Nithin Kamath on New Scam : టెక్నాలజీతో పాటు మోసాలూ పెరుగుతున్నాయి. పోలీసులు, కస్టమ్స్ లేదా సీబీఐ అధికారులుగా నటిస్తూ బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తోన్న ఉదంతాలు రోజూ ఎన్నో చూస్తూనే ఉన్నాయి. తెలియని నంబర్ నుంచి వచ్చిన లింకులపై క్లిక్ చేసి సైబర్ మోసానికి గురవడం ఇటీవలి కాలంలో మరిన్ని భయాందోళనలకు గురి చేస్తోంది. ఈ తరహా మోసాలపై అవగాహన కల్పించేందుకు జెరోధా సీఈవో నితిన్ కామత్ ముందుకు వచ్చారు. ఈ మధ్య కాలంలో వెలుగులోకి వస్తోన్న ఓ కొత్త స్కామ్ గురించి హెచ్చరికలు జారీ చేసిన ఆయన.. దీని వల్ల బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదముందని చెప్పారు. ఈ కొత్త స్కామ్ కు సంబంధించిన విషయాలను తెలియజేస్తూ ఓ వీడియోను కూడా షేర్ చేశారు.

కొత్త స్కామ్ లో కీలక విషయాలు వెల్లడించిన నితిన్ కామత్

అర్జంట్ గా కాల్ చేయాలి.. మీ ఫోన్ ఇస్తారా అని ఎవరైనా తెలియని వ్యక్తులు మనల్ని అడగడం చూస్తూనే ఉంటాం. వీళ్లు చూసేందుకు మాత్రం అమాయకంగా కనిపిస్తారు. వీళ్ల మెయిన్ టార్గెట్ ఎక్కువగా వృద్ధులు, చిన్న పిల్లలు, ఈజీగా మోసపోయే వాళ్లే. ఎవరైనా మిమ్మల్ని కూడా ఇలా అడిగి.. మీ ఫోన్ తీసుకుని పక్కకు వెళితే తప్పకుండా అనుమానించాలి. ఎందుకంటే ఈ స్కామర్లు మీకు తెలియకుండానే మీ ఫోన్ నుంచి కొన్ని యాప్స్ ను డౌన్ లోడ్ చేసే అవకాశముంటుంది. అంతే కాదు మీ బ్యాంకింగ్ అలర్ట్స్ తో సహా కాల్స్, మెసేజెస్ వారి నంబర్ కు ఫార్వార్డ్ చేసేందుకు మీ ఫోన్ లో సెట్టింగ్స్ ను మార్చే ఛాన్స్ ఉంది. దీని వల్ల ఓటీపీలను రాకుండా చేసి.. మీ అకౌంట్ ను ఖాళీ చేయొచ్చు అని కామత్ చెప్పారు.

ఈ స్కామ్ కు గురికాకుండా ఉండాలంటే..

మీ ఫోన్ ను అపరిచిత వ్యక్తులకు ఇవ్వకూడదు. దాని బదులు మీరే వారు చెప్పిన నంబర్ ను డయల్ చేసి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాలని చెప్పాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు మనం పెద్ద మోసాల బారిన పడకుండా చేస్తాయి అని కామత్ వివరించారు.

నెటిజన్లు ఏమన్నారంటే..

నితిన్ కామత్ షేర్ చేసిన వీడియోపై యూజర్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఈ తరహా మోసాలపై ఆందోళన వ్యక్తం చేయగా.. మరికొందరేమో తమకు జరిగిన ఇలాంటి సంఘటనలను పంచుకున్నారు. ఇంకొందరేమో చాలా మంది స్కామర్‌లు తమ లక్ష్యంతో కమ్యూనికేట్ చేయడానికి స్థానిక భాషను ఉపయోగించే అవకాశం ఉన్నందున, దాని ప్రభావాన్ని పెంచడానికి అనేక భారతీయ భాషల్లో వీడియోను అనువదించాలని నితిన్ కామత్‌ను కోరారు. ఇక పోతే నేటి టెక్నాలజీ యుగంలో ఆర్థిక, వ్యక్తిగత జీవితానికి ఫోన్ అనేది ఓ కీ లాంటిది. ఇతరులకు సహాయం చేయడం మంచిదే. కానీ జాగ్రత్తగా ఉండడం అంతకన్నా ముఖ్యమనే విషయాన్ని గుర్తించుకోవాలి. కొన్నిసార్లు కొద్దిపాటి జాగ్రత్తలే పెద్ద నష్టాలను నివారించగలవు. మీరు ఏదైనా స్కామ్ కు గురయ్యారనిపిస్తే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930కు కాల్ చేసి మాట్లాడండి.

Also Read : Hindenburg Research : హిండెన్ బర్గ్ మూసివేత - ఫౌండర్ సంచలన ప్రకటన, సవాళ్లలోనూ ఉత్సాహంగా పని చేశామని లేఖ