Retail Inflation Data For September 2023: దేశంలో ప్రధాన పండుగల సీజన్‌లో సామాన్య జనానికి కాస్త ఊరట లభించింది. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాయి.
ఆహార పదార్థాల ధరల పతనం కారణంగా, 2023 సెప్టెంబర్‌లో, దేశంలో రిటైల్ ఇన్‌ఫ్లేషన్ (Retail Inflation) తగ్గింది. ఆగస్టులో 6.83 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 5.02 శాతానికి పడిపోయింది. అంతకుముందు జులై నెలలో 15 నెలల గరిష్ట స్థాయి 7.44 శాతానికి చేరుకుంది. జూన్ నెలలో ద్రవ్యోల్బణం రేటు 4.81 శాతంగా నమోదైంది.
సెప్టెంబర్ నెలలో సీపీఐ ఇన్‌ఫ్లేషన్ (CPI Inflation) రేటు రిజర్వ్ బ్యాంక్ టాలరెన్స్ బ్యాండ్ పరిధిలోకి దిగి రావడం ఉపశమనం కలిగించే విషయం.
ఆహార ద్రవ్యోల్బణం రేటు తగ్గుదల
దేశంలో చిల్లర ద్రవ్యోల్బణం లెక్కలను కేంద్ర గణాంకాల కార్యాలయం (NSO) ప్రతి నెలా విడుదల చేస్తుంది. NSO లెక్కల ప్రకారం... సెప్టెంబర్ నెలలో ఆహార ద్రవ్యోల్బణం రేటు భారీగా తగ్గింది. ఈ ఏడాది ఆగస్టులో 9.94 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 6.56 శాతానికి దిగి వచ్చింది. అయినా, గ్రామీణ ప్రాంతాల ప్రజలను ద్రవ్యోల్బణం ఇప్పటికీ ఇబ్బంది పెడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.33 శాతం ఉండగా, ఆహార ద్రవ్యోల్బణం 6.65 శాతంగా ఉంది.
సెప్టెంబర్ నెలలో కూరగాయల ధరలు ఎక్కువగా క్షీణించాయి. ఫలితంగా, కూరగాయల ద్రవ్యోల్బణం 2023 ఆగస్టులోని 26.14 శాతం నుంచి 3.39 శాతానికి తగ్గింది. అయితే పప్పుదినుసుల ద్రవ్యోల్బణం పెరిగింది. ఆగస్టులో 13.04 శాతంగా ఉన్న పప్పుధాన్యాల ద్రవ్యోల్బణం సెప్టెంబర్ నెలలో 16.38 శాతానికి పెరిగింది. మసాలా దినుసుల ద్రవ్యోల్బణంలో స్వల్ప తగ్గుదల కనిపించింది, ఆగస్టులోని 23.19 శాతం నుంచి సెప్టెంబర్‌లో 23.06 శాతానికి చేరింది. పాలు & పాల సంబంధిత ఉత్పత్తుల ద్రవ్యోల్బణం కూడా తగ్గింది, ఆగస్టులోని 7.73 శాతం నుంచి సెప్టెంబర్‌లో 6.89 శాతానికి పరిమితమైంది. ధాన్యాలు & సంబంధిత ఉత్పత్తుల ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 10.95 శాతంగా నమోదైంది, ఇది ఆగస్టులో 11.85 శాతంగా ఉంది. నూనెలు, కొవ్వుల ద్రవ్యోల్బణం -14.04%, చమురు -0.11 శాతంగా నమోదయ్యాయి.
ఆర్‌బీఐకి కూడా శుభవార్త
రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు భారీగా క్షీణించడం ప్రజలకే కాదు, రిజర్వ్ బ్యాంక్‌కు (RBI) కూడా గొప్ప ఉపశమనం కలిగించే వార్త. కీలక వడ్డీ రేట్లను నిర్ణయించేందుకు ఆర్‌బీఐ పరిగణనలోకి తీసుకునే అంశాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం ఒకటి. సీపీఐ ఇన్‌ఫ్లేషన్‌ను కోసం '4%+/-2'ను టాలరెన్స్ బ్యాండ్‌గా ఆర్‌బీఐ నిర్ణయించింది. ఈ ప్రకారం, చిల్లర ద్రవ్యోల్బణాన్న 2% నుంచి 6% మధ్యలో ఉంచేందుకు కేంద్ర బ్యాంక్ ప్రయత్నిస్తుంటుంది. ప్రస్తుతం, సెప్టెంబర్‌లో 5.02 శాతంగా నమోదైన ద్రవ్యోల్బణం, టాలరెన్స్ బ్యాండ్ పరిధిలోనే ఉంది.
ఇటీవలి MPC మీటింగ్ సందర్భంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24లో దేశంలో ద్రవ్యోల్బణం 5.40 శాతంగా ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసింది. రెండో త్రైమాసికంలో (జులై-సెప్టెంబరు) ద్రవ్యోల్బణం రేటు 6.40 శాతంగా, మూడో త్రైమాసికంలో (అక్టోబరు-డిసెంబరు) 5.60 శాతంగా, నాలుగో త్రైమాసికంలో (2024 జనవరి-మార్చి) 5.20 శాతంగా ఉంటుందని లెక్కగట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి త్రైమాసికంలో (2024 ఏప్రిల్-జూన్) 5.20 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.
మరో ఆసక్తికర కథనం: ఈ రోజు మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Infy, HCL Tech, HDFC Life
Join Us on Telegram: https://t.me/abpdesamofficial