SpiceJet, IndiGo: మన దేశంలో కొవిడ్‌ ఆంక్షలు తగ్గిన తర్వాత దేశీయంగా విమాన ప్రయాణాలు జోరందుకున్నాయి. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న కొద్దీ విమాన ప్రయాణీకుల సంఖ్య పెరుగుతోంది. దేశీయంగా (డొమెస్టిక్‌) ప్రయాణాలు చేసే వాళ్ల సంఖ్య నెలనెలా వృద్ధి చెందుతూనే ఉంది. 


విద్య, వ్యాపార పనులు కోసం దేశీయ విమానాల్లో ప్రయాణాలు చేసే వాళ్లతోబాటు, రిలాక్సేషన్‌ కోసం రివెంజ్‌ టూరిజం పెట్టుకున్నవాళ్లు కూడా భారీ సంఖ్యలోనే ఉన్నారు. కరోనా కాలంలో ఇళ్లలో కూర్చుని, కూర్చుని బోర్‌ కొట్టి.. కావాలనే విహార యాత్రలు పెట్టుకోవడాన్నే రివెంజ్‌ టూరిజంగా పిలుస్తున్నారు.


కోటి మంది ప్రయాణీకులు
మన దేశంలో విమాన ప్రయాణాల విషయానికి వస్తే.. డొమెస్టిక్‌ ఎయిర్‌ ట్రాఫిక్ ఈ ఏడాది ఆగస్టు నెలలో కోటి దాటింది. ఆ నెలలో దేశీయంగా విమానాల్లో తిరిగిన వాళ్ల సంఖ్య 101.16 లక్షలు లేదా 1.01 కోట్లు. గతేడాది ఆగస్టు కంటే ఇది 51 శాతం వృద్ధి. అంటే, విమాన ప్రయాణీకుల సంఖ్య ఎంత వేగంగా పెరుగుతోందో అర్ధం చేసుకోవచ్చు.


అధికారిక సమాచారం ప్రకారం.. జులైలో దేశీయ విమానాల్లో 97.05 లక్షల మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించారు.


ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు (8 నెలల కాలం) వరకు దేశీయ విమానయాన సంస్థలు రవాణా చేసిన ప్రయాణీకుల సంఖ్య 770.70 లక్షలు లేదా 7.7 కోట్లు. అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంలో ఇది 460.45 లక్షలు లేదా 4.60 కోట్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే, ఈ 8 నెలల కాలంలో 67.38 శాతం వృద్ధి కనిపించింది. 


కొవిడ్ పూర్వ స్థాయి కంటే తక్కువే
అయినప్పటికీ, దేశీయ ఎయిర్‌ ట్రాఫిక్ ఇప్పటికీ కోవిడ్ పూర్వ స్థాయుల కంటే తక్కువగానే ఉంది. 2019 ఆగస్టులో దేశీయ విమాన ప్రయాణీకుల సంఖ్య 117.93 లక్షలు లేదా 1.17 కోట్లుగా ఉంది.


విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ (DGCA) డేటా ప్రకారం... జులైతో పోలిస్తే ఆగస్టులో ఇండిగో (IndiGo) మార్కెట్‌ వాటా 58.8 శాతం నుంచి 57.7 శాతానికి తగ్గింది. విస్తారా (Vistara) 9.7 శాతంతో మార్కెట్ వాటా పరంగా సెకండ్‌ స్లాట్‌ను ఆక్రమించింది. ఈ ఎయిర్‌లైన్స్‌లో ఆగస్టులో 9.81 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు. అయితే, దీని మార్కెట్ వాటా జూలైలోని 10.4 శాతం నుంచి క్షీణించింది.


గోఫస్ట్‌ (GoFirst) మార్కెట్ వాటా జూలైలో 8.2 శాతం నుంచి 8.6 శాతానికి పెరిగింది, ఆగస్టులో ఈ ఎయిర్‌లైన్ 8.7 లక్షల మంది ప్రయాణికులను మోసుకెళ్లింది. ఎయిర్ ఇండియా (Air India) మార్కెట్ వాటా జూలైలోని 8.4 శాతం నుంచి ఆగస్టులో 8.5 శాతానికి పెరిగింది, ఆగస్టులో ఈ కంపెనీ విమానాలు 8.61 లక్షల మంది ప్రయాణికులను చేరవేశాయి.


మార్కెట్ వాటా పరంగా స్పైస్‌జెట్ ‍‌(SpiceJet) ఐదో స్థానానికి పడిపోయింది. ఈ ఎయిర్‌లైన్ మార్కెట్ వాటా జూలైలోని 8 శాతం నుంచి ఆగస్టులో 7.9 శాతానికి దిగి వచ్చింది. ఈ నెలలో ఈ కంపెనీ 7.98 లక్షల మంది ప్రయాణికులను రవాణా చేసింది.


ఆగస్టు ఆక్యుపెన్సీ పరంగా చూస్తే - స్పైస్‌జెట్, ఇండిగో, విస్తారా, గో ఫస్ట్, ఎయిర్ ఇండియా, ఎయిర్‌ఏసియా ఇండియా వరుసగా 84.6 శాతం, 78.3 శాతం, 84.4 శాతం, 81.6 శాతం, 73.6 శాతం, 74.9 శాతంతో ఉన్నాయి. అంటే, ప్రతి వంద సీట్లకు సగటున అన్ని సీట్లను అవి భర్తీ చేయగలిగాయని అర్ధం.


రాడార్‌లో స్పైస్‌జెట్, ఇండిగో
విమాన ప్రయాణీకలు సంఖ్య పెరగడం.. లిస్టెడ్‌ స్పేస్‌లో ఉన్న స్పైస్‌జెట్, ఇండిగోతోపాటు, విమానయాన అనుబంధ రంగాలకు శుభవార్త. శుక్రవారం స్పైస్‌జెట్‌ షేరు ధర 2.35 శాతం తగ్గి రూ.43.70 వద్ద ముగిసింది. ఇండిగో షేరు ధర 3.58 శాతం తగ్గి రూ.1,833.95 వద్ద ఆగింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.