E-Commerce: ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో భారతదేశంలో ఆన్‌లైన్ రిటైల్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందింది. మన దేశంలో ఈ-కామర్స్ వృద్ధికి ఇంకా భారీ అవకాశాలు ఉన్నాయి. అయితే ఆన్‌లైన్‌ మోసాల రూపంలో సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడానికి సన్నాహాలు చేసింది. రిపోర్ట్‌ల ప్రకారం, త్వరలోనే కొత్త, మరింత కఠినమైన నిబంధనలు జారీ చేయబోతోంది.


జాతీయ వార్తాపత్రికల ప్రకారం, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ సహా అన్ని ఈ-కామర్స్ కంపెనీలకు నిబంధనలను కఠినతరం చేయడానికి కేంద్ర వినియోగదార్ల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో జరిగే మోసాలకు సంబంధిత కంపెనీలను బాధ్యులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం. ఒక కంపెనీకి చెందిన ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో విక్రేత వల్ల వినియోగదారు మోసపోతే, సంబంధిత సంస్థ మధ్యవర్తి పాత్రను పోషించడంలో విఫలమైనట్లుగా పరిగణిస్తారు.


ఈ-కామర్స్‌ కంపెనీలకు ప్రశ్నల లిస్ట్‌
ఆన్‌లైన్‌ షాపింగ్‌ మోసాలకు సంబంధించి, కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ-కామర్స్ కంపెనీలకు కొన్ని ప్రశ్నలను పంపింది. ఆ ప్రశ్నలపై ఆయా కంపెనీల నుంచి సమాధానాలు రాగానే నిబంధనలను అమలు చేయనున్నారు. కేంద్ర వినియోగదార్ల వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి ఈ విషయాన్ని వెల్లడించినట్లు జాతీయ మీడియా రిపోర్ట్‌ చేసింది. 


కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గత వారం ఈ-కామర్స్ కంపెనీలకు ఒక నోట్‌ పంపిందని సమాచారం. కేంద్ర వినియోగదార్ల వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూపొందించిన ప్రశ్నల ఆధారంగా ఆ నోట్‌ రూపొందించారని తెలుస్తోంది. ఆ ప్రశ్నల్లో ముఖ్యమైన ప్రశ్న... మధ్యవర్తిగా ఆయా కంపెనీల పాత్రను స్పష్టం చేయాలని ఈ-కామర్స్ కంపెనీలను ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అడిగింది.


ఇప్పటి వరకు కొంతమేర మాత్రమే రక్షణ
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లోని సెక్షన్ 79 ప్రకారం... కొనుగోలుదార్లు - అమ్మకందార్లను అనుసంధానించే మధ్యవర్తులుగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్‌ సహా అన్ని ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లను పరిగణిస్తారు. సంబంధిత సెక్షన్ కింద వినియోగదార్లకు కొంత రక్షణ మాత్రమే లభిస్తుంది. అయితే, ఈ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం మార్చాలని అనుకుంటోంది. మధ్యవర్తిగా ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ మరింత బాధ్యత వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.


భారతదేశంలోని ఈ-కామర్స్ కంపెనీలపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా ఉండడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు, 2020 జులైలో కొత్త ఈ-కామర్స్ నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేసింది. కొత్త నిబంధనల్లో, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించిన వ్యవస్థలను విక్రేతలుగా మార్చడం, ఫ్లాష్ సేల్స్‌పై నిషేధం వంటి కఠిన నిబంధనలు రూపొందించింది. ప్రభుత్వ నిబంధనలను అటు అగ్ర ఈ-కామర్స్ కంపెనీలు, ఇటు నీతి ఆయోగ్ వంటి ప్రభుత్వ థింక్ ట్యాంక్‌లు కూడా హర్షించలేదు. మరోవైపు, ఈ-కామర్స్‌ కంపెనీలపై కఠినంగా వ్యవహరించాలని చిన్న చిల్లర వ్యాపారుల సంస్థ క్యాట్ చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది.