Hindenburg Research : యూఎస్‌కు చెందిన షార్ట్ సెల్లర్ సంస్థ, అదానీ గ్రూప్‌తో సహా పలు వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకున్న హిండెన్ బర్గ్‌ను మూసివేస్తున్నట్టు ఆ సంస్థ వ్యవస్థాపకుడు నేట్ ఆండర్సన్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ లేఖను రిలీజ్ చేశారు. అయితే హిండెన్ బర్గ్ మూసివేతకు ఎలాంటి ముఖ్యమైన కారణాలేమీ లేవని, వ్యక్తిగత అంశాలు, భయాలు బెదిరింపులు కూడా లేవని స్పష్టం చేశారు. ఇదే సమయంలో హిండెన్‌బర్గ్ తన జీవితంలో ఎప్పుడూ అతి పెద్ద ప్రధాన విషయం కాలేదనీ, కానీ దీన్ని ఒక అధ్యాయంగా చూస్తున్నానన్నారు. ఈ విషయాన్ని హిండెన్ బర్గ్ రీసెర్చ్ తన అధికారిక వెబ్ సైట్ ధృవీకరించింది. కాగా, అదానీ గ్రూప్‌పై సంచలన ఆరోపణలతో ఆ మధ్య భారత స్టాక్ మార్కెట్లను హిండెన్‌బర్గ్ వణికించింది.


ఆండర్సన్ ఏం చెప్పారంటే..?


సంస్థను మూసేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసిన ఆండర్సన్.. లేఖలో సుదీర్ఘమైన వివరాలు ప్రస్తావించారు. తాను హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ రద్దు చేయాలని నిర్ణయించుకున్నానన్నారు. తాము పని చేస్తున్న ఆలోచనలకు సంబంధించిన ప్రక్రియ పూర్తైన తర్వాత ముగించాలనేది ప్లాన్ అని ఆయన హిండెన్‌బర్గ్ వెబ్‌సైట్‌లోని ఒక నోట్‌లో తెలిపారు. అయితే ఎందుకు మూసివేస్తున్నామ‌నే విష‌యంపై మాత్రం ఆయన కార‌ణాలు వెల్ల‌డించ‌లేదు. "ఇప్పుడు ఎందుకు రద్దు చేయాలి? అనే ప్ర‌శ్న‌కు ఒక నిర్దిష్ట కార‌ణం ఏమీ లేదు. హిండెన్ బ‌ర్గ్ మూసివేత వెనుక ఎలాంటి ప్ర‌త్యేకమైన ముప్పు లేదు. ఆరోగ్య సమస్య గానీ, వ్యక్తిగత సమస్యలు, భయాలు గానీ లేవు" అని అండర్సన్ అన్నారు.


https://hindenburgresearch.com/gratitude/


'నా జీవితంలో ఒక అధ్యాయం'


తన జీవితంలో జరిగిన చాలా విష‌యాల్లో ఇది ఒకటని, కానీ అన్నింటి కంటే ఇదే అతిపెద్ద విషయమని ఆండర్సన్ చెప్పారు. తాను ఇప్పుడు హిండెన్‌బర్గ్‌ని తన జీవితంలో ఓ అధ్యాయంగా చూస్తున్నట్లు తెలిపారు. తనను నిర్వచించే ప్రధాన విషయంగా కాదని వెల్లడించారు. అయితే హిండెన్ బ‌ర్గ్‌ను ఎప్ప‌ుడు మూసివేస్తామ‌నే విష‌యంపై మాత్రం ఎలాంటి తేదీని ప్ర‌క‌టించ‌లేదు. ప్ర‌స్తుతం ఈ సంస్థ నిర్వ‌హిస్తున్న ప్రాజెక్టులు పూర్తి చేసిన త‌ర్వాతే మూసివేయాలనేది త‌మ ప్ర‌ణాళిక‌గా ఉంద‌ని నేట్ ఆండ‌ర్స‌న్ పేర్కొన్నారు.  


ఆరంభంలోనే విఫలమయ్యేవాడిని.. కానీ


సంస్థ ప్రారంభంలో తాను ఎదుర్కొన్న సవాళ్లను సైతం ఆండర్సన్ ప్రస్తావించారు. తన కుటుంబ సభ్యులెవరికీ ఈ రంగంలో అనుభవం లేదన్నారు. "నేను ప్రభుత్వ పాఠశాలలో చదివాను. నేను స్లిమ్ సేల్స్ పర్సన్‌ని కాదు. నాకు వేసుకోవడానికి సరైన బట్టలు కూడా లేవు. నేను గోల్ఫ్ ఆడలేను. నేను 4 గంటల నిద్రలో పనిచేయగల సూపర్ హ్యూమన్‌ని కాదు. నేను ఈ సంస్థను ప్రారంభించినప్పుడు నా వద్ద తగినంత డబ్బు కూడా లేదు. 3 కేసులను పట్టుకున్న తర్వాత కూడా నా వద్దకు అంత త్వరగా డబ్బు రాలేదు" అని చెప్పారు. తన వద్ద ఎలాంటి ఆర్థిక వనరులు లేకపోయినా కేసులను ముందుకు తీసుకెళ్లిన ప్రపంచ స్థాయి విజిల్ బ్లోయర్ లాయర్ బ్రయాన్ వుడ్ మద్దతు లేకపోతే తాను ఆరంభంలోనే విఫలమయ్యేవాడినని చెప్పుకొచ్చేవారు. తనకు ఓ నవజాత శిశువు ఉందని, బహిష్కరణను ఎదుర్కోవడంతో తాను చాలా భయపడ్డానని, కానీ తనకున్న ఏకైక మార్గం ముందుకు సాగడమనేనన్నారు.


అదానీ-హిండెన్ బర్గ్ వివాదం 


ఇటీవలి కాలంలోనే భారత్‌లో హిండెన్ బర్గ్ ఎక్కువగా ప్రచారంలోకి వస్తోంది. ముఖ్యంగా ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ సంస్థ అదానీ గ్రూప్‌పై షార్ట్ సెల్లింగ్ చేసి వార్తల్లో నిలిచింది. 2023 జనవరిలో తన నివేదికలో అదానీ గ్రూప్ షేర్ ధరలను తారుమారు చేసిందని ఆరోపిస్తూ చేసిన రిపోర్ట్స్ ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపాయి. దీంతో కంపెనీ షేరు విలువ గణనీయంగా పడిపోయి దాదాపు 140 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ తుడిచిపెట్టుకుపోయింది. ఈ వివాదం పార్లమెంటులోనూ తీవ్ర దుమారం రేపగా.. ఉద్దేశపూర్వకంగా కొన్ని వాస్తవాలను వక్రీకరించారని ఆరోపిస్తూ షార్ట్ సెల్లర్‌కు సెబీ నోటీసులు జారీ చేసింది. అయితే కేవలం అదానీ గ్రూప్‌నే కాకుండా.. పలు సంస్థలపైనా ఎన్నో ఆర్థిక పరిశోధనలు చేసి, ఆరోపణలు చేసింది. దీంతో ఆయా కంపెనీల షేర్లు అమాంతం పాతాళానికి పడిపోయాయి. ఈ ప్రక్రియకు హిండెన్ బర్గ్ ఆర్థిక రంగంలో మానవ నిర్మిత కృత్రిమ విపత్తుల్ని గుర్తించడం అని పేరు పెట్టుకుంది.  


Also Read : Budget 2025: పాత, కొత్త ఆదాయపు పన్ను విధానాలను విలీనం చేయడం మంచి ఆలోచనేనా?