EY Young Employee death row: ఎర్నెస్ట్ & యంగ్- EY యువ ఉద్యోగి.. ఉద్యోగంలో చేరిన నాలుగు నెలలకే తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా అనారోగ్యానికి గురై చనిపోవడం.. IT సంస్థల వర్క్ కల్చర్‌పై దేశవ్యాప్త చర్చకు దారీ తీసింది. ఈ ఘటనపై ఐటీ సంస్థల పనివిధానంపై పార్లమెంటులో గళమెత్తుతామని తృణమూల్ కాంగ్రెస్ స్పష్టం చేయగా.. వారానికి 40 గంటలు మాత్రమే పని ఉండేలా చట్టం చేయాలంటూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ డిమాండ్ చేస్తున్నారు. ఇన్‌ఫోసిస్ నారాయణమూర్తి చెప్పిన వారానికి 70 పని గంటల విధానంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆనా సెబాస్టియన్ మరణం.. ఓ హెచ్చరిక.. ?
పూనే ఈవై ఎంప్లాయీ 26 ఏళ్ల ఆనా సెబాస్టియన్ మరణం.. ఐటీ సంస్థల్లో వర్క్ కల్చర్ ఎంత దారుణంగా ఉందో చెప్పే ఓ ఉదంతంగా పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతేడాది సీఏ పూర్తి చేసిన కేరళలోని కొచ్చికి చెందిన ఆనా.. తన తొలి ఉద్యోగంగా ఈ ఏడాది మార్చిలో ఈవైలో చేరారు. చేరిన నాటి రోజూ 14 గంటలపాటు శ్రమిస్తూ ఒక రోజు ఇంట్లో తీవ్ర అనారోగ్యానికి గురై పడిపోగా.. ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యం తీసుకుంటూ అదే రోజు జులై 20న ఆనా మృతి చెందారు. ఆ తర్వాత అంత్యక్రియలకు మేనేజర్ సహా ఇతర సహోద్యోగులు ఎవరూ రాకపోవడం సహా కుమార్తె చావుకు దారితీసిన పరిస్థితులపై తీవ్ర కలత చెందిన ఆమె తల్లి అనిత అగస్టీన్ ఈవై ఛైర్మన్ రాజీవ్ మేమానికి ఈవైలో టాక్సిక్ వర్క్ కల్చర్ గురించి లేఖ రాసి మెయిల్ ద్వారా పంపారు. ఆ లేఖ బయటకు రావడంతో దేశవ్యాప్తంగా సంచలనం రేగింది. తన కుమార్తె రోజూ 14 గంటలు పనిచేసేదని.. తన మేనేజర్ కొన్ని సార్లు రాత్రిళ్లు కూడా వర్క్ అసైన్ చేసి తెల్లారే సరికి పూర్తి చేయాలని చెప్పే వాళ్లని అనిత లేఖలో పేర్కొన్నారు. అనేక సార్లు తన కుమార్తె ఇంటికి చాలా అలసటతో వచ్చేదని.. కొన్ని సార్లు ఛాతీలో ఇబ్బందిగా ఉందని కూడా చెప్పేదని రాజీవ్‌కు రాసిన లేఖలో తెలిపారు. తలకు మించి పనిభారం, అసంబద్ధమైన డెడ్‌లైన్‌లు కారణంగా తన కుమార్తె రోజులో ఎక్కువ భాగం పనిచేస్తూనే ఉండేదని.. ఉద్యోగంకి రిజైన్ చేయమంటే.. ఎదగడానికి కష్టపడక తప్పదని చెప్పేదని అనిత గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో యాంగ్జైటీ ఇష్యూస్ కూడా వచ్చాయని.. వైద్యులు నిద్రలేని కారణంగా ఈ ఇబ్బందులు అనిచెప్పినా.. టార్గెట్‌లు రీచ్ అయ్యేందుకు కష్టపడి చివరకు ప్రాణాలు వొదిలినా.. సంస్థ నుంచి ఎవరూ అంత్యక్రియలకు రాకపోవడం బాధ కలిగించిందని అనిత పేర్కొన్నారు. ఈ టాక్సిక్ వర్క్ కల్చర్ మారాలని రాజీవ్‌కు అనిత సూచించారు.
ఆనా మరణంపై తొలిసారి స్పందించి ఆమె తండ్రి:
తీవ్ర పని ఒత్తిడే తన కుమార్తె మరణానికి కారణమని ఆనా సెబాస్టియన్ తండ్రి సిబి జోసెఫ్ తెలిపారు. అనేకసార్లు పని ఒత్తిడికి సంబంధించి తాను అసిస్టెంట్ మేనేజర్
కంప్లైంట్ చేసినప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోగా.. మరింతగా పని ఒత్తిడి పెంచారని సిబి ఆరోపించారు. తన కుమార్తె మరణం విషయంలో తాము ఏ లీగల్ పోరాటం చేయబోవడం లేదని స్పషం చేసిన జోసెఫ్.. తమ కుమార్తెకు ఎదురయిన పరిస్థితులు భవిష్యత్‌లో మరే ఉద్యోగికి ఎదురు కాకుండా చూడాలని కోరారు. కొత్త ఉద్యోగులు ఎవరూ ఇలాంటి సంస్థల్లో కెరీర్ మొదలు పెట్టొద్దని మాత్రమే తాము సూచిస్తామని అన్నారు. పాత ఈవై ఎంప్లాయీస్ కూడా అక్కడ పనితీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఈ మొత్తం ఘటనపై కేంద్రం విచారణకు ఆదేశించింది. విచారణ పూర్తైన తర్వాత బాధ్యులపై కఠినచర్యలు ఉంటాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియ తెలిపారు. ఈవై సంస్థ తరహా ఘటనలపై పార్లమెంటులో గళమెత్తనున్నట్లు తృణమూల్ పార్టీ తెలిపింది,. కొచ్చిలోని ఆనా తల్లిదండ్రులను పరామర్శించిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్.. వారానికి 40 గంటలు మాత్రమే పనిదినాలు ఉండేలా చట్టం తీసుకురావాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు.
కర్ణాటకలో పని గంటల పెంపునకు ప్రయత్నం:
కర్ణాటక నుంచి అన్ని రకాల ఉత్ప్తత్తులు ఎగుమతులు పెంచడమే లక్ష్యంగా ఐటీ ఆఫీసులతో పాటు షాపింగ్ మాల్స్ ఇతర ఉత్పత్తి సంస్థల పనిగంటలనో రోజుకు 9 నుంచి 12 గంటలకు పెంచాలని కొద్ది నెలల క్రితం కర్ణాటక సర్కారు ప్రయత్నించింది. 9 సాదారణ పని గంటలు కాగా అదనంగా ఉన్నవి.. అదనపు పని గంటలుగా పేర్కొంది. ఐతే ఈ విధానంపై రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక, ఉద్యోగ సంఘాలు, అపోజిషన్ పార్టీల నుంచి తీవ్ర వ్యతీరేకత వ్యక్తం కావడంతో తర్వాత వెనక్కి తగ్గింది. ఇన్‌ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి వంటి వారు వారంలోపని గంటల సంఖ్య 70కి పెంచాలని సూచనలు చేస్తుండగా.. ఆనా మరణం ఐటీ సంస్థల వర్క్ కల్చర్‌లో ఒత్తిళ్లను మరో సారి ఎత్తి చూపింది. ఒక్క ఈవైనే కాకుండా ఇంకా అనేక సంస్థల్లో ఉద్యోగులు తాము ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న సమస్యలు సోషల్ మీడియా వేదికగా ఏకరవు పెడుతున్న వేళ.. పని గంటల పెంపుపై ఐటీ సంస్థలు పునరాలోచన చేసే అవకాశం ఉంది.