Elon Musk Twitter: ట్విటర్లో ఉద్యోగుల కోత ప్రక్రియ ముగిసిందని సమాచారం. త్వరలోనే ఇంజినీరింగ్‌ ఇతర విభాగాల్లో నియామకాలు మొదలవుతాయని కంపెనీ సీఈవో ఎలన్‌ మస్క్ అన్నారు. ఆర్థిక పరిస్థితుల వల్లే ఉద్యోగులను ఇంటికి పంపించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ మేరకు వెర్జ్‌ ఓ కథనం ప్రచురించింది.


టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ కొన్ని రోజుల క్రితమే మైక్రో బ్లాగింగ్‌ వేదిక ట్విటర్‌ను కొనుగోలు చేశారు. వెంటనే సంస్థాగత చర్యలు చేపట్టారు. బ్లూటిక్‌ అంశంలో రకరకాల ప్రయోగాలు చేశారు. కంపెనీ నష్టాలను తగ్గించేందుకు ఉద్యోగులపై వేటు వేశారు. అంతర్జాతీయంగా దాదాపు 7500 మందిని తొలగించారు. ఇంటి వద్ద పనిచేస్తున్న వారికి ఆఫీస్‌కు రావాలని ఆదేశించారు. కఠోరంగా శ్రమించకపోతే ఇంటికి పంపించేస్తామని హెచ్చరించారు.




'ట్విటర్‌ రోజుకు 4 మిలియన్‌ డాలర్ల వరకు నష్టపోతోంది. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఉద్యోగుల కోత అమలు చేశాం. బయటకు వెళ్లిన ప్రతి ఒక్కరికీ మూడు నెలల పరిహారం అందించాం. చట్టం నిర్దేశించిన పరిమితి కన్నా 50 శాతం ఎక్కువే ఇచ్చాం' అని మస్క్‌ గతంలో ట్వీట్ చేశారు. ప్రస్తుతానికైతే కోతలు ముగిశాయని ఇంజినీరింగ్‌, సేల్స్‌ విభాగాల్లో నియామకాలు ఉంటాయని ఆయన పరోక్షంగా సూచించారని తెలిసింది.


అత్యద్భుతంగా సాఫ్ట్‌వేర్‌ను రాయగలిగేవారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని మస్క్‌ చెప్పినట్టు తెలిసింది. అలాగే డ్యుయల్‌ హెడ్‌ క్వార్టర్‌ విధానం అమలు చేస్తారని సమాచారం. ఇప్పుడున్న కాలిఫోర్నియాతో పాటు టెస్లా ఉన్న టెక్సాస్‌లో మరోటి పెడతారట. వేతనాలు ఎప్పట్లాగే ఉంటాయని, స్టాక్‌ ఆప్షన్లు ఇస్తామని ఉద్యోగులతో మస్క్‌ అన్నారట. టెస్లా మాదిరిగానే క్రమం తప్పకుండా నగదు చెల్లింపులు ఉంటాయని పేర్కొన్నారు. 'కింది స్థాయి నుంచి టెక్నాలజీని మెరుగుపర్చాల్సి ఉంది. అందుకే భారత్‌, జపాన్‌, ఇండోనేసియా, బ్రెజిల్‌లో ఇంజినీరింగ్‌ బృందాలను ఏర్పాటు చేస్తాం. ట్విటర్‌ పునర్‌ నిర్మాణంలో కొన్ని పొరపాట్లు జరిగే మాట నిజమే. సమయం గడిచే కొద్దీ అవన్నీ సరవుతాయి' అని ఆయన వెల్లడించారు.