్‌ను 95 బేసిస్ పాయింట్లు పెంచి, మొత్తం వాటాను 2.07 శాతానికి చేర్చాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లోనూ వరుసగా మూడు త్రైమాసికాలుగా హోల్డింగ్‌ పెంచుతూ వచ్చాయి. డిసెంబర్‌ త్రైమాసికంలో 49 bps పెంచి, మొత్తం యాజమాన్యాన్ని 1.71%కి చేర్చాయి.


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనూ ఎఫ్‌ఐఐల హోల్డింగ్‌ను స్వల్పంగా పెరిగింది. ఎస్‌బీఐలో, సెప్టెంబర్ త్రైమాసికంలో 9.95 శాతంగా ఉన్న విదేశీ పెట్టుబడిదార్ల వాటా డిసెంబర్ త్రైమాసికంలో 10.09 శాతానికి పెరిగింది. ఈ స్టాక్‌లోనూ గత 3 త్రైమాసికాలుగా స్థిరంగా వాటాను పెంచుకుంటూ వచ్చాయి.


ఎగబడి కొంటున్న మ్యూచువల్‌ ఫండ్స్‌
FIIల బాటలోనే మ్యూచువల్ ఫండ్స్ (MFలు) కూడా పరుగులు పెట్టాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా, PNB (పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌), కెనరా బ్యాంక్‌లో తమ హోల్డింగ్స్‌ను గణనీయంగా పెంచుకున్నాయి.


కెనరా బ్యాంక్‌లో, MFలు, సెప్టెంబర్‌ క్వార్టర్‌ కంటే డిసెంబర్‌ క్వార్టర్‌లో (QoQ) వాటాను 102 bps పెంచి, మొత్తం వాటాను 4.77%కి పెంచుకున్నాయి.


బ్యాంక్ ఆఫ్ ఇండియాలో, MF హోల్డింగ్ QoQలో 77 బేసిస్‌ పాయింట్లు పెరిగి 1.34%కి చేరుకుంది. PNBలో హోల్డింగ్ 3.56% నుంచి 4.05%కి పెరిగింది.


PSU బ్యాంకుల షేర్లు 2022లో అద్భుతమైన రాబడిని ఇచ్చాయి, కొన్ని మల్టీబ్యాగర్‌లుగా మారాయి. బ్యాలెన్స్ షీట్లలో మేజర్‌ క్లీన్-అప్, బలమైన క్రెడిట్ వృద్ధి కారణంగా ఆదాయాల్లో బలమైన మెరుగుదల కనిపించింది. దీంతో, స్టాక్‌ ధరలు పరుగులు పెట్టాయి.


గత ఏడాది కాలంలో.. యూకో బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌ షేర్ల విలువ రెండింతలు పెరిగింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ & సింధ్ బ్యాంక్ 50-87% వరకు లాభపడ్డాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.