Fed Rate Hike:
అమెరికా ఎకానమీ ఆగమాగమైనా సరే! వడ్డీరేట్ల పెంపు మాత్రం ఆపేదే లేదంటోంది యూఎస్ ఫెడ్! ఇప్పటికే బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలుతోందని మొత్తుకుంటున్నా సరే మరోసారి రెపోరేటు పెంపుకు సిద్ధమైంది.
బుధవారం రోజు ఫెడ్ సమావేశం ముగిశాక.. కనీసం 25 బేసిస్ పాయింట్ల మేర పెంపు చేపట్టనుందని తెలిసింది. ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారుకుంటుందని నిపుణులు హెచ్చరించినా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు తప్పదని వాదిస్తోంది. కాగా ఈ ఏడాది ద్వితీయార్ధంలో అమెరికా మైల్డ్ రెసెషన్‌లోకి జారుకుంటుందన్న అంచనాలు భయపెడుతున్నాయి.
యూఎస్ ఫెడ్ వడ్డీరేటును 25 బేసిస్ పాయింట్ల మేర పెంచుతుందని అనలిస్టులు, ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. సుదీర్ఘ కాల లక్ష్యమైన 2 శాతానికి ద్రవ్యోల్బణాన్ని తీసుకురావాలని పట్టుదలగా ఉందంటున్నారు. 'ఫెడ్ వచ్చేవారం 25 బేసిస్ పాయింట్ల పెంచుతుందని మా అంచనా. జూన్ నుంచి రేట్ల పెంపును ఆపొచ్చు. ఇప్పటికైతే వడ్డీరేట్లు పైపైకి చేరడం ఖాయం' అని బ్యాంక్ ఆఫ్ అమెరికా ఎకానమిస్ట్ తమ క్లెయింట్లకు లేఖ రాశారు.
ఒకవేళ ఫెడ్ వడ్డీ రేటు పెంచితే ఇది వరుసగా పదో సారి పెంచినట్టు అవుతుంది. బెంచ్‌మార్క్ రేటు 5-5.25 శాతానికి చేరుకుంది. 2007 తర్వాత ఇదే అత్యధిక స్థాయి అవుతుంది. ఫ్యూచర్స్ ట్రేడర్లలో 80 శాతానికి పైగా ఫెడ్ 25 బేసిస్ పాయింట్లు వడ్డీరేటు పెంచుతుందని సీఎంఈ గ్రూప్ అంటోంది. గతంతో పోలిస్తే ఈ సమావేశం సంక్లిష్ట పరిస్థితుల్లో జరుగుతోంది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ దివాలీ తీసింది. చాలా బ్యాంకులు లిక్విడిటీ లేక దివాలా అంచున నిలిచాయి. ఇప్పుడు వడ్డీరేటు పెంచడం వల్ల క్రెడిట్ మార్కెట్ మరింత ఒత్తిడికి గురవుతుందని ఆక్స్‌ఫర్డ్ ఎకానమిస్టులు హెచ్చరిస్తున్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థ స్వల్ప మాంద్యంలోకి జారుకుంటుందని అమెరికా ఎకానమీ డేటా సూచిస్తోంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఎకనామిక్ ఔట్‌పుట్ 1.1 శాతానికి తగ్గిపోయిందని తెలిసింది. మరోవైపు ద్రవ్యోల్బణం 5.1 నుంచి 4.2 శాతానికి తగ్గింది. ఈ వారం ఫెడ్ భవిష్యత్తు గురించి సూచనలు చేస్తుండొచ్చని డ్యూస్టెక్ బ్యాంకు ఎకానమిస్టులు అంచనా వేస్తున్నారు. మార్చిలో వడ్డీరేట్లు ప్రకటించినప్పుడు మరొక్కసారి పెంచి ఆపేస్తాని ఫెడ్ ఛైర్‌పర్సన్ జెరోమ్ పావెల్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.