2G- 3G Services Shutting Down Demand: ప్రస్తుతం దేశంలో దాదాపుగా అన్ని ప్రాంతాల్లో 4G, 5G నెట్‌వర్క్‌ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి..  2G, 3G సేవలను నిలిపేస్తారా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (RIL) అధిపతి, బిలియనీర్ బిజినెస్‌మ్యాన్‌ ముక్‌ష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో (Reliance Jio), 2G, 3G సర్వీసులను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఆ సేవలు వినియోగించుకుంటున్న కస్టమర్లందరినీ 4G, 5G నెట్‌వర్క్‌లోకి మార్చాలని అడింగింది. ఈ డిమాండ్‌కు సంబంధించి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) ఒక ప్రకటన విడుదల చేసింది. 


దేశంలో 2G నెట్‌వర్క్‌ను మూసివేసే విషయంలో టెలికాం డిపార్ట్‌మెంట్ జోక్యం చేసుకోకూడదని, కాబట్టి రిలయన్స్ జియో డిమాండ్‌ను తిరస్కరించినట్లు ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్‌ చేసింది. అది, టెలికాం ఆపరేటర్లు తీసుకోవలసిన వాణిజ్య నిర్ణయమని డాట్‌ చెప్పినట్లు తెలిసింది. టెలికాం సేవలను నిలిపేసే విషయాల్లో జోక్యం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావించడం లేదని, ఏది మంచో నిర్ణయించుకునే స్వేచ్ఛ టెలికాం కంపెనీలు ఉందని టెలికాం డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసినట్లు ఈటీ రిపోర్ట్‌ చేసింది.


మరో ఆసక్తికర కథనం: రికార్డ్‌ స్థాయిలో నిఫ్టీ ప్రారంభం, అక్కడ్నుంచి పతనం - ఈ రోజూ అదే చిత్రం


6G నెట్‌వర్క్‌ ప్రారంభం కోసం సన్నాహాలు
భారతదేశంలో 6G నెట్‌వర్క్‌ సేవలను ప్రారంభించేందుకు గత సంవత్సరం నుంచి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంత అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీలోకి మారుతున్న పరిస్థితుల్లో.. 2G, 3G సాంకేతికతలను ఇంకా కొనసాగించడం ఎంత వరకు సబబు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే.. మన దేశంలో 2G, 3G నెట్‌వర్క్‌లను వినియోగించే జనాభా ఇప్పటికీ అత్యధికంగా ఉందన్నది నిజం. 1992లో మన దేశంలోకి 2G నెట్‌వర్క్ వచ్చింది, ఇప్పటికి 32 ఏళ్లు పూర్తయ్యాయి. 


ఏ నెట్‌వర్క్ ఎప్పుడు వచ్చింది?                    
2G - 1992                
3G - 2001             
4G - 2009             
5G - 2019              


భారతదేశంలో దాదాపు 25 నుంచి 30 కోట్ల మంది కస్టమర్లు ఇప్పటికీ 2G ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సాంకేతికత కనీసం మరో రెండు, మూడు సంవత్సరాల వరకు ప్రధాన స్రవంతిలోనే ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా, స్మార్ట్‌ఫోన్ కొనలేని వాళ్లు 2G, 3G నెట్‌వర్క్‌లకు మాత్రమే పరిమితమవుతున్నారు. టెలికాం పరిశ్రమ డేటా ప్రకారం.. ఏటా దాదాపు 5 కోట్ల 2G ఫోన్లు అమ్ముడవుతున్నాయి.


భారతదేశంలో 2G నెట్‌వర్క్‌ను షట్‌డౌన్‌ చేయడానికి, వినియోగదార్లందరినీ 4G, 5G లకు మార్చడానికి రిలయన్స్ జియో కేంద్ర ప్రభుత్వ మద్దతును కోరుతోంది. ఇతర టెలికాం కంపెనీలు చాలా ఏళ్లుగా ఈ టెక్నాలజీని వినియోగదార్లకు అందిస్తున్నాయి. జియోకు మాత్రం 2G ఎప్పుడూ లేదు. 


మరో ఆసక్తికర కథనం: ఒకే దెబ్బకు రెండు పిట్టలు - అధిక రాబడితో పాటు పన్ను నుంచి మినహాయింపు