Income Tax Return Filing Rules Change: రాబోయే రోజుల్లో ఆదాయ పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయడం చాలా సులభం కావచ్చు. ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్ ఫైలింగ్ నిబంధనలను చాలా సులువుగా, సరళంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం, దాదాపు 120 బిలియన్ డాలర్ల విలువకు సమానమైన టాక్స్‌ కేసులు వివాదంలో ఉన్నాయి, అర్ధం కాని భాషలో ఉన్న చట్టాలే దీనికి కారణమని భావిస్తోంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT), ఆదాయ పన్ను చట్టం 1961ను సమీక్షించడానికి అంతర్గత కమిటీని కూడా ఏర్పాటు చేసింది. 


సలహాలు, సూచనల కోసం ముసాయిదా నివేదిక
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, CBDT కమిటీ ప్రతిపాదిత ఆదాయ పన్ను చట్టం 1961ను సమీక్షించడంపై ఎప్పటికప్పుడు చర్చిస్తోంది. ప్రజల నుంచి సలహాలు, సూచనల కోసం 2025 జనవరి మధ్య నాటికి ముసాయిదా నివేదికను విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. 01 ఫిబ్రవరి 2025న సమర్పించే బడ్జెట్‌లో (Union Budget 2025), ప్రతిపాదన బిల్లు గురించి కేంద్ర ప్రభుత్వం వెల్లడిస్తుందని సమాచారం.


ఆదాయ పన్ను చట్టం భాష సరళీకృతం
రిపోర్ట్‌ ప్రకారం, ఆదాయ పన్ను చట్టంలోని భాషను సరళీకరించడం ద్వారా.. వివిధ అంశాలకు సంబంధించిన సమాచారాన్ని హేతుబద్ధీకరించవచ్చు, పన్ను రేట్లు & విధానాలపై కన్ఫ్యూజన్‌ తగ్గించవచ్చు.


పన్ను వివాదాలతో ఇబ్బందులు
పన్ను చెల్లింపుదారులపై బ్యూరోక్రాటిక్ భారాన్ని తగ్గించడానికి, సమ్మతిని మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం దశాబ్దాలుగా పన్ను చట్టాల్లో సవరణలు చేస్తోంది. అయినప్పటికీ, పన్ను వివాదాలకు సంబంధించిన కేసులు రూ.10.5 లక్షల కోట్లకు, 123 బిలియన్ డాలర్లకు చేరాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం కోసం జులై నెలలో బడ్జెట్‌ను సమర్పిస్తున్నప్పుడు, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, ఆరు నెలల్లోగా ఆదాయ పన్ను చట్టాలపై సమగ్ర సమీక్ష నిర్వహించాలని ప్రతిపాదించారు & పన్ను చెల్లింపుదారులకు అనుకూలంగా మారుస్తామని హామీ ఇచ్చారు.    


అసెస్‌మెంట్ ఇయర్‌కు బదులుగా టాక్స్‌ ఇయర్‌
ఆదాయ పన్ను చట్టంలో జరగబోయే మార్పులలో, సంక్లిష్టమైన ఆదాయ లెక్కింపు విధానాలను కొన్ని సూత్రాలతో భర్తీ చేయవచ్చు. ప్రస్తుతం, పన్ను చట్టాల ప్రకారం, 'ఆర్థిక సంవత్సరం' & 'మదింపు సంవత్సరాన్ని' పిలిచే పద్ధతిని మార్చి 'పన్ను సంవత్సరం'గా నిర్వచిస్తారు. పన్ను చెల్లింపుదారులు సులభంగా అర్థం చేసుకునేలా దీనిని ఒక పట్టిక రూపంలో వివరించవచ్చు. ఇది కాకుండా, రిటర్న్‌లను దాఖలు చేయడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫారాల సంఖ్యను కుదించే అవకాశం ఉంది.


ఆడిటర్‌ లేదా CA అవసరం లేదు!
ఆదాయ పన్ను దినోత్సవం సందర్భంగా, పన్ను చెల్లింపుదారులతో న్యాయంగా & స్నేహపూర్వకంగా ఉండాలని ఆర్థిక మంత్రి అధికారులకు సూచించారు. టాక్స్‌ పేయర్లకు పంపే నోటీసుల్లోని భాష సరళంగా, సాంకేతికత పదాలు లేకుండా ఉండేలా చూడాలని చెప్పారు. పన్ను చెల్లింపుదారులతోనూ సరళమైన భాషలో మాట్లాడాలని చెప్పారు. దీనివల్ల, పన్ను చెల్లింపుదారులు ఆదాయ పన్ను శాఖ నోటీసులకు ప్రతిస్పందించడానికి ఆడిటర్‌ లేదా సీఏ లేదా న్యాయవాదులను నియమించుకోవాల్సిన అవసరం రాదని అన్నారు.


మరో ఆసక్తికర కథనం: నిర్మలమ్మ సమ్మతిస్తే మీకు డబుల్‌ గ్రాట్యుటీ ఖాయం! - త్వరలో తీపి కబురు?