Gifts For Fathers on Father's Day 2024: ఈ ఏడాది జూన్‌ 16న (ఆదివారం) ప్రపంచ దేశాల్లో ఫాదర్స్ డే జరుపుకుంటున్నారు. నిజానికి దీనిని ఫాదర్స్‌ డే అనేకంటే "సూపర్‌ హీరోస్‌ డే" అంటేనే బాగుంటుంది. ఎందుకంటే, ప్రతి చిన్నారికి తన తండ్రే మొదటి హీరో. ఆయన చేసే పనులకు ఆశ్చర్యపోతూ పిల్లలు ఎదుగుతారు. తన తండ్రిలా తాను కూడా స్ట్రాంగ్‌గా మారాలనుకుంటారు.


సాధారణంగా, ఫాదర్స్ డే నాడు చాలా మంది పిల్లలు తమ తండ్రులకు మంచి బహుమతులు ఇస్తారు. గ్రేట్‌ డాడ్‌తో కలిసి కేక్ కట్ చేస్తారు, గదిని అందంగా అలంకరిస్తారు, ఆయనకు ఇష్టమైన వంటలు చేయిస్తారు. ఆ రోజును ప్రత్యేకంగా నిలబెట్టే అన్ని పనులు చేస్తారు. 


ఒకవేళ మీ తండ్రి వృద్ధుడయితే, మీ మీదే ఆధారపడి ఉంటే.. ఆయనకు బహుమతులు, కేక్‌ కట్‌ చేయడం వంటివి అవసరం లేదు. ఆయనకు మీ మద్దతు, ప్రేమ మాత్రం చాలా అవసరం. ఆయన కోసం మీరు కేర్‌ తీసుకుంటున్నారన్న విషయం ఆయన్ను ప్రశాంతంగా, సంతోషంగా ఉంచుతుంది. ఇదే జరిగితే.. ఏడాదిలో ప్రతి రోజూ హ్యాపీ ఫాదర్స్‌ డే అవుతుంది.


మీ వృద్ధ తండ్రికి ఇవ్వాల్సిన ఐదు విలువైన బహుమతులు


సమయం కేటాయించండి
ఒక వృద్ధ తండ్రికి తన పిల్లల నుంచి ఎక్కువగా అవసరమైన విషయం.. 'సమయం'. వృద్ధ తండ్రులు తమ పిల్లలతో కలిసి ఉండాలని కోరుకుంటారు. ఈ ముదుసలి వయస్సులో తన బిడ్డ తమకు సాయంగా నిలవాలని ఆశిస్తారు. ఒకవేళ తండ్రికి ఏదైనా అనారోగ్యం ఉంటే.. ఆయన దగ్గర కూర్చుని ఆరోగ్యం గురించి ఆరా తీయండి. మీ చేత్తో స్వయంగా మందులు ఇవ్వండి. ఆయనతో కలిసి భోజనం చేయండి, సరదాగా మాట్లాడండి. ముదుసలి తల్లిదండ్రులకు అవసరమైన బహుమతి ఇదే.


తండ్రితో మాట్లాడండి
తండ్రి అంటే సాధారణ వ్యక్తి కాదు, జీవితాన్ని కాచి వడపోసిన మహా జ్ఞాని. అతనితో కూర్చుని మాట్లాడితే చాలా సంతోషిస్తాడు. మీకు సరైన మార్గనిర్దేశం కూడా చేస్తాడు, ధైర్యం నింపుతారు. ముసలి తండ్రి - ఎదిగిన కొడుకు మధ్య చిన్నపాటి గొడవలు చాలా కుటుంబాల్లో కనిపిస్తాయి. అలాంటి చిన్న విషయాలను మీ నాన్నగారు ఎప్పటికీ పట్టించుకోరు, మీరు కూడా వదిలేయండి. ఒకవేళ నిజంగా తండ్రి తప్పు చేస్తే... ఆయనతో గొడవ పడకుండా, కోపం తెచ్చుకోకుండా కూర్చొని మాట్లాడండి. చిన్నతనం నుంచి మనం చేసిన వందలాది తప్పులను ఆయన చిర్నవ్వుతో భరించారు. ఆయన చేసిన ఒక్క తప్పును మనం భరించలేమా?.


అవసరాలు తీర్చండి
ఉద్యోగం కారణంగా మీ తల్లిదండ్రులకు మీరు దూరంగా ఉంటే, ఫాదర్స్‌ డే నాడు వాళ్ల దగ్గరకు వెళ్లి సంబరాలు చేసుకుంటే సరిపోదు. వీలైనప్పుడల్లా మీ తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకోండి. వారి అవసరాలు తీర్చండి. మీ తల్లిదండ్రులను కలవడానికి వెళ్ళినప్పుడల్లా, వారికి అవసరమైన మందులు, ఇతర సరుకులు, వస్తువులను మీతో తీసుకెళ్లండి.


మీ తండ్రి ఆరోగ్యమే మీ కుటుంబానికి మహాభాగ్యం
మీ నాన్నగారు ఆరోగ్యంగా ఉన్నంతకాలం మీ మీద ఈగ కూడా వాలదు. ఆయన ఆరోగ్యం, పెద్దరికమే మీ కుటుంబానికి రక్షణ కవచం. ఫాదర్స్‌ డే జరుకోవడంతోనే సరిపెట్టకుండా, మీ తండ్రి ఆరోగ్యం కోసం ఏవైనా చేయండి. ప్రతిరోజూ మీతో కలిసి వాకింగ్‌కు తీసుకెళ్లండి. తేలికపాటి వ్యాయామాలు చేయించండి. బలవర్ధకమైన ఆహారం ఇవ్వండి. ఇది ఆయన శారీరక ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఆయనకు నచ్చిన పాటలు, ఇష్టమైన పుస్తకాలను కొనివ్వండి. దీనివల్ల మీ నాన్నగారి మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ ప్రేమ, మీరు కేటాయించే సమయమే మీ నాన్నగారికి మీరు ఇచ్చే అతి విలువైన బహుమతులు అని గుర్తించండి.


మరో ఆసక్తికర కథనం: ఫాదర్స్ డే - ఒక తండ్రిగా మీ చిన్నారుల కళ్లల్లో ఆనందం చూడాలని ఉందా? ఈ గిఫ్ట్స్ ఇవ్వండి