Study in India: అంతర్జాతీయ విద్యార్థుల కోసం భారత ప్రభుత్వం రెండు కొత్త రకాల వీసాలను ప్రకటించింది. అవి - 'ఇ-స్టూడెంట్ వీసా' (e-student visa), 'ఇ-స్టూడెంట్-ఎక్స్ వీసా' (e-student-x visa). ఈ కొత్త కేటగిరీల ప్రారంభంతో.. ఇతర దేశాల నుంచి వచ్చి, భారతదేశంలో ఉన్నత విద్య చదవాలనుకునే విదేశీ విద్యార్థులకు మరింత సౌకర్యం చేకూరింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ కొత్త వీసా కేటగిరీలను ప్రకటించింది. విదేశీ విద్యార్థులు భారత ప్రభుత్వ 'స్టడీ ఇన్ ఇండియా' (Study in India - SII) పోర్టల్‌లోకి వెళ్లి ఈ వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాలి.
SII అంటే ఏంటి?
భారతదేశానికి వచ్చి ఉన్నత చదువులు చదవాలనుకునే విదేశీ విద్యార్థుల కోసం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ చొరవ కింద స్టడీ ఇన్ ఇండియా (SII) కార్యక్రమాన్ని & పోర్టల్‌ను రూపొందించారు. ఈ కార్యక్రమం కింద.. ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, టెక్నాలజీ, సైన్స్, అగ్రికల్చర్, ఆర్ట్, హ్యుమానిటీస్, లా, లాంగ్వేజ్ స్టడీస్, పారామెడికల్ సైన్స్, యోగా సహా వివిధ అంశాల్లో 8,000కు పైగా కోర్సులను అందించే 600కు పైగా సంస్థలు భాగస్వామ్యులుగా ఉన్నాయి.
ఇండియాకు వచ్చి చదువుకోవాలనుకునే అంతర్జాతీయ విద్యార్థులు SII పోర్టల్‌లో వీసా కోసం అప్లై చేయాలి. ఈ పోర్టల్‌లో.. 'ఇ-స్టూడెంట్ వీసా' అనేది భారతదేశంలో చదువుకోవడానికి తమ పేర్లను నమోదు చేసుకునే విదేశీ విద్యార్థుల కోసం ప్రారంభించిన కేటగిరీ. 'ఇ-స్టూడెంట్-ఎక్స్ వీసా' అనేది ఇ-స్టూడెంట్ వీసా కలిగి ఉన్న వారిపై ఆధారపడిన వారి కోసం ప్రారంభించిన కేటగిరీ.
స్టుడెంట్ వీసా కోసం ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు
SII పోర్టల్ భారతదేశంలో దీర్ఘకాలిక లేదా స్వల్పకాలిక కోర్సులను అభ్యసించాలనుకునే అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశ ప్రక్రియను సులభంగా మారుస్తుంది. విదేశీ విద్యార్థులు, https://indianvisaonline.gov.in/ పోర్టల్‌లోకి వెళ్లి వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. దీనికి SII ID అవసరం. కాబట్టి, ముందుగా SII పోర్టల్ నమోదు చేసుకోవాలి. భారతదేశంలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా SII IDని కలిగి ఉండాలి. SII పోర్టల్‌లో విద్యార్థి పేరు, దేశం, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, ఇ-మెయిల్ ఐడీ వంటి సమాచారాన్ని అందించిన తర్వాత ఎస్‌ఎస్‌ఐ ఐడీ క్రియేట్ అవుతుంది. విద్యార్థి వీసాలు కోర్సు వ్యవధి ఆధారంగా జారీ అవుతాయి. భారతదేశంలో ఉంటూ వాటి కాల పరిమితిని పొడిగించుకోవచ్చు.
స్టుడెంట్ వీసా పొందడానికి ఎవరు అర్హులు?
SII పోర్టల్‌లో లిస్ట్ అయిన ఏదైనా ఒక ఇన్‌స్టిట్యూట్ నుంచి అడ్మిషన్ ఆఫర్ పొందిన తర్వాత, సదరు విద్యార్థి ఇ-వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. మన దేశంలోని గుర్తింపు పొందిన సంస్థ నుంచి రెగ్యులర్ లేదా ఫుల్ టైమ్ ప్రాతిపదికన పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ లేదా ఏదైనా ఇతర కోర్సు చదవాలనుకునే విదేశీ వ్యక్తులకు ఈ వీసా జారీ చేస్తారు.
మరో ఆసక్తికర కథనం: స్వల్పంగా పెరిగిన గోల్డ్, రూ.లక్ష నుంచి తగ్గని సిల్వర్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ