Elon Musk: బిలియనీర్‌, 51 ఏళ్ల ఎలాన్‌ మస్క్‌ జోరు మళ్లీ పెరిగింది. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు టెస్లా షేర్‌ ధర ‍‌(Tesla Share Price) 74% ర్యాలీ చేసింది. దీంతో, ఎలాన్‌ మస్క్‌ వ్యక్తిగత సంపద కూడా సర్రున పెరిగింది. ప్రస్తుతం నం.1గా ఉన్న బెర్నార్డ్ ఆర్నాల్ట్‌కు (Bernard Arnault) అతి సమీపంలోకి నం.2 మస్క్‌ చేరుకున్నారు. త్వరలోనే అతన్ని దాటి, ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా తన టైటిల్‌ను తిరిగి పొందే అవకాశం ఉంది.


మామ మనసు వెన్న
ఫ్రెంచ్ లగ్జరీ గూడ్స్ వ్యాపారి బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను అధిగమించడానికి మస్క్‌కి మరికొంచెం సమయం పట్టవచ్చు. ఎందుకంటే, 2022 ఆగస్టు - డిసెంబర్ మధ్య కాలంలో 11.6 మిలియన్ల టెస్లా షేర్లను స్వచ్ఛంద సేవా సంస్థలకు విరాళంగా ఇచ్చారట. ఆ సెక్యూరిటీలను విరాళంగా ఇచ్చిన రోజు ముగింపు ధరల ఆధారంగా వాటి విలువ సుమారు 1.9 బిలియన్‌ డాలర్లు.


ఒక బిలియన్‌ డాలర్ల తేడా
ప్రస్తుతం, మస్క్ - ఆర్నాల్ట్‌ సంపదల గ్యాప్‌ను 1 బిలియన్ డాలర్ల కంటే తక్కువగా ఉంది. షేర్లను విరాళంగా ఇవ్వకపోతే, మస్క్‌ ఇప్పటికే తిరిగి నం.1 పొజిషన్‌కు చేరుకుని ఉండేవాడు. వాటి సంగతి ఇక పక్కనబెడితే, ఇప్పుడు టెస్లా ఎలక్ట్రిక్ కార్లకు గ్లోబల్‌ డిమాండ్‌ బాగా పెరుగుతోంది. దీంతో, షేర్‌ ప్రైస్‌లో మరింత ర్యాలీని ఆశించవచ్చు. 


బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, తాజా విరాళం తర్వాత మస్క్‌ సంపద 191.3 బిలియన్‌ డాలర్లు. 2021 చివరిలో 300 బిలియన్‌ డాలర్లకు పైగా సంపదతో ఎవరూ అందుకోలేనంత ఎత్తులో ఉన్నాడు. ట్విట్టర్‌ (Twitter) కొనుగోలుకు ముందు వరకు హై రేంజ్‌లో కొనసాగాడు. ట్విట్టర్‌ కొనుగోలు తర్వాత అష్టకష్టాలు చుట్టుముట్టాయి, 2022లో సంపద అతి భారీగా ఆవిరైంది. ఈ సంవత్సరం పరిస్థితి మారింది, 54 బిలియన్‌ డాలర్లకు పైగా పెరిగింది.


టెస్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (Tesla CEO), ఆ కంపెనీలో అతి పెద్ద వాటాదారు అయిన మస్క్, 2021లోనూ సుమారు 5.7 బిలియన్‌ డాలర్ల విలువైన టెస్లా షేర్లను విరాళంగా ఇచ్చాడు. చరిత్రలోనే అతి పెద్ద దాతృత్వ విరాళాల్లో అది కూడా ఒకటి. ఆ విరాళం గ్రహీత మస్క్ ఫౌండేషన్. విద్యాభివృద్ధి, కర్బన ఉద్గారాల నిర్మూలన ప్రాజెక్టులు సహా స్వచ్ఛంద సంస్థలకు ఈ ట్రస్ట్‌ ద్వారా నిధులు వెళ్లాయి.


అమెరికా నిబంధనల ప్రకారం, ఆ దేశంలోని ప్రైవేట్ ఫౌండేషన్‌లు ప్రతి సంవత్సరం తప్పనిసరిగా 5% ఆస్తులను స్వచ్ఛంద సేవల కోసం ఖర్చు చేయాలి. 


ట్రస్ట్‌ తరపునే కాదు, వ్యక్తిగతంగానూ విరాళాలు ఇస్తున్నాడు మస్క్‌. 2021లో, మస్క్ వ్యక్తిగతంగా సుమారు 160 మిలియన్‌ డాలర్లను లాభాపేక్ష రహిత సంస్థలకు విరాళంగా ఇచ్చాడు. 


అమెరికాలోని అతి పెద్ద ఫౌండేషన్లలో మస్క్‌ ఫౌండేషన్‌ కూడా ఒకటి. అయితే, సిబ్బంది పరంగా మాత్రం చాలా చిన్నది. ఇటీవల సమర్పించిన ఆదాయ పన్ను పత్రాల్లో, ఫౌండేషన్‌లో ఇద్దరు డైరెక్టర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇతర ఏ ఉద్యోగి గురించి ప్రస్తావించ లేదు. దీనిని బట్టి... అతి తక్కువ మంది సిబ్బందితో ఫౌండేషన్‌ నడుపుతున్న మస్క్, అతి భారీ విరాళాలు అందిస్తున్నాడు.


అతి పెద్ద అమెరికన్‌ ఫౌండేషన్ అయిన బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌కు (Bill and Melinda Gates Foundation) 2021 చివరి నాటికి సుమారు 55 బిలియన్‌ డాలర్ల ఆస్తులు ఉన్నాయి. ఆ సంవత్సరంలో సుమారు 6.2 బిలియన్‌ డాలర్ల గ్రాంట్లను ఆ సంస్థ విరాళంగా ఇచ్చింది. దీనికి 1,700 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు.


స్పేస్‌ఎక్స్‌లోనూ (SpaceX) అతి పెద్ద వాటాదారు అయినా, మస్క్ సంపదలో ఎక్కువ భాగం టెస్లా స్టాక్‌లో ముడిపడి ఉంది. ట్విట్టర్ కొనుగోలు కోసం, గత సంవత్సరం 20 బిలియన్‌ డాలర్లకు పైగా విలువైన టెస్లా షేర్లను మస్క్‌ అమ్మేశారు.