Tesla CEO Elon Musk Salary Package: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలాన్ మస్క్‌కు ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ టెస్లా నుంచి అందిన జీతంపై వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ గొడవకు గత 6 సంవత్సరాలుగా కామా తప్ప ఫుల్‌స్టాప్ పడలేదు. ఇప్పుడు, ఎలాన్ మస్క్ పే ప్యాకేజీని (Elon Musk Pay Package) ఆమోదించడానికి కంపెనీ యాజమాన్యం కొత్తగా ప్రయత్నాలు చేస్తుండగా, కంపెనీకి చెందిన వాటాదార్ల గ్రూప్ ఆ ప్రయత్నాలను తిప్పి కొట్టాలని చూస్తోంది. కంపెనీ నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకిస్తోంది. టెస్లా వాటాదార్లు (Tesla Shareholders) అంటే మామూలు వ్యక్తులు కాదు, పెద్ద కంపెనీలు.
షేర్‌హోల్డర్లందరికీ ఓపెన్ రిక్వెస్ట్
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, ఎలాన్ మస్క్‌కు అందించే ప్రతిపాదిత ప్యాకేజీని వ్యతిరేకించే వాటాదార్ల గ్రూప్‌లో.. న్యూయార్క్ సిటీ కంప్ట్రోలర్ బ్రాడ్ లెండర్, SOC ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్, అమాల్గమేటెడ్ బ్యాంక్ ఉన్నాయి. ఈ బృందం, సంస్థలోని పెట్టుబడిదార్లందరినీ ఉద్దేశించి ఒక బహిరంగ లేఖ విడుదల చేసింది. టెస్లా సీఈవోకు అందించే బిలియన్ డాలర్ల ప్రతిపాదిత పే ప్యాకేజీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేసింది.
వెనక్కు తగ్గని టెస్లా యాజమాన్యం
గత నెల ప్రారంభంలో, టెస్లా ఛైర్మన్ రాబిన్ డెన్హోమ్ ఈ విషయంలో వాటాదార్లను ఉద్దేశించి ఒక లేఖ రాశారు. ఎలాన్ మస్క్‌ను టెస్లాలో అత్యంత ముఖ్యమైన ఉద్యోగిగా అభివర్ణించారు. జీతపు వివాదాల కారణంగా, టెస్లా అత్యంత ముఖ్యమైన ఉద్యోగి ఎలాన్ మస్క్ గత 6 సంవత్సరాలుగా తన పనికి ఎలాంటి వేతనం పొందలేదని, అయితే ఈ సమయంలో మస్క్ కంపెనీకి & వాటాదార్లకు మేలు చేశాడని డెన్హోమ్ వెల్లడించారు. ఈ సంవత్సరాలు టెస్లాకు గొప్ప విలువను సృష్టించాయని, మస్క్ ప్యాకేజీకి అనుకూలంగా ఓటు వేయాలని ఆయన వాటాదార్లకు విజ్ఞప్తి చేశారు.
ఎలాన్ మస్క్ డిమాండ్
ప్రస్తుతం, ఎలాన్ మస్క్‌కు టెస్లాలో దాదాపు 13 శాతం వాటా ఉంది. టెస్లాలో తన వాటాను పెంచుకోవాలని మస్క్ డిమాండ్ చేస్తున్నారు. టెస్లాలో కనీసం 25 శాతం వాటా తనకు రాకపోతే, EVకి బదులుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & రోబోటిక్స్ మొదలైన వాటిపై పనిచేయడానికి ఇష్టపడతానని గతంలో చాలా సందర్భాల్లో చెప్పారు.
టెస్లా ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. అమ్మకాల పరంగా, కొన్ని నెలల క్రితం వరకు ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రిక్ కంపెనీగా ఉన్న టెస్లా ఇప్పుడు ఆ స్థానాన్ని కోల్పోయింది. చైనీస్ EV కంపెనీ BYD విక్రయాల పరంగా ముందుకు దూసుకొచ్చింది. టెస్లా, అనేక ఇతర కొత్త చైనీస్ EV కంపెనీలకు తన మార్కెట్ వాటాను కోల్పోతోంది. అటువంటి పరిస్థితిలో, ఎలాన్ మస్క్ పే ప్యాకేజీపై సంవత్సరాలుగా కొనసాగుతున్న వివాదాన్ని వీలైనంత త్వరగా ముగించాలని టెస్లా కోరుకుంటోంది.
వచ్చే నెలలో వార్షిక సర్వసభ్య సమావేశం
ఈ వివాదాన్ని ముగించడానికి, టెస్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలాన్ మస్క్ కోసం 56 బిలియన్ డాలర్ల భారీ పే ప్యాకేజీకి యాజమాన్యం ఒక ప్రతిపాదనను సిద్ధం చేసింది. వాస్తవానికి, కంపెనీ 2018లోనే ఈ ప్యాకేజీని సిద్ధం చేసింది, కానీ ఇంకా ఆమోదం పొందలేదు. ఇప్పుడు ఆ ప్రతిపాదనకు షేర్‌హోల్డర్ల ఆమోదం కోసం కంపెనీ ప్రయత్నిస్తోంది. టెస్లా వాటాదారుల వార్షిక సాధారణ సమావేశం జూన్ 13 నుంచి ప్రారంభం అవుతుంది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి