ICICI Bank-Videocon Loan Case: ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ CEO & మేనేజింగ్‌ డైరెక్టర్ చందా కొచ్చర్‌ ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. బెయిల్‌ కోసం రకరకాల ప్రయత్నాలు చేసిన ఆమె, చివరకు ఉపశమనం పొందారు. వీడియోకాన్ గ్రూప్‌నకు (Videocon Group) అక్రమ పద్ధతిలో రుణాల జారీ కేసులో అరెస్టై, ముంబైలోని జైలులో ఉన్నారు చందా కొచ్చర్‌ & ఆమె భర్త దీపక్‌ కొచ్చర్. దాదాపు రెండున్నర వారాలు జైలు జీవితం అనుభవించాక ఈ ఇద్దరూ తాత్కాలిక స్వేచ్ఛను పొందారు.


కొచ్చర్ దంపతులకు బాంబే హైకోర్ట్ నిన్న (సోమవారం, 09 జనవరి 2023) బెయిల్‌ మంజూరు చేసింది.


 సెక్షన్ 41A ప్రకారం..
తమ అరెస్టును సవాల్ చేస్తూ కొచ్చర్‌ దంపతులు, సెక్షన్ 41A కింద బాంబే హైకోర్ట్‌లో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ మీద సోమవారం వాదనలు జరిగాయి. చందా కొచ్చర్‌ (Chanda Kochhar), దీపక్‌ కొచ్చర్‌ (Deepak Kochhar) కూడా న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు.  కొచ్చర్ దంపతుల తరఫు న్యాయవాది రోహన్ దాక్షిణి వాదనలు వినిపించారు. కొచ్చర్‌ దంపతుల అరెస్టు చట్ట విరుద్ధమని వాదించారు. సెక్షన్ 41A ప్రకారం, ఏ కేసులోనైనా నిందితులు సాక్ష్యాలను తారుమారు చేస్తున్నట్టు తేలితే తప్ప అరెస్ట్‌ చేయడం కుదరదు.


న్యాయవాది రోహన్ దాక్షిణి వాదనతో బాంబే హైకోర్ట్‌ ఏకీభవించింది. ఐసీఐసీఐ బ్యాంకు - వీడియోకాన్‌ కేసులో వారిని చట్టబద్ధంగా అరెస్టు చేయలేదని న్యాయస్థానం పేర్కొంది. లక్ష రూపాయల పూచీకత్తుతో మధ్యంతర బెయిల్‌కు అనుమతించింది. ఐసీఐసీఐ బ్యాంకు - వీడియోకాన్‌ రుణాల మోసం కేసులో CBI విచారణకు కొచ్చర్‌ దంపతులు సహకరించాలని ధర్మాసనం ఆదేశించింది. సీబీఐ అధికారులు విచారణ కోసం ఎప్పుడు పిలిచినా, వారి ఆఫీసుకు వెళ్లాలని సూచించింది. నిందితులు ఇద్దరూ తమ పాస్‌పోర్టులను సీబీఐకి అప్పగించాలని కోర్టు ఆదేశించింది. 'పిటిషనర్ల (కొచ్చర్‌ దంపతులు) అరెస్టును మేం నిలిపివేస్తున్నాం. వారి అరెస్టు న్యాయ విరుద్ధంగా జరిగింది. అందుకే విడుదల చేస్తున్నాం' అని తన ఆదేశంలో కోర్టు వెల్లడించింది. 


న్యాయస్థానం ఆదేశాలు జైలు సిబ్బందికి అందడంతో, కొచ్చర్‌ దంపతులు జైలు నుంచి బయటకు వచ్చారు. 






కేసు పూర్వాపరాలు
బ్యాంక్ రెగ్యులేషన్ యాక్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాలను ఉల్లంఘించి... వీడియోకాన్ గ్రూప్ కంపెనీలకు ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 3,250 కోట్ల రుణాన్ని మంజూరు చేసిందని CBI ఆరోపించింది. దీనికి ప్రతిగా... ధూత్ 2010 నుంచి 2012 మధ్య దీపక్ కొచ్చర్ కంపెనీలో రూ. 64 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో... అవినీతి నిరోధక చట్టం, నేరపూరిత కుట్ర సహా భారతీయ శిక్షాస్మృతిలోని సంబంధిత సెక్షన్ల కింద ఒక FIRను CBI నమోదు చేసింది. చందా కొచ్చర్, దీపక్ కొచ్చర్, వేణుగోపాల్ ధూత్‌తో పాటు... దీపక్ కొచ్చర్‌ నిర్వహించే న్యూపవర్ రెన్యూవబుల్స్ (NRL), సుప్రీం ఎనర్జీ, వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్‌, వీడియోకాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను కూడా నిందితులుగా ఆ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.


ఆరోపణలు చుట్టుముట్టడంతో, ఐసీఐసీఐ బ్యాంక్ CEO & మేనేజింగ్‌ డైరెక్టర్ పదవికి 2018 అక్టోబర్‌లో అవమానకర రీతిలో చందా కొచ్చర్ రాజీనామా చేశారు. తొలుత ఆ రాజీనామాను అంగీకరించిన బ్యాంక్‌, తామే ఆమెను తొలగిస్తున్నట్లు ఆ తర్వాత ప్రకటించింది.