EPFO News Update: ఉద్యోగుల భవిష్య నిధి (Employee Pension Fund)ని నిర్వహిస్తున్న ఈపీఎఫ్‌వోలో భారీ మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. కనీస పెన్షన్ పరిమితిని (Minimum Pension Limit) ప్రస్తుతమున్న రూ. 1,000 నుంచి పెంచే అవకాశం ఉంది. పదవీ విరమణ సమయంలో పెన్షన్ ఫండ్ నుంచి పాక్షిక ఉపసంహరణకు (EPF Partial Withdrawl) కూడా అనుమతించొచ్చు. నెలవారీ ఆదాయం రూ.15,000 కంటే ఎక్కువ ఉన్నవారి కోసం కూడా ఈ పథకాన్ని ఆకర్షణీయంగా మార్చాలన్న ప్రతిపాదన టేబుల్‌పై ఉంది.
పోర్టల్ ద్వారా విత్‌డ్రా ఫెసిలిటీ
మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వర్గాలకు చెందిన EPF చందాదార్ల కోసం EPFO వ్యవస్థను సమర్థవంతంగా & ఆకర్షణీయంగా మార్చాలని కేంద్ర కార్మిక & ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా మంత్రిత్వ శాఖకు, EPFO అధికారులకు సూచించారు. EPFOను బ్యాంక్ తరహాలో మార్చాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం, ఇప్పటికే ఉన్న రూల్స్‌లో అవసరమైన మార్పులు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. వైద్య అత్యవసర సమయాల్లో, వివాహాలు, పిల్లల చదువుల కోసం EPF పోర్టల్ ద్వారానే డబ్బును సులభంగా విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతించాలని, దీనికోసం మెరుగైన మార్పులు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికోసం, అవసరమైతే నిబంధనల్లో సమూల మార్పులు కూడా చేయవచ్చు.
EPF మెంబర్లను ఆకర్షించేలా ఆప్షన్లు
పదవీ విరమణ సమయంలో, అకౌంట్ బ్యాలెన్స్‌ను ఉపసంహరించుకునేందుకు చందాదార్లకు అనువుగా ఉండేలా రూల్స్ మార్చాలని కేంద్ర కార్మిక మంత్రి అధికార్లకు సూచించారు. విత్‌డ్రా ప్రాసెస్ ఈజీగా ఉంటే, చందాదార్లు ముందుగా అనుకున్న ఆర్థిక ప్రణాళికను చక్కగా అమలు చేసుకుంటారని, పెద్ద మొత్తంలో చేతికి వచ్చే డబ్బును సద్వినియోగం చేసుకుంటారని చెప్పారు. ఏటా పొందే మొత్తాన్ని పెన్షన్‌గా మార్చుకునే ఏర్పాటు కూడా ఉండొచ్చు. ఈ మార్పు ద్వారా, చందాదారుడు కొంత మొత్తాన్ని యాన్యుటీలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది & మిగిలిన మొత్తాన్ని విత్‌డ్రా చేసుకుంటాడు. తద్వారా, 'నేషనల్ పెన్షన్ సిస్టమ్'కు (NPS) సమానమైన చెల్లింపు వ్యవస్థను సృష్టించేందుకు వీలవుతుంది.
రూ.1000 కంటే ఎక్కువ పెన్షన్
EPF మెంబర్లు, తమ పదవీ విరమణ తర్వాత ఎక్కువ పెన్షన్ పొందడానికి 'ఉద్యోగుల పెన్షన్ పథకం'లో చాలా మార్పులు చేయాల్సి రావచ్చు. అదే సమయంలో, నెలకు 15,000 రూపాయల కంటే ఎక్కువ సంపాదించే EPF సభ్యుల కోసం ఈ పథకాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాలని కూడా కార్మిక మంత్రి సూచించారు. EPFO, పెన్షన్ పథకం EPSని కూడా నిర్వహిస్తుంది. కాబట్టి, EPSలో పెట్టుబడి పరిమితి పెంపుతో పాటు పలు మార్పులపై మంత్రి చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ & ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ కోసం ఉద్యోగి ప్రతి నెలా తన బేసిక్ పేలో 12 శాతాన్ని పెట్టుబడిగా పెడుతున్నాడు. ఆ కంపెనీ యాజమాన్యం కూడా అదే మొత్తాన్ని ఉద్యోగి ఖాతాలో జమ చేస్తోంది.
భవన నిర్మాణ కార్మికుల పేరుతో వివిధ రాష్ట్రాలు వసూలు చేసి, నిరుపయోగంగా పడి ఉన్న నిధులను ఉపయోగించుకోవాలని మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. ప్రస్తుతం, రాష్ట్రాల దగ్గర దాదాపు రూ.75,000 కోట్ల ఫండ్ ఉంది. ఈ డబ్బును ప్రావిడెంట్ ఫండ్ కార్పస్‌తో పాటు పెన్షన్ కోసం ఉపయోగించే అవకాశం ఉంది.
మరో ఆసక్తికర కథనం: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ యాప్ ప్రారంభం - బ్రహ్మాండమైన ఫీచర్లు, ఆఫర్లు