Simplified Pension Form: ఒక ఉద్యోగి రిటైట్‌ అయ్యే సమయంలో చాలా తతంగం ఉంటుంది. పీఎఫ్‌, గ్రాట్యుటీ, ఎర్న్‌డ్‌ లీవ్స్‌ వంటివాటిని తీసుకునేందుకు చాలా ఫారాల మీద సంతకాలు చేయాల్సి ఉంటుంది. అయితే, డిజిటల్‌ యుగం ప్రారంభం నుంచి ఈ తతంగం క్రమంగా తగ్గుతూ వస్తోంది. తాజాగా, కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పెన్షన్‌ దరఖాస్తు ఫారాన్ని విడుదల చేసింది.


జులై 16, 2024 నాడు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ & పెన్షనర్స్ వెల్ఫేర్ (DoPPW) జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, సరళీకృత పెన్షన్ అప్లికేషన్ "ఫామ్‌ 6A"ని విడుదల చేసింది.


'భవిష్య' లేదా 'ఇ-హెచ్‌ఆర్‌ఎంఎస్‌'లో అందుబాటులోకి..
ఈ ఏడాది డిసెంబర్‌లో (డిసెంబర్‌ 2024‌), ఆ తర్వాత పదవీ విరమణ చేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ 'భవిష్య' లేదా 'ఇ-హెచ్‌ఆర్‌ఎంఎస్‌'లో ‍(Bhavishya లేదా e-HRMS - ఆన్‌లైన్ మాడ్యూల్స్) "ఫామ్‌ 6A" అందుబాటులో ఉంటుంది. ఇ-హెచ్‌ఆర్‌ఎంఎస్‌లో ఉన్న ఉద్యోగులు ఫారం 6Aని పూరిస్తారు. ఇ-హెచ్‌ఆర్‌ఎంఎస్‌లో లేని ఉద్యోగులు 'భవిష్య'లో ఫారం 6Aని పూరిస్తారని కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 


కొత్త ఫారాన్ని, ఈ రోజు (శుక్రవారం, 30 ఆగస్టు 2024‌), కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్‌ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లాంచ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ పాలసీ అయిన "గరిష్ట పాలన - కనిష్ట ప్రభుత్వం" విధానంలో భాగంగా పింఛను దరఖాస్తు ఫారాన్ని సరళీకరించినట్లు వెల్లడించారు. అంతేకాదు, పెన్షన్ ప్రక్రియలో తీసుకొస్తున్న పేపర్‌లెస్ పనిలో ఇదొక మైలురాయిగా నిలుస్తుంది.


సంతకం చేస్తే చాలు
గతంలో ఉన్న మొత్తం 9 ఫారాలు/ఫార్మాట్‌లను విలీనం చేసి ఈ కొత్త ఫారం "ఫామ్‌ 6A"ని లాంచ్‌ చేశారు. దీనిపై ఉద్యోగి "కేవలం సంతకం చేస్తే చాలు". పదవీ విరమణ తర్వాత నుంచి పెన్షన్ చెల్లింపు ప్రారంభమయ్యే వరకు మొత్తం పెన్షన్ ప్రాసెస్‌ ప్రక్రియను ఈ ఫారం డిజిటలైజ్‌ చేస్తుంది.


పింఛనుదార్లకు హెచ్చరిక
పెన్షన్ పొందుతున్న లేదా కుటుంబ పెన్షన్ పొందుతున్న పింఛనుదార్లు జాగ్రత్తగా ఉండాలని చెబుతూ, సెంట్రల్ పెన్షన్ అకౌంటింగ్ ఆఫీస్‌ (CPAO) ఒక హెచ్చరిక జారీ చేసింది. సెంట్రల్ పెన్షన్ అకౌంటింగ్ ఆఫీస్‌ నుంచి మాట్లాడుతున్నామని లేదా దిల్లీ అధికారులుగా చెప్పుకుంటూ కొందరు మోసగాళ్లు పింఛనుదారులను సంప్రదిస్తున్నారని CPAO వెల్లడించింది. పింఛనుదార్లకు వాట్సాప్, ఈ-మెయిల్, SMS ద్వారా ఫారాలు పంపి వాటిని నింపాల్సిందిగా మోసగాళ్లు కోరుతున్నారు. ఆ ఫారం నింపకుంటే వచ్చే నెల నుంచి పింఛన్‌ను నిలిపివేస్తామని బెదిరిస్తున్నారు. 


PPO నంబర్, పుట్టిన తేదీ, బ్యాంక్ ఖాతా వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని పింఛనుదార్లను CPAO కోరింది. CPAO లేదా బ్యాంకులు లేదా ఇతర ప్రభుత్వ సంస్థలు పెన్షనర్లను అలాంటి సమాచారం కోసం ఎప్పుడూ అడగవని స్పష్టం చేసింది. పెన్షనర్లు జాగ్రత్తగా ఉండాలి, వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఉంచుకోవాలని సూచించింది.


సెంట్రల్ పెన్షన్ అకౌంటింగ్ ఆఫీస్ అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్‌ను నిర్వహించే ప్రభుత్వ సంస్థ. కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో ఇది పని చేస్తుంది.


మరో ఆసక్తికర కథనం: బంపర్‌ ఆఫర్‌ ప్రకటించిన రిలయన్స్‌ - ఈ కంపెనీ షేర్లు 'ఫ్రీ'గా పొందొచ్చు!