Discount on Insurance Policy: కొవిడ్‌ మహమ్మారి మీ దరిదాపుల్లోకి రాకుండా మీరు కరోనా వ్యాక్సిన్ మూడో డోస్ (Corona Vaccine Third Dose) కూడా తీసుకున్నారా?, అయితే, బీమా కంపెనీలు మీ కోసం మంచి ఆఫర్‌ తీసుకొస్తున్నాయి.


మీరు కొత్త జీవిత బీమా (New Life Insurance Policy), ఆరోగ్య బీమా (Health Insurance Policy) లేదా టర్మ్ ఇన్సూరెన్స్ (Term Insurance) కొనుగోలు చేసినా, లేదా పాత పాలసీని పునరుద్ధరించుకున్నా (Policy Renewal) ప్రీమియం మీద తగ్గింపు పొందే అవకాశం ఉంది. 


'కరోనా టీకా మూడో డోస్‌ తీసుకున్న వాళ్లకు బీమా పథకాల ప్రీమియంలో డిస్కౌంట్‌' ఆఫర్‌ ఇంకా అమల్లోకి రాలేదు, ప్రస్తుతం పరిశీలన దశలో ఉంది. మరికొన్ని రోజుల్లో బీమా కంపెనీలు ఈ ప్రతిపాదనను ఆచరణలోకి తీసుకురావచ్చు అన్నది జాతీయ మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. 


IRDAI సూచన
వాస్తవానికి, కొవిడ్-19 వ్యాక్సిన్‌ 3 డోసులు తీసుకున్న పాలసీదారులకు సాధారణ & ఆరోగ్య బీమా పాలసీల పునరుద్ధరణ మీద తగ్గింపును ఇవ్వాలని బీమా నియంత్రణ సంస్థ IRDAI, గతంలోనే బీమా సంస్థలను కోరింది. ఆ సూచనను బీమా కంపెనీలు పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.


దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెంది విలయం సృష్టించిన తొలి వేవ్‌ సమయంలో, బాధితులు భారీ సంఖ్యలో క్లెయిమ్‌లు చేశారు. దీంతో బీమా కంపెనీలు చాలా నష్టపోయాయి. ఆ తర్వాత.. లైఫ్ ఇన్సూరెన్స్‌, హెల్త్ ఇన్సూరెన్స్‌, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలకు సంబంధించిన నిబంధనల్లో బీమా కంపెనీలు కొన్ని మార్పులు చేశాయి. అన్ని రకాల ప్లాన్‌ల మీద ప్రీమియంలు పెంచాయి. ప్రజల నుంచి కూడా బీమా పాలసీల కోసం డిమాండ్‌ పెరిగింది.


అన్ని రకాల బీమా ప్రీమియం ధరలు పెరిగిన నేపథ్యంలో, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) కొన్ని సూచనలు చేసింది. కరోనా వ్యాక్సిన్‌ను మూడు సార్లు తీసుకున్న పాలసీదారులకు సాధారణ & ఆరోగ్య బీమా పాలసీల పునరుద్ధరణపై తగ్గింపు ఇవ్వాలన్నది ఆ సూచనల్లో ఒకటి. కోవిడ్-19 సంబంధిత క్లెయిమ్‌లను వీలైనంత త్వరగా పరిష్కరించాలని, పేపర్ వర్క్ తగ్గించాలని కూడా జీవిత బీమా & జీవితేతర బీమా కంపెనీలను బీమా నియంత్రణ సంస్థ IRDAI కోరింది.


పెరిగిన బీమా క్లెయిమ్‌ల కేసులు
నగదు రహిత చికిత్స కోసం పాలసీ బీమా కంపెనీలతో ఒప్పందం చేసుకున్న కొన్ని ఆసుపత్రులు, కరోనా సమయంలో ఆ ఒప్పందాన్ని తుంగలో తొక్కాయి. కరోనా మొదటి & రెండో వేవ్ సమయంలో కోవిడ్ చికిత్స కోసం రోగుల నుంచి బలవంతంగా నగదు డిపాజిట్లు తీసుకున్నాయి. బీమా ఉన్న కోవిడ్ రోగులు ఆసుపత్రిలో చేరడానికి డిపాజిట్లు అడక్కుండా ఎంపానెల్డ్ ఆసుపత్రులను నిషేధించాలని IRDAI బీమా సంస్థలకు సూచించింది. చికిత్స ప్రోటోకాల్స్‌కు సంబంధించి మోసం కేసుల గురించి కూడా బీమా సంస్థలు రెగ్యులేటర్‌కు ఫిర్యాదు చేశాయి.


2021-22 ఆర్థిక సంవత్సరంలో, కరోనా మహమ్మారి సమయంలో, బీమా కంపెనీలకు డెత్ క్లెయిమ్‌లు 73.41 శాతం పెరిగాయి. IRDAI లెక్క ప్రకారం... 2021-22లో 15.87 లక్షల పాలసీల ద్వారా రూ. 45,817 కోట్ల విలువైన క్లెయిమ్‌లను బీమా సంస్థలు చెల్లించాయి. ఇందులో కోవిడ్ కారణంగా మరణించిన వారికి రూ. 17,269 కోట్ల విలువైన క్లెయిమ్‌లు చెల్లించాయి.