Elon Musk : ఎక్స్ (Twitter)ను కొనుగోలు చేసినప్పట్నుంచి స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. కఠిన నిబంధనలకు శ్రీకారం చుట్టిన మస్క్.. ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నారు. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఆయన.. ట్విట్టర్ పేరును ఎక్స్‌గా మార్చి వార్తల్లో నిలిచారు. ఇప్పుడు ఎక్స్‌లో ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ చేసి యూజర్స్‌ను ఆకర్షించారు. ఇంతకీ ఆయనేం చేశారన్న విషయానికొస్తే.. మస్క్ తన కొత్త పేరును ప్రకటించారు. కెకియస్ మాక్సిమస్ తన కొత్త పేరంటూ సర్ఫ్రైజ్ చేశారు. అంతేకాదు మస్క్ తన ప్రొఫైల్ పిక్‌ను కూడా మార్చేశారు. ఇప్పుడు ఆయన డీపీగా పెపె ది ఫ్రాగ్ మీమ్ ఊహాత్మక వెర్షన్‌ను పెట్టారు. ఈ ఫొటోలో పెపె ఒక యోధుడి వేషంలో కనిపిస్తుండగా.. కవచం ధరించి, వీడియో గేమ్ కోసం జాయ్ స్టిక్ పట్టుకున్నట్టు కనిపిస్తోంది.


మస్క్ కొత్త పేరు కెకియస్ మాక్సిమస్ - అర్థం ఇదే


కెకియస్ మాక్సిమస్ అనే పేరు ఇటీవలి కాలంలో క్రిప్టోకరెన్సీ రంగంలో బాగా ప్రసిద్ధి చెందింది. ఇది కొత్తగా ప్రాచుర్యం పొందిన మీమ్ కాయిన్, కెకియస్ నుంచి పుట్టింది. గత కొద్ది రోజులుగా దీనికి సంబంధించిన కార్యకలాపాలు పెరిగి ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. ఈ ప్రత్యేకమైన పాత్ర ప్రఖ్యాత చిత్రంగా పేరొందిన వీరోచిత వ్యక్తి మాక్సిమస్‌తో ఐకానిక్ పెపె ది ఫ్రాగ్ మీమ్‌ను మిళితం చేస్తుంది. అయితే మస్క్ తన పేరును ఎందుకు మార్చుకున్నాడనే విషయం మాత్రం వెల్లడించలేదు. కానీ ఎక్స్‌లో మస్క్ పేరు మార్చుకోవడం కూడా క్రిప్టో మార్కెట్‌లో అతని పాత్రకు సూచనగా తలపిస్తోంది.





పేరు మార్పునకు కారణం ఇదేనా


అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ క్రిప్టోపై ఆంక్షలు విధించడం, క్రిప్టోను బ్యాన్ చేయడం వంటి అంశాల నేపథ్యంలో ఎలాన్ మస్క్ క్రిప్టో కరెన్సీకి కాస్త దూరంగా ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ట్రంప్ గెలవడం.. క్రిప్టోలో తన హవాను చూపేందుకు మస్క్ తన పేరును మార్చుకున్నారని పలువురు భావిస్తున్నారు. ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


కెకియస్ హవా


టెక్ మొగల్ ఎలోన్ మస్క్ తన ఎక్స్ అకౌంట్‌లో ఈ పేరును ప్రకటించిన తర్వాత.. డిసెంబర్ 27 నాటికి కేకియస్‌ దాదాపు 0.005667 డాల‌ర్ల‌ వద్ద అమ్ముడవుతుండ‌గా.. 24 గంటల్లోనే ఏకంగా 497.56 శాతం పెరుగుదలను న‌మోదు చేసింది. క్రిప్టో కరెన్సీలో ఎలాన్ మస్క్‌ను హర్షద్ మెహతాలా పేర్కొంటుంటారు చాలామంది. గతంలోనూ ఆయన డోజ్ కాయిన్ విలువను కూడా అమాంతం పెంచేశారు. దాన్ని ఒక గొప్ప కాయిన్‌గా మార్చగా.. ఇప్పుడు కెకియస్ కాయిన్‌ను మార్చేయాలని చూస్తున్నారు. అందులో భాగంగానే ఆ కాయిన్ కేవలం 24 గంటల్లో తన ఆల్ టైం గరిష్టాన్ని తాకింది. దీంతో దీని ధర మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ కాయిన్ విలువ 810% పెరగడం గమనార్హం.


ఎలాన్‌ మస్క్‌ అరుదైన రికార్డ్


ఎలాన్‌ మస్క్‌ ఇటీవలే ఓ అరుదైన రికార్డు సృష్టించారు. ఆయ‌న‌ వ్యక్తిగత సంపద ఏకంగా 400 బిలియన్‌ డాలర్ల మార్కును దాటేసింది. ఇప్పటిదాకా ఈ మైలురాయిని ఎవరూ అధిగమించలేదు. దీంతో ఈ రికార్డును సొంతం చేసుకున్న తొలి వ్యక్తిగా మస్క్‌ నిలిచారు. బ్లూంబర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ తాజా వివరాల ప్రకారం మస్క్‌ సంపద విలువ 447 బిలియన్‌ డాలర్లకు చేరింది.


Also Read : ITR Filing: పన్ను చెల్లింపుదార్లకు గుడ్‌ న్యూస్‌ - ITR ఫైలింగ్‌ గడువు పెంచిన టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌