Demat Accounts: ఇండియన్ స్టాక్ మార్కెట్ చరిత్రలో కరోనాకు ముందు, కరోనాకు తర్వాత అని స్పష్టమైన గీత గీయవచ్చు. కరోనా కాలంలో ఖాళీగా ఇంట్లో కూర్చున్న జనం, చేతిలో సెల్‌ఫోన్ పట్టుకుని స్టాక్ మార్కెట్ మీద పడ్డారు. ట్రేడింగ్ కోసం విచ్చలవిడిగా డీమెటీరియలైజ్డ్ అకౌంట్లు (డీమ్యాట్ అకౌంట్లు) తెరిచారు. కరోనా ఆంక్షల సమయం నుంచి కొత్త డీమ్యాట్ ఖాతాల ఓపెనింగ్ ఇస్రో వదిలిన రాకెట్‌లా రయ్యని పెరిగింది. ఈ ఏడాది ఆగస్టులో, మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య (కొత్తవి, పాతవి కలిపి) 10 కోట్లను దాటింది. ఇండియన్ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇదో మేలి మైలురాయి.
ఇప్పుడు పరిస్థితి మొదటికి వచ్చింది. కరోనా లేదు, కాకరగాయ లేదు. ఖాళీగా కూర్చునే జనం కరవయ్యారు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌ను మూటగట్టి మూలనబెట్టి, యథావిధిగా ఎవరి పనులు వాళ్లు చేసుకుంటున్నారు. దీంతో, కొత్త డీమ్యాట్ ఖాతాల్లో పెరుగుదల సన్నగిల్లింది.
అక్టోబర్‌లో 1.77 మిలియన్ డీమ్యాట్ ఖాతాలు
NDSL & CDSLలో కలిపి, ఈ ఏడాది అక్టోబర్ నెలలో దాదాపు 1.77 మిలియన్ (17.7 లక్షలు) కొత్త డీమ్యాట్ ఖాతాలు యాడ్ అయ్యాయి. చూడ్డానికి ఈ నంబర్ పెద్దగానే ఉన్నా, గతంతో పోల్చి చూస్తే ఇదొక బ్యాడ్ సిగ్నల్. గత తొమ్మిది నెలల సగటు 2.5 మిలియన్ల (25 లక్షలు) కంటే ఇది 28 శాతం తక్కువ. పైగా.. ఈ ఏడాదిలో ఇది రెండో కనిష్ట సంఖ్య. విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు (FPI) మళ్లీ పెట్టుబడులు పెంచడంతో గత నెలలో మార్కెట్లు 5.4 శాతం జంప్ చేశాయి. అయినప్పటికీ కొత్త డీమ్యాట్ ఖాతాల ఓపెనింగ్‌లో వాడి తగ్గింది.
అక్టోబరులో కొత్త డీమ్యాట్ ఖాతాల సంఖ్య తగ్గడమే కాదు, ట్రేడింగ్ కార్యకలాపాలు కూడా నీరసబడ్డాయి. క్యాష్ సెగ్మెంట్‌లో.. సగటు రోజువారీ ట్రేడింగ్ వాల్యూమ్ (ADTV) 54,532 కోట్లకు (NSE, BSE కలిపి) పడిపోయింది. నెలవారీగా (MoM) ఇది దాదాపు 20 శాతం పతనం. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) సెగ్మెంట్‌లో... (NSE, BSE కలిపి) ADTV 147.4 ట్రిలియన్ల (నోషనల్ టర్నోవర్) వద్ద ఉంది, MoM ప్రాతిపదికన 4 శాతం క్షీణించింది.
పండుగల సీజన్ కారణంగా సెలవులు రావడంతో పాటు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌లు (IPOs) కూడా లేకపోవడంతో కొత్త డీమ్యాట్ ఖాతాలు తగ్గినట్లు బ్రోకింగ్ ఇండస్ట్రీ అధికారులు చెబుతున్నారు.
రెండు డిపాజిటరీల (NDSL & CDSL) డేటా ప్రకారం... ట్రేడర్లు ఈ ఏడాది జనవరిలో 34 లక్షల కొత్త డీమ్యాట్ ఖాతాలు తెరిచారు. ఫిబ్రవరిలో 29 లక్షలు, మార్చిలో 28 లక్షలు, ఏప్రిల్‌లో 24 లక్షలు, మేలో 27 లక్షలు, జూన్‌లో 18 లక్షలు, జులైలో 18 లక్షలు, ఆగస్టులో 22 లక్షలు, సెప్టెంబర్‌లో 21 లక్షల కొత్త ఖాతాలను స్టార్ట్ చేశారు.
ఈ నంబర్లను పరిశీలించారా..? ఈ ఏడాది జనవరిలో జనంలో ఉన్న ఊపు అక్టోబర్ నాటికి లేదు. కొత్త ఖాతాల సంఖ్య నెలనెలా తగ్గుతూనే వస్తోంది. ట్రేడింగ్ మీద ప్రజల ఆసక్తి తగ్గుతోందనడానికి ఇది నిదర్శనంగా భావించవచ్చు.
రెండు డిపాజిటరీలు (CDSL, NSDL) వద్ద మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య అక్టోబర్ 31, 2022 నాటికి 104.4 మిలియన్లుగా (10.44 కోట్లు) ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.