Trending Stocks: ప్రపంచ బ్యాంకింగ్, ఆర్థిక సంక్షోభం వేడిలో దలాల్ స్ట్రీట్‌ మాడిపోతోంది. ఇదే పరిస్థితి మరికొంతకాలం ఉండవచ్చు. మార్కెట్‌లో వేడి ఉన్నంత మాత్రాన మీ పోర్ట్‌ఫోలియోలోనూ అదే సెగ కొనసాగాల్సిన అవసరం ఏముంది?, మీ పోర్ట్‌ఫోలియోలో వేడిని, మీలో టెన్షన్‌ను తగ్గించే కూలెస్ట్‌ స్టాక్స్‌ కూడా మార్కెట్‌లో ఉన్నాయి.


ఇప్పుడు ఎండలు ముదురుతున్నాయి. హీట్‌ను బీట్‌ చేసే శీతలీకరణ ఉత్పత్తుల మీద ఖర్చు పెట్టడానికి జనం ముందుకు వస్తున్నారు. కన్జ్యూమర్‌ డ్యూరబుల్‌ గూడ్స్‌ కంపెనీలు కూడా ఈ సమయం కోసమే ఎదురు చూస్తున్నాయి. కాబట్టి, కూలింగ్‌ స్టాక్స్‌ కొనడానికి ఈ సంవత్సరంలో ఇది సరైన సమయంగా విశ్లేషకులు చెబుతున్నారు.


ట్రెండింగ్‌ స్టాక్స్‌ ఇవి
ఎయిర్ కండిషనర్లు, ఎయిర్ కూలర్‌లు, రిఫ్రిజిరేటర్లను అమ్మే అంబర్ ఎంటర్‌ప్రైజెస్ ఇండియా (Amber Enterprises India), బ్లూ స్టార్ (Blue Star, ఓల్టాస్ ‍‌(Voltas), వర్ల్‌పూల్ ఆఫ్ ఇండియా (Whirlpool India) వంటి కంపెనీలు, వాటి ఏడాది మొత్తం విక్రయాల్లో 70%ను క్యాలెండర్ ఇయర్‌ మొదటి ఆరు నెలల్లోనే సాధిస్తాయి. కేవలం మార్చి-మే మధ్య, 3 నెలల కాలంలోనే ఏడాది సేల్స్‌లో 50%ను కవర్‌ చేస్తాయి.


ఉష్ణోగ్రతలు గత సంవత్సరం కంటే ఇప్పుడు 1-2 డిగ్రీలు ఎక్కువగా ఉన్నాయి. వేడి గాలుల కారణంగా ఫిబ్రవరి నెలలో ఓల్టాస్ ప్రైమరీ సేల్స్‌లో బలమైన పెరుగుదల కనిపించింది.


FY22లో, ఓల్టాస్‌ మొత్తం ఆదాయంలో దాదాపు 70% వరకు యూనిటరీ కూలింగ్ ప్రొడక్ట్స్‌ తెచ్చి పెట్టాయి. బ్లూ స్టార్ మొత్తం ఆదాయంలో వాటి వాటా 48% పైగా ఉంది.


ఏప్రిల్ నుంచి సెకండరీ సేల్స్‌ ప్రారంభమవుతాయని, FY24లో ఇండస్ట్రీ మొత్తం అమ్మకాలు 10% పెరుగుతాయని ఓల్టాస్ట్‌ అంచనా వేసింది. 


కరోనా మహమ్మారి, ద్రవ్యోల్బణం కారణంగా గత 3, 4 సంవత్సరాల పీక్‌ సీజన్లలో అమ్మకాలు సరిగా సాగలేదు. ఈ ఏడాది సీన్‌ రివర్స్‌ అవుతుందని, శీతలీకరణ ఉత్పత్తుల కంపెనీలకు కలిసి వస్తుందన్నది మార్కెట్‌ నిపుణుల అంచనా. 


AC స్టాక్స్‌కు ఎనలిస్ట్‌లు ఇచ్చిన టార్గెట్‌ ప్రైస్‌లు
వృద్ధి అవకాశాలను పరిగణనలోకి తీసుకుని ఓల్టాస్‌ మీద BNP పారిబాస్ బుల్లిష్‌గా ఉంది. ఓల్టాస్‌ను తమ టాప్‌ పిక్‌గా చెప్పిన ఈ బ్రోకరేజీ, టార్గెట్ ధరను రూ. 1,005గా కొనసాగించింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు (YTD), ఈ స్టాక్ 6% పైగా సానుకూల రాబడిని ఇచ్చింది, ఇదే కాలంలో నిఫ్టీ 6% ప్రతికూల రాబడిని ఇచ్చింది.


బ్లూ స్టార్ స్టాక్‌పై రూ. 1,015 టార్గెట్ ధరతో “బయ్‌” రేటింగ్‌ను రిలయన్స్ సెక్యూరిటీస్ కంటిన్యూ చేస్తోంది. బ్లూ స్టార్, వోల్టాస్‌ కంటే ఎక్కువగా, ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 21% రిటర్న్‌ ఇచ్చింది.


క్రాంప్టన్ గ్రీవ్స్ కన్స్యూమర్ ఎలక్ట్రికల్స్‌పైనా (Crompton Greaves Consumer Electricals) ఎనలిస్ట్‌లు సానుకూలంగా ఉన్నారు. స్టాక్ సగటు టార్గెట్ ధర రూ. 436.82. ప్రస్తుత స్థాయిల నుంచి మరో 55% పైగా పెరుగుదలను ఈ టార్గెట్‌ ధర సూచిస్తోంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.