Business News in Telugu: అహ్మదాబాద్ వేదికగా 2023 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు (ICC World Cup Cricket 2023 Final Match) జరుగుతోంది. నవంబర్ 19న, ఆదివారం నాడు భారత్, ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ (India - Australia World Cup Final Match) జరుగుతుంది. కొదమసింహాల్లాంటి ఈ రెండు జట్ల పోరును టీవీల్లో చూసే కంటే, ప్రత్యక్షంగా గ్రౌండ్‌లో ఉండి, బాల్-టు-బాల్ చూస్తే ఆ కిక్కే వేరప్పా. అహ్మదాబాద్‌లో జరిగే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు చూడడానికి చాలా కాలం క్రితమే టిక్కెట్లు కొన్నారు క్రికెట్ అభిమానులు. ఇప్పుడు, వాళ్లంతా ఆ నగరానికి చేరడం పెద్ద టాస్క్‌లా మారింది. క్రికెట్ ఫీవర్‌తో అన్ని ధరలతో పాటు ట్రాన్స్‌పోర్టేషన్ రేట్లు కూడా అమాంతం పెరిగాయి.
విమానయాన సంస్థలకు మరో దీపావళి
భారత్, వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్స్‌కు చేరుకోవడంతో ఎయిర్‌లైన్స్ కంపెనీల్లోకి దీపావళి మళ్లీ తిరిగొచ్చింది. ఇప్పుడు, అహ్మదాబాద్‌కు విమానంలో వెళ్లాలంటే, విమాన టిక్కెట్ రేటు (Aairfares for ahmedabad) రూ.40 వేలకు చేరుకుంది. వేల మంది క్రికెట్ వీరాభిమానులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అహ్మదాబాద్ వెళ్లేందుకు, మ్యాచ్ ఐపోయిన తర్వాత అక్కడి నుంచి తిరిగి వాళ్ల సొంత స్థలాలకు చేరేందుకు విమానయాన సంస్థలు అదనపు సర్వీసులు ప్రారంభించాల్సి వస్తోంది. దీంతో విమాన టిక్కెట్లకు తెగ గిరాకీ ఏర్పడింది. పెరుగుతున్న డిమాండ్ కారణంగా నిమిష నిమిషానికీ ఛార్జీలు కూడా పెరుగుతున్నాయి.
దీపావళి సందర్భంగా ఇటీవల మంచి లాభాలను ఆర్జించాయి విమానయాన సంస్థలు. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ రూపంలో మరోసారి పండగ చేసుకుంటున్నాయి. ఇండిగో, విస్తారా కంపెనీలు... రెండు రోజుల పాటు ముంబై-అహ్మదాబాద్ మధ్య ఒక్కో సర్వీసును పెంచాయి. ఇది కాకుండా.. బెంగళూరు నుంచి అహ్మదాబాద్, హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్ మధ్య కూడా విమాన సేవల సంఖ్యను ఇండిగో పెంచింది.
ఏ నగరం నుంచి ఛార్జీ ఎంత?
వివిధ ఎయిర్‌లైన్ బుకింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో ఉన్న డేటా ప్రకారం, అహ్మదాబాద్‌కు విమానాలు ఉప్పెనలా వచ్చి పడుతున్నాయి. విమానయాన సంస్థలు ఇప్పుడు దిల్లీ, బెంగళూరు వంటి ఇతర నగరాల నుంచి విమానాలను నడిపేందుకు సిద్ధమవుతున్నాయి. దిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు విమాన టిక్కెట్ రేటు గతంలోని రూ.14 నుంచి ఇప్పుడు రూ.39 వేలకు చేరింది. ముంబై నుంచి అహ్మదాబాద్ వచ్చే వాళ్లు గతంలో రూ.10 వేలు చెల్లిస్తే, ఇప్పుడు రూ.32 వేలు చెల్లించాల్సి ఉంటుంది. బెంగళూరు నుంచి రూ.27 వేల బదులు రూ.33 వేలు, కోల్‌కతా నుంచి వచ్చే వాళ్లు రూ.40 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
అహ్మదాబాద్ కాకపోతే వడోదర
అహ్మదాబాద్‌కు ఆనుకుని ఉన్న వడోదరకు వెళ్లే వారి సంఖ్య కూడా వేగంగా పెరిగింది. ఇక్కడి నుండి కేవలం 2 గంటల్లో అహ్మదాబాద్ చేరుకోవచ్చు. ముంబయి, దిల్లీ నుంచి వడోదరకు వెళ్లే విమాన ప్రయాణాలు ఖరీదుగా మారడంతో, కొందరు తెలివిగా ఆలోచిస్తున్నారు. వాళ్ల నగరాల నుంచి వడోదరకు తక్కువ ఖర్చుతో విమాన టిక్కెట్లు కొని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అహ్మదాబాద్ చేరుకుంటున్నారు. ఈ విధంగా డబ్బులు మిగిల్చుకుంటున్నారు.
మరో ఆసక్తికర కథనం: పసిడి రేటును పెంచిన ఫెడ్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial