Coldplay Concert Tickets: బ్రిటిష్ రాక్ బ్యాండ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కోల్డ్‌ప్లే మ్యూజిక్ కాన్సెర్ట్ (సంగీత కచేరీ) వివాదంలో బుక్ మై షో సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ముంబయి పోలీసులకు చెందిన 'ఎకనామిక్ ఆఫీస్ వింగ్' (EOW) మళ్లీ బుక్ మై షో CEO, టెక్నికల్ హెడ్‌కు నోటీస్‌లు జారీ చేసింది. బుక్ మై షో మాతృ సంస్థ అయిన బిగ్ ట్రీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు, దాని CEO ఆశిష్ హేమరాజనికి ఈ కేసులో అందిన రెండో సమన్ ఇది. ముంబై పోలీసుల EOW నిన్న (ఆదివారం) ఈ సమన్లు పంపి ఈ రోజు విచారణకు పిలిచింది.
సమన్లకు స్పందించని ఆశిష్ హేమరాజనికి
బుక్ మై షో సీఈవో ఆశిష్ హేమరాజని పోలీసుల సమన్లకు స్పందించలేదని సమాచారం. పోలీసు వర్గాల ప్రకారం, ఆశిష్ తన లాయర్ల ద్వారా లేదా ఏ ప్రతినిధి ద్వారా కూడా పోలీసులను సంప్రదించలేదు, స్పందించలేదు. పోలీసులు మళ్లీ సమన్లు పంపుతారు. బుక్ మై షో సీఈవో అప్పుడు కూడా విచారణకు సహకరించకుంటే పోలీసులు న్యాయ సలహా తీసుకుని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. పోలీస్ విచారణకు ఈ నెల సెప్టెంబర్ 27న హాజరు కావాలని సూచిస్తూ ఆశిష్ హేమరాజనికి ఈ నెల 27న మొదటి సమన్లు అందాయి. అతను అప్పుడు కూడా విచారణకు హాజరు కాలేదు.
వచ్చే ఏడాది (2025) జనవరి 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు, నవీ ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో కోల్డ్‌ప్లే సంగీత కచేరీ జరగనుంది. బ్రిటిష్ రాక్ బ్యాండ్ ఇచ్చే ఈ ప్రదర్శనకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. టిక్కెట్ల కోసం సంగీత అభిమానులు ఎగబడుతున్నారు. బ్లాక్‌లో టిక్కెట్లు కొనడానికి కూడా సిద్ధమయ్యారు. బుక్ మై షోలో ఈ కాన్సెర్ట్ టిక్కెట్ల సేల్‌ను ఓపెన్ చేయగానే, నిమిషాల్లోనే ఆ టిక్కెట్లు ఐపోయాయి. దీంతో అభిమానులకు నిరాశ తప్పలేదు. మరోవైపు, సంగీత కచేరీ టిక్కెట్లు బ్లాక్‌లో అందుబాటులో ఉన్నట్లు ఆరోపణలు చెలరేగాయి. వాస్తవానికి, కోల్డ్‌ప్లే టికెట్ రేటు 2,500 రూపాయలు. కానీ, థర్డ్ పార్టీ ద్వారా లక్షల రూపాయలకు అమ్ముతున్నారంటూ సోషల్ మీడియాలో అభిమానులు విమర్శలకు దిగారు.
రూ.2,500 టిక్కెట్ రేటు రూ.3 లక్షలు
ఈ విషయంపై అమిత్ వ్యాస్ అనే లాయర్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మ్యూజిక్ లవర్స్‌ను, కోల్డ్‌ప్లే ఫ్యాన్స్‌ను బుక్ మై షో మోసం చేసిందని, బ్లాక్‌లో టిక్కెట్లు అమ్ముతున్నారంటూ కంప్లైంట్ ఇచ్చాడు. రూ.2,500 అమ్మాల్సిన టిక్కెట్‌ను థర్డ్ పార్టీ ద్వారా దాదాపు రూ.3 లక్షలకు విక్రయిస్తున్నారని కంప్లైంట్‌లో ఆరోపించాడు. ఆ కంప్లైంట్ ఆధారంగా కేస్ నమోదు చేసిన ముంబయి పోలీసులకు చెందిన EOW, విచారణ మొదలుపెట్టింది.
ఈ వ్యవహారంలో, EOW ఇప్పటికే కొందరు బ్రోకర్లను గుర్తించింది. మరోవైపు ఈ అంశంపై రాజకీయ రంగు పులుముకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై బుక్ మై షో గతంలోనే స్పందించింది. తాము అధికారిక వెబ్‌సైట్ ద్వారానే టిక్కెట్లు అమ్మామని, బ్లాక్‌లో అమ్ముతున్న వాళ్లకు-కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
కోల్డ్‌ప్లే అనేది బ్రిటన్‌కు చెందిన రాక్ & పాప్ మ్యూజిక్ బ్యాండ్. ఈ బ్యాండ్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు, భారతదేశంలోనూ లక్షల సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. ఈ కారణంగానే, ముంబైలో నిర్వహించనున్న కోల్డ్‌ప్లే మ్యూజిక్ కాన్సెర్ట్‌కు విపరీతమైన క్రేజ్ వచ్చింది.
మరో ఆసక్తికర కథనం: కేఆర్‌ఎన్ ఐపీవో అలాట్‌మెంట్ స్టేటస్‌ను ఇలా చెక్ చేయండి - లిస్టింగ్ గెయిన్స్ పక్కా!