Diwali Muhurat Trading 2024 Date And Timing: ఈ సంవత్సరం దీపావళి పండుగను (Diwali 2024) ఏ రోజున, అంటే అక్టోబర్ 31 జరుపుకోవాలా లేదా నవంబర్ 01న జరుపుకోవాలా అనే విషయంలో కొంత గందరగోళం కనిపిస్తోంది. కొందరు పండితులు అక్టోబర్ 31న పండగ ఘడియలు ఉన్నాయని చెబుతుంటే, మరికొందరు నవంబర్ 01న దీపావళి జరుపుకోవాలని అంటున్నారు. అయితే, దేశంలోని ఎక్కువ ప్రాంతాల్లో దీపావళిని అక్టోబర్ 31నే జరుపుకునేందుకు డిసైండ్ అయ్యారు. చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఆ రోజునే సెలవుగా ప్రకటించాయి. దీపావళి సందర్భంగా, ముహూర్తపు ట్రేడింగ్ (Muhurat Trading 2024) నిర్వహణ కోసం స్టాక్ మార్కెట్‌లో సన్నాహాలు జరుగుతున్నాయి. ముహూరత్ ట్రేడింగ్ తేదీపై క్లారిటీ కోసం చాలా రోజులుగా ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఎదురు చూస్తున్నారు. దీపావళి ముహూరత్ ట్రేడింగ్‌ను నవంబర్ 01న నిర్వహించాలని నిర్ణయించినట్లు బాంబే స్టాక్ ఎక్సేంజ్ (BSE) తాజా సర్క్యులర్ ద్వారా స్పష్టం చేసింది, ఎదురు చూపులకు తెర దించింది.
ముహూరత్ ట్రేడింగ్ అంటే ఏంటి?
వాస్తవానికి, దీపావళి సందర్భంగా మన దేశంలోని స్టాక్ మార్కెట్లకు (NSE & BSE) సెలవు. అయినప్పటికీ, ప్రతి సంవత్సరం దీపావళి నాడు BSEలోను, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ NSEలోను ముహూరత్ ట్రేడింగ్ జరుగుతుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం, దీపావళి పండుగ కొత్త సంవత్సరంలో మొదటి రోజుగా భావిస్తారు. ఈ ఏడాది దీపావళి నుంచి, కొత్త సంవత్సరం "సంవత్ 2081" ప్రారంభమవుతుంది. కొత్త సంవత్సరం ప్రారంభం రోజున శుభ ఘడియల్లో పెట్టుబడి పెట్టడం సంప్రదాయంగా వస్తోంది. దీపావళి రోజున శుభ ఘడియల్లో పెట్టిన పెట్టుబడి (షేర్లు, బంగారం వంటివి) కొన్ని రెట్లు పెరుగుతుందని, అదృష్టాన్ని తెచ్చి పెడుతుందన్నది హిందువుల నమ్మకం. కాబట్టి, దీపావళి రోజున షేర్లు కొనడానికి వీలుగా ఇండియన్ స్టాక్ మార్కెట్లలోనూ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ నిర్వహిస్తారు. సాధారణంగా, ఆ రోజున ఒక గంట పాటు (అరుదుగా ఈ కాల వ్యవధి మారుతుంది) స్పెషల్ ట్రేడింగ్ జరుగుతుంది, దీనినే ముహూరత్ ట్రేడింగ్ అంటారు. ఈసారి, పెట్టుబడిదార్లు సంవత్ 2081 రోజున లక్ష్మీ పూజతో పాటు వారి ఇళ్ల నుంచి ఆన్‌లైన్ ట్రేడింగ్ చేయొచ్చు.
ఏ సమయంంలో మూహూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తారు?
సంవత్ 2081 తొలి రోజున (01 నవంబర్ 2024), సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు, గంట పాటు ముహూరత్ ట్రేడింగ్ సెషన్ నిర్వహించాలని నిర్ణయించారు. బీఎస్ఈ, ఎన్‌ఎస్‌ఈ ఈ ప్రకటన చేసి, ఇప్పటి వరకు ఉన్న గందరగోళాన్ని తొలగించాయి. BSE జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, ప్రి-ఓపెనింగ్ సెషన్ సాయంత్రం 5:45 గంటల నుంచి 6:00 గంటల వరకు కొనసాగుతోంది. బ్లాక్ డీల్ విండో సాయంత్రం 5:30 గంటల నుంచి 5:45 గంటల వరకు తెరిచి ఉంటుంది.
పీరియాడిక్ కాల్ ఆప్షన్ టైమ్ సాయంత్రం 6:05 గంటల నుంచి 6:50 గంటల వరకు ఉంటుంది. BSE సర్క్యులర్ ప్రకారం, ఆర్డర్ ఎంట్రీ సెషన్ చివరి 10 నిమిషాల్లో ముగుస్తుంది. క్లోజింగ్ సెషన్ రాత్రి 7 గంటల నుంచి 7.10 గంటల వరకు, పోస్ట్ క్లోజింగ్ సమయం రాత్రి 7.10 గంటల నుంచి 7.20 గంటల వరకు ఉంటుంది.
మరో ఆసక్తికర కథనం: డబ్బులు కావాలా?, ఈ గవర్నమెంట్ స్కీమ్ నెలకు రూ.9,000 తెచ్చిస్తుంది!