AUS vs IND 1st test:  భారత్- ఆస్ట్రేలియా తొలి టెస్టులో తొలి సెషన్ పూర్తయింది. లంచ్ సమయానికి ఆస్ట్రేలియా 2 వికెట్లకు 76 పరుగులు చేసింది. మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ తలా ఒక వికెట్ తీసుకున్నారు. 


 టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే భీకర ఫాంలో ఉన్న ఉస్మాన్ ఖవాజా (3 బంతుల్లో 1) ను సిరాజ్ ఎల్బీడబ్ల్యూగా వెనక్కు పంపాడు. ఆ తర్వాతి ఓవర్లోనే మహమ్మద్ షమీ డేవిడ్ వార్నర్ (5 బంతుల్లో 1) ను బౌల్డ్ చేశాడు. దీంతో 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 


అయితే ఆ తర్వాత ఆసీస్ కోలుకుంది. సూపర్ ఫాంలో ఉన్న మార్నస్ లబూషేన్, స్టీవెన్ స్మిత్ లు ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును నడిపించారు. ముఖ్యంగా లబూషేన్ ఎలాంటి తడబాటు లేకుండా బ్యాటింగ్ చేశాడు. స్పిన్నర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. మరోవైపు స్మిత్ కూడా క్రీజులో నిలదొక్కుకున్నాడు. వీరిద్దరూ లంచ్ సమయానికి మూడో వికెట్ కు అజేయంగా 74 పరుగులు జోడించారు. ప్రస్తుతం లబూషేన్ (110 బంతుల్లో 47, 8 ఫోర్లు), స్మిత్ (74 బంతుల్లో 19, 3 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. 






కేఎస్ భరత్, సూర్యకుమార్ టెస్ట్ అరంగేట్రం


'టాస్ గెలిస్తే మేం కూడా బ్యాటింగ్ చేసి ఉండేవాళ్లం. పిచ్ పొడిగా కనిపిస్తుంది. స్పిన్నర్లకు సహాయం ఉంటుంది. అయితే ఇది ఎంత వరకు ఉంటుందో వేచి చూడాలి. నిన్న మేము ప్రాక్టీస్ ప్రారంభించినప్పుడు పేసర్లకు కొంత సీమ్ లభించింది. మేము గత 5-6 రోజులుగా మంచి ప్రాక్టీస్ చేశాము. ఈ సిరీస్ యొక్క ప్రాముఖ్యత మాకు తెలుసు. అయితే ప్రస్తుతం మేం ఒక సెషన్ గెలవడం గురించి ఆలోచించాలి. ఇది సుదీర్ఘ సిరీస్. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు సీమర్లతో బరిలోకి దిగుతున్నాం. కేఎస్ భరత్, సూర్యకుమార్ యాదవ్ టెస్ట్ అరంగేట్రం చేస్తున్నారు.' అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.


భారత్ తుది జట్టు


రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ (డెబ్యూ), శ్రీకర్ భరత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.


ఆస్ట్రేలియా తుది జట్టు


డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబూషేన్, స్టీవెన్ స్మిత్, మాట్ రెన్షా, పీటర్ హ్యాండ్స్ కాంబ్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), నాథన్ లియాన్, టాడ్ మర్ఫీ, స్కాట్ బోలాండ్.