Demat Account Nominee: మీరు స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారా?, అయితే, మీరు తక్షణం చేయాల్సి పని ఒకటి మిగిలి ఉంది. ఈ పని పూర్తి చేస్తేనే మీరు షేర్లు కొనడం, అమ్మడం చేయలగరు.
మీ డీమ్యాట్ అకౌంట్‌లో మీరు ఇప్పటికీ నామినేషన్ పూర్తి చేయకపోతే, మిగిలిన పనులన్నీ పక్కనబెట్టి ముందు ఈ పనిని పూర్తి చేయండి. మీకు కేవలం కొన్ని రోజులే గడువు ఉంది. గడువులోగా నామినేషన్‌ను మీరు పూర్తి చేయకపోతే మీ డీమ్యాట్ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది.
సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఆదేశం ప్రకారం, ప్రతి ఒక్కరూ వాళ్ల డీమ్యాట్ ఖాతాకు నామినీ పేరును జత చేయాలి. ఇందుకు 2023 మార్చి 31వ తేదీయే చివరి గడువు. ఈలోగా డీమ్యాట్ ఖాతాలో నామినీ పేరును చేర్చకుంటే ఖాతా స్తంభించిపోతుంది. అకౌంట్ ఫ్రీజ్ అయిందంటే, ఆ తర్వాత మీరు ఎలాంటి స్టాక్ మార్కెట్‌లో ఒక్క లావాదేవీ కూడా చేయలేరు. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టలేరు, రోజువారీ ట్రేడింగ్ చేయలేరు.
డీమ్యాట్ ఖాతాల్లో తప్పనిసరిగా నామినీ పేరును, కేటాయించాలనుకున్న శాతాన్ని నింపమని 2021 జులైలోనే సెబీ సూచించింది. అప్పటి నుంచి కొన్ని దఫాలుగా గడువును పొడిగిస్తూ వచ్చింది. 2023 మార్చి 31వ తేదీని ఫైనల్ గడువుగా నిర్ణయించింది.
నామినీ పేరును ఎందుకు చేర్చాలి?
ఒక వ్యక్తి డబ్బు సంపాదించేది అతని కుటుంబానికి ఆర్థిక రక్షణ కోసమే కదా. నామినేషన్ పూర్తి చేయకుండా ఆ పెట్టుబడిదారు మరణిస్తే, ఆ ఖాతాలో డబ్బు అతని కుటుంబ సభ్యులకు చెందదు. నామినీ పేరును చేరిస్తే, ఆ నామినీకి డబ్బు వెళ్తుంది. ఇది పూర్తిగా పెట్టుబడిదారు సంక్షేమం కోసం తెచ్చిన నిబంధన.
నామినీ పేరును ఎలా చేర్చాలి?
మీ డీమ్యాట్ ఖాతాలో నామినీ పేరును చేర్చడానికి మీరు చేసే దరఖాస్తు ప్రక్రియ చాలా సులభం, కేవలం 2 రెండు నిమిషాల్లో మీ వైపు నుంచి పని పూర్తవుతుంది. ఆ అప్లికేషన్‌ను ప్రాసెస్ చేయడానికి 24-48 గంటల సమయం పడుతుంది. కాబట్టి, చివరి రోజు వరకు కాలయాపన చేయవద్దు. వీలయితే ఇవాళే, లేదా చివరి తేదీకి కనీసం మూడు రోజుల ముందయినా నామినేషన్ కోసం దరఖాస్తు చేయండి.
ఒక్కో బ్రోకరేజీ వెబ్‌సైట్ డిజైన్ ఒక్కో విధంగా ఉంటుంది. కాబట్టి, అన్ని వెబ్‌సైట్లకు వర్తించేలా నామినేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్‌ను స్థూలంగా చెప్పుకుందాం. మీ డీమ్యాట్ ఖాతాకు గరిష్టంగా ముగ్గురి పేర్లను నామినీలుగా జత చేయవచ్చు, మీ ఇష్టప్రకారం వాళ్లకు నామినేషన్ పర్సెంటేజీ ఇవ్వవచ్చు. మొత్తం పర్సంటేజీ కలిపితే 100%కి మించకూడదు. ఒక్కరి పేరునే నామినీగా మీరు చేరిస్తే, ఆ ఒక్కళ్లకే 100% ఇవ్వొచ్చు. ముందుగా, నామినీ పాన్, ఆధార్ నంబర్, ఈ ఆధార్ నంబర్‌కు లింక్ అయిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మీ దగ్గర పెట్టుకోండి.
మీరు డీమ్యాట్ ఖాతా తీసుకున్న బ్రోకరేజీ సంస్థ వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. హోమ్ పేజీలో, మీ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి. ఆ తర్వాత, ప్రొఫైల్ సెగ్మెంట్‌లోకి వెళ్లండి. ఈ సెగ్మెంట్‌లో కనిపించే నామినీ డిటెయిల్స్‌పై క్లిక్ చేయండి. మీరు ఇంతకు ముందే నామినేషన్ పూర్తి చేస్తే ఆ వివరాలు కనిపిస్తాయి. ఎవరి పేరును చేర్చకపోతే ఏ రికార్డ్ కనిపించదు.
నామినీ పేరును గతంలో మీరు జత చేయకపోతే, ఇప్పుడు, ఆ పేజీలో నామినీ వివరాలను నమోదు చేయండి. నామినీ పేరు, పాన్, ఆధార్ నంబర్ పూరించండి. తర్వాత, నామినీకి కేటాయించాలనుకుంటున్న శాతాన్ని పూరించండి. గరిష్టంగా ముగ్గురిని యాడ్ చేయవచ్చని ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. మీరు కావాలనుకుంటే.. యాడ్ నామినీపై క్లిక్ చేసి, మరో ఇద్దరి పేర్లను కూడా జోడించవచ్చు.
ఆధార్ నంబర్ యాడ్ చేసి, సెండ్ OTP బటన్‌పై క్లిక్ చేయండి. ఆధార్‌తో లింక్ అయిన ఫోన్ నంబర్‌కు వచ్చిన OTPని సంబంధిత గడిలో పూరించండి.
అంతే, నామినేషన్ కూడా దరఖాస్తు చేయడం పూర్తవుతుంది. 24-48 గంటల్లో మీ డీమ్యాట్ ఖాతాకు నామినీ పేరు జత అవుతుంది.