Chitra Ramakrishna Arrested: నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ (NSE) మాజీ సీఈవో చిత్రా రామకృష్ణ అరెస్టయ్యారు. కోలొకేషన్ కేసులో చిత్రా రామకృష్ణను సీబీఐ ఆదివారం అరెస్ట్ (Chitra Ramakrishna Arrested) చేసింది. స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని ముందుగానే యాక్సెస్ చేసుకుని వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించారని, మరికొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఇదివరకే ఆమెపై దేశం విడిచి వెళ్లకుండా లుక్‌ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. ఆమెతో పాటు మరో మాజీ సీఈవో రవి నారాయణ్, మాజీ సీవోవో ఆనంద్ సుబ్రహ్మణ్యం దేశం విడిచి వెళ్లకుండా ఇటీవల లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారు.
ఢిల్లీలో చిత్రా రామకృష్ణను అరెస్ట్ చేసిన అనంతరం సీబీఐ (Central Bureau of Investigation ) అధికారులు ఆమెను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. మెడికల్ టెస్టులు పూర్తయ్యాకయ సీబీఐ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఎన్ఎస్ఈ మాజీ సీఈవోను నేడు (సోమవారం) సీబీఐ కోర్టులో హాజరుపరచనున్నారు. చిత్రా రామకృష్ణ దాఖలు చేసుకున్న యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్‌ను సీబీఐ స్పెషల్ కోర్టు శనివారం తిరస్కరించింది. ఆ మరుసటి రోజే సీబీఐ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. గత మూడు రోజులుగా ఆమెకు సంబంధించిన నివాసాలలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి చిత్రను అరెస్ట్ చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. చిత్రా రామకృష్ణ ఎన్‌ఎస్‌ఈకి 2013 ఏప్రిల్ నుంచి 2016 డిసెంబర్ వరకు ఎండీ, సీఈఓగా బాధ్యతలు నిర్వహించారు.
స్టాక్ మార్కెట్ ముందుగానే యాక్సెస్
స్టాక్ మార్కెట్‌ను అందరికన్నా ముందుగా యాక్సెస్ చేసి లాభాలు గడించేలా ఎన్‌ఎస్‌ఈ కో లొకేషన్ ఫెసిలిటీలో అవినీతికి పాల్పడిన కేసులో చిత్రపై అభియోగాలున్నాయి. అంతేకాకుండా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ, ఎన్‌ఎస్‌ఈలో గుర్తించని, తెలియని వ్యక్తులపైనా దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ తెలిపింది. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఓపీజీ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్, యజమాని సంజయ్ గుప్తాపై సైతం సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.
హిమాలయాల్లోని యోగి నిర్ణయాలు..
ఎన్‌ఎస్‌ఈకి సీఈవోగా ఉన్న సమయంలో ఆమె వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తి జీవితంలో ఏ పని చేయాలన్నా హిమాలయాల్లో ఉండే ఓ యోగి ఓకే చెబితే కానీ చిత్రా ముందడుగు వేయలేదు. ఎన్‌ఎస్‌ఈలో ఎవరిని నియమించాలి? ఎవరికి ప్రమోషన్ ఇవ్వాలి? వంటి విషయాలతో పాటు ఎన్‌ఎస్‌ఈ డివిడెంట్, ఆర్థిక ఫలితాల వివరాలు, బోర్డ్ మీటింగ్ ఎజెండా ఫైనాన్షియల్ డేటా మొత్తం ఆ గుర్తు తెలియని యోగి డైరెక్షన్‌లోనే జరిగాయి. ఆ యోగిని ఒక్కసారి కూడా కలవలేదు. కానీ ఆన్‌లైన్‌లోనే వారు చర్చించి నిర్ణయాలు తీసుకునేవారని ఆరోపణలున్నాయి.
Also Read: Gold-Silver Price: కొండెక్కి కూర్చున్న బంగారం, వెండి నేడు స్థిరంగా - తాజా ధరలు ఇవీ
Also Read: TS Budget 2022: బడ్జెట్ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం, నేడు ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం