Dal Price Hike: ఒక చిన్న టమాటా యావత్ దేశాన్నీ కుదిపేస్తోంది, చుక్కల్లో చేరిన రేటుతో ఠారెత్తిస్తోంది. ఇప్పుడు, ధరల కర్రతో జనం నెత్తిన దరువేయడానికి కందిపప్పు రెడీగా ఉంది. దేశంలో అన్ని రకాల పప్పుల (pulses) రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి, ఈ సంవత్సరంలో 10%పైగా పెరిగాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో సరఫరా లేకపోవడం, తక్కువ ఉత్పత్తి, రుతుపవనాల ఆలస్యం కారణంగా టొమాటో రేటు కిలోకు రూ. 150 వరకు పలుకుతోంది.
మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ఫుడ్ ఐటెమ్
ఈ ఏడాది మే నెలలో 4.31 శాతంగా ఉన్న CPI ఇన్‌ఫ్లేషన్ రేట్ జూన్ నెలలో 4.81 శాతానికి ఎగబాకింది. కందిపప్పు సహా ఇతర పప్పు దినుసుల రేట్లు భారీగా పెరగడమే జూన్ నెలలో ద్రవ్యోల్బణం పెరగడానికి ప్రధాన కారణం. ఈ ఏడాది మే నెలలో 6.56 శాతంగా ఉన్న పప్పుధాన్యాల ద్రవ్యోల్బణం, జూన్‌లో భారీగా పెరిగి 10.53 శాతానికి చేరింది. ఆకుకూరలు & కూరగాయల ద్రవ్యోల్బణం ఈ ఏడాది మే నెలలో -8.18 శాతంగా ఉంటే, జూన్‌లో -0.93 శాతానికి చేరింది.
ఈ ఇండెక్స్‌లో.. టమోటాలు సహా కూరగాయల రేట్లను దాటి పప్పులు పెరిగాయి. కాబట్టి, పప్పులను "మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ఫుడ్ ఐటెమ్"గా లెక్కించొచ్చు. ఇప్పటికే పెరిగిన, పెరుగుతూనే ఉన్న కూరగాయల ధరలు హౌస్‌హోల్డ్ బడ్జెట్లను దెబ్బ తీశాయి. వాటికి ఇప్పుడు పప్పులు తోడవుతున్నాయి.
వర్షాకాలం వచ్చేసరికి కూరగాయల ధరలు ఎక్కువగా ఉండడం సాధారణంగా జరిగే విషయమే. అయితే, ఈ ఏడాది పల్సెస్ రేట్లు దాదాపు 10% పెరిగాయి. రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ లెక్క ప్రకారం, గత ఐదు నెలల్లో పప్పుల ద్రవ్యోల్బణం దాదాపు రెట్టింపు అయింది.
ఖరీదైన ఆహారంగా ఇండియన్ థాలీ
కూరగాయలు, పప్పులే కాదు... బియ్యం, గోధుమల రేట్లు కూడా కొండ మెట్లెక్కుతున్నాయి. ఇటీవలి నెలల్లో బియ్యం ధర 10%, గోధుమల రేటు 12% పెరిగాయి. ఇవన్నీ కలిసి భారతీయ భోజనాన్ని ఖరీదైన ఆహారంగా మార్చాయి.
మన దేశంలో, బ్యాలెన్స్‌డ్ డైట్‌లో పప్పులు ఒక భాగం. ప్రాంతాలతో సంబంధం లేకుండా, భారతీయులందరికీ తక్కువ ఖర్చుతో ప్రోటీన్స్ అందిస్తాయివి. వివిధ ప్రభుత్వాల మధ్యాహ్న భోజనం పథకాలు, ఇతర ఆహార కార్యక్రమాల్లో పప్పు కనిపించకుండా ఉండదు. అలాంటి పప్పు ఇప్పుడు జనాన్ని తిప్పలు పెడుతోంది.
కూరగాయల ద్రవ్యోల్బణం తాత్కాలికం. వాతావరణం కుదుటపడితే కాయగూరల రేట్లు తగ్గుతాయి. కానీ పల్సెస్ ఇన్‌ఫ్లేషన్ శాశ్వతంగా మారే సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ బాస్కెట్‌లో పప్పుల వాటా 6%. వీటి రేట్లు పెరుగుతున్నాయంటే, జనం జేబులకు ఉన్న చిల్లు పెరిగి పెద్దదవుతోందని అర్ధం.
జూన్ ఇన్‌ఫ్లేషన్ రేట్‌లో... మసాలా దినుసుల ద్రవ్యోల్బణం మే నెలలోని 17.90 శాతం నుంచి జూన్‌లో 19.19 శాతానికి పెరిగింది. మే నెలలో 8.91 శాతంగా ఉన్న పాలు & అనుబంధ ఉత్పత్తుల ధరలు 8.56 శాతానికి చేరాయి. ఆహార ధాన్యాలు & సంబంధిత ఉత్పత్తుల ద్రవ్యోల్బణం మే నెలలో 12.65 శాతంగా ఉంటే, జూన్‌లో 12.71 శాతంగా నమోదైంది. అయితే, ఆయిల్ & ఫ్యాట్స్ ఇన్‌ఫ్లేషన్ మేలో -16.01 శాతం నుంచి జూన్‌లో -18.12 శాతానికి తగ్గింది. చక్కెర ఇన్‌ఫ్లేషన్ రేటు 3 శాతంగా ఉంది, ఇది గత నెలలో 2.51 శాతంగా ఉంది.
మరో ఆసక్తికర కథనం: గుడ్‌న్యూస్, ఎక్కువ వడ్డీ ఇచ్చే స్పెషల్ స్కీమ్ గడువు పెంచిన HDFC బ్యాంక్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial