Tips To Prevent Digital Payment Frauds: పండుగ అంటేనే సందడి. కిరాణా సరుకుల నుంచి కొత్త బట్టల వరకు చాలా కొనాలి. వచ్చే వారంలో ధన్‌తేరస్ (Dhanteras 2024), దీపావళి (Diwali 2024) వేడుకలు ఉన్నాయి. ఈ పండుగల షాపింగ్‌తో మార్కెట్లు సందడిగా మారాయి. పండుగ షాపింగ్‌లో ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌ షాపింగ్‌కు కూడా క్రేజ్‌ ఉంది. ప్రస్తుత పండగ సీజన్‌లోఅమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) సహా చాలా ఆన్‌లైన్‌ ఈ-కామర్స్‌ ఫ్లాట్‌ఫామ్‌లు స్పెషల్‌ సేల్స్‌ పెట్టి భారీ స్థాయిలో వస్తువులు అమ్ముతున్నాయి. దీంతో, ఈ పండుగ సీజన్‌ (Festive Season 2024) షాపింగ్ సమయంలో డిజిటల్ చెల్లింపు మోసాల ప్రమాదం కూడా పెరిగింది. ఈ మోసాల వలలో చిక్కిన ప్రజలు చాలా డబ్బులు కోల్పోయారు.


డిజిటల్ చెల్లింపుల్లో UPI ద్వారా దేశంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిన 'నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (NPCI), ప్రస్తుత పండుగ సీజన్‌లో డిజిటల్ చెల్లింపు మోసాలపై (Digital Payment Frauds) వినియోగదార్లకు ఎప్పటికప్పుడు వార్న్‌ చేస్తోంది. తాజా, మరో రౌండ్‌ హెచ్చరికలు జారీ చేసింది.


డిజిటల్ చెల్లింపు మోసాలను అడ్డుకునేందుకు NPCI సలహాలు
ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్ల కారణంగా ప్రజలు ఈ పండుగ సీజన్లో ఆన్‌లైన్‌ ద్వారా భారీ స్థాయిలో కొనుగోళ్లు చేస్తున్నారు. ఆఫర్‌/డిస్కౌంట్‌ను వీలైనంత త్వరగా సొంతం చేసుకోవాలనే తొందరలో, ఆ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్ విశ్వసనీయతను చెక్‌ చేయడాన్ని విస్మరిస్తున్నారు. యాజర్ల తొందరపాటు వల్ల త్వరగా మోసపోతున్నారు, డబ్బులు కోల్పోతున్నారు. ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసేటప్పుడు, ఒక ఈ-కామర్స్‌ ఫ్లాట్‌ఫామ్‌ను నమ్మొచ్చా లేదా అని నిర్ధరించుకున్న తర్వాతే వస్తువులను కొనుగోలు చేయాలని NPCI సూచించింది. ఆఫర్లు, డిస్కౌంట్లు ఉన్నాయి కదాని మీకు ఏమాత్రం తెలీని వెబ్‌సైట్‌ల జోలికి మాత్రం వెళ్లొద్దని వార్న్‌ చేసింది. తొందరపాటుతనం వల్ల చాలామంది ప్రజలు మోసగాళ్ల బారిన పడి కష్టార్జితాన్ని పోగొట్టుకున్నారని, పండుగ మూడ్‌ పాడు చేసుకున్నారని వెల్లడించింది. అంతేకాదు, తొందరపాటు వల్ల మీ క్రెడిట్‌ కార్డ్‌, డెబిట్‌ కార్డ్‌ల సమాచారం మొత్తం సైబర్‌ నేరగాళ్ల గుప్పిట్లోకి చేరుతుంది.


NPCI గణాంకాల ప్రకారం, పండుగ సీజన్‌లో షాపింగ్ ట్రెండ్‌ పెరుగుతుంది. కస్టమర్‌లు తాము ఆర్డర్ చేసిన వస్తువును గుర్తుంచుకుంటారు గానీ, సదరు ఫ్లాట్‌ఫామ్‌ ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయాన్ని పట్టించుకోరు. ఇది ఫిషింగ్ స్కామ్‌ల బారిన పడే అవకాశాలను పెంచుతుంది. కాబట్టి, కొత్త వెబ్‌సైట్‌లను, కొత్త పేమెంట్‌ లింక్‌ను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయడం మంచిది. తద్వారా నకిలీ డెలివరీ అప్‌డేట్స్‌ను అడ్డుకోవచ్చు. అలాగే, ఖాతాలను హ్యాకింగ్ బారి నుంచి రక్షించుకోవడానికి బలమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌ను యూజర్లు ఉపయోగించాలని కూడా NPCI సూచించింది.


అనుమానాస్పద లింక్‌లపై అస్సలు క్లిక్‌ చేయొద్దని NPCI కోరింది. అలాగే, కొత్త ప్లాట్‌ఫామ్స్‌లో ఎక్కువ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయవద్దని చెప్పింది. షాపింగ్ మాల్స్‌లో పబ్లిక్‌ Wi-Fi వంటి 'సురక్షితం కాని నెట్‌వర్క్‌'లను ఉపయోగించొద్దని కూడా ప్రజలకు NPCI సూచించింది.   


మరో ఆసక్తికర కథనం: బీఎస్‌ఎన్‌ఎల్‌ లోగో కలర్‌ఫుల్‌గా మారింది, గమనించారా? - కాల్‌ ఛార్జీల పెంపుపైనా అప్‌డేట్‌