Car Sales In November: దేశంలో కార్‌ సేల్స్‌ నవంబర్‌ నెలలోనూ స్పీట్‌ ట్రాక్‌ నుంచి దిగలేదు. సాధారణంగా, దసరా, దీపావళి పండుగ సీజన్‌లో కార్ల అమ్మకాలు టాప్‌ గేర్‌లో ఉంటాయి. పండుగ సీజన్‌ ముగిసిన తర్వాత జోరు తగ్గుతుంది. ఈ ఏడాది మాత్రం పండుగ సీజన్‌ ముగిసినా, జనాల్లో ఫెస్టివ్‌ మూడ్‌ తగ్గలేదు. జామకాయలు కొన్నంత ఈజీగా జనం కార్లను కొంటున్నారు. ముఖ్యంగా, పర్సనల్‌గా ఉపయోగించుకునే కార్లకు (ప్యాసింజర్‌ వెహికల్స్‌) హై డిమాండ్‌ కొనసాగింది. దీంతో, నవంబర్‌ నెలలో రికార్డ్‌ సేల్స్‌ నమోదయ్యాయి. గతంలో, ఏ సంవత్సరంలోనూ నవంబర్‌ నెలలో ఇంత భారీ అమ్మకాలు కనిపించలేదు.

రెండంకెల వృద్ధిహోల్‌సేల్‌ సేల్స్‌లో... మారుతి సుజుకి ఇండియా, హ్యుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రా రెండంకెల వృద్ధిని సాధించాయి. కియా ఇండియా, హోండా కార్స్, స్కోడా, MG మోటార్ కూడా గత నెలలో బలమైన అమ్మకాలతో ఫుల్‌ ఖుషీగా ఉన్నాయి. అయితే, టయోటా కిర్లోస్కర్ మోటార్, నిస్సాన్ కార్ల సేల్స్‌ మాత్రం తగ్గాయి.

ఇండస్ట్రీ వ్యాప్తంగా చూస్తే... కార్‌ హోల్‌సేల్స్ నవంబర్‌ నెలలో 31% పెరిగి 3,22,860 యూనిట్లకు చేరుకున్నాయి. 2020 నవంబర్‌లోని మునుపటి హైయస్ట్‌ స్కోర్‌ 2.86 లక్షలను 2022 నవంబర్‌ బీట్‌ చేసింది. 2021 నవంబర్‌లో 2,45,636 కార్లు కంపెనీల నుంచి డీలర్లకు (హోల్‌సేల్‌) సప్లై అయ్యాయి.

వరుసగా ఆరో నెలపరిశ్రమ హోల్‌సేల్‌ సెగ్మెంట్‌లో మూడు లక్షలకు పైగా అమ్మకాలు జరగడం ఇది వరుసగా ఆరో నెల.

ఈ సంవత్సరం జనవరి-నవంబర్ కాలంలో జరిగిన విక్రయాలు 35 లక్షల మైల్‌స్టోన్‌ను క్రాస్‌ చేశాయి. గతంలో, 2018లో అత్యధికంగా 33.8 లక్షల యూనిట్లు అమ్ముడుపోయాయి. 2021 జనవరి-నవంబర్ మధ్య కాలంలో ఈ సంఖ్య 28 లక్షల యూనిట్లుగా ఉంది. ఈ లెక్క ప్రకారం, గత ఏడాదితో పోలిస్తే, ఈసారి సేల్స్‌ దాదాపు 25 శాతం పెరిగాయి.

డిసెంబర్‌లో అంచనా సేల్స్‌ను కూడా కలిపితే, ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో విక్రయాల సంఖ్య 38 లక్షల యూనిట్లకు చేరుతుందని ఎక్స్‌పర్ట్స్‌ భావిస్తున్నారు.

మారుతి Vs హ్యుందాయ్ తమ హోల్‌సేల్‌ కార్‌ సేల్స్‌ 18% పెరిగి 1,39,306 యూనిట్లకు చేరుకున్నాయని దేశంలోని అతి పెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకీ ఇండియా ప్రకటించింది. మినీ కార్‌ (ఆల్టో, ఎస్‌-ప్రెస్సో) అమ్మకాలు గత ఏడాది ఇదే నెలలోని 17,473 యూనిట్లతో పోలిస్తే, ఈసారి 18,251 యూనిట్లకు అమ్మాకాలు పెరిగాయి. యుటిలిటీ వెహికల్‌ (బ్రెజ్జా, ఎర్టిగా, గ్రాండ్ విటారా) విక్రయాలు గత ఏడాది నవంబర్‌ నెలలో నమోదైన 24,574 యూనిట్లతో పోలిస్తే, ఈసారి 32,563 యూనిట్లకు పెరిగాయి.

మారుతి రైవల్‌ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా హోల్‌సేల్స్‌ గత నెలలో 30% పెరిగి 48,003 యూనిట్లకు చేరుకున్నాయి. తమ కంపెనీ చరిత్రలో 2022 సంవత్సరం ది బెస్ట్‌గా నిలుస్తుందని హ్యుందాయ్‌ భావిస్తోంది.

టాటా మోటార్స్ మొత్తం ప్యాసింజర్ వాహనాల సేల్స్‌ 55% పెరిగి 46,037 యూనిట్లకు చేరుకున్నాయి. మహీంద్ర & మహీంద్ర దేశీయ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 56% పెరిగి 30,392 యూనిట్లకు చేరుకున్నాయి.

హోండా కార్స్ గురించి చెప్పుకోవాలంటే... గత ఏడాది నవంబర్‌ నెలతో పోలిస్తే ఈసారి విక్రయాలు 29% పెరిగి 7,051 యూనిట్లకు పెరిగాయి.

ముందు చెప్పుకున్నట్లు... టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) మాత్రం రివర్స్‌ గేర్‌లో ఉంది. 2022 నవంబర్‌లో హోల్‌సేల్స్‌ 10% క్షీణించి 11,765 యూనిట్లకు పడిపోయాయి. కాంపాక్ట్ SUV అర్బన్ క్రూయిజర్‌ ఉత్పత్తిని TKM నిలిపేసింది. ఇన్నోవా డీజిల్ వెర్షన్ బుకింగ్స్‌ను కూడా పాజ్ చేసింది. దీంతో, గత నెల మొత్తం అమ్మకాల మీద ఈ ప్రభావం పడింది.