కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్‌ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగం లేదని మండిపడ్డారు. దేశంలో ఏ రాష్ట్రానికి ఉపయోగంలేని బడ్జెట్ వల్ల ఉపయోగం లేదన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ చాలా దారుణమైన బడ్జెట్ అన్నారు. బడ్జెట్‌ పెట్టే టైంలో మహాభారతంలోని శాంతి పర్వంలోని ఓ శ్లోకాన్ని ఆర్థికమంత్రి కోట్ చేశారని గుర్తు చేశారు. ప్రజలు బాగుండాలని దాని అర్థమని కేసీఆర్ చెప్పారు. ఆమె శాంతి పర్వంలోని శ్లోకం చెప్పి అసత్యాలే చదివారని మండిపడ్డారు. బడ్జెట్ లో అందరికీ గుండు సున్నా అని సీఎం కేసీఆర్ అన్నారు. కల్ల, డొల్ల ప్రచారం, గోల్ మాల్ గోవిందం తప్ప ఎవరికీ ఏమీలేదన్నారు. పేద ప్రజలకు గుండు సున్నా అని కేంద్రం బడ్జెట్ పై సీఎం కేసీఆర్ విమర్శలు చేశారు. 


బీజేపీని బంగాళాఖాతంలో పడేస్తాం


కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి సిగ్గూశరం లేదన్నారు సీఎం కేసీఆర్. భారత్‌ అభివృద్ధి చెందాలంటే బీజేపీని కూకటి వేళ్లతో పెకలించి బంగాళాఖాతంలో పడేయాలని పిలుపునిచ్చారు.  ప్రభుత్వాన్ని దింపేందుకు ఉద్యమిస్తామన్నారు. ప్రధానమంత్రి మోదీ చాలా కురచ బుద్ది ఉన్న వ్యక్తి అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  భవిష్యత్‌లో కరోనా లాంటి వైరస్‌లు విజృంభించ వచ్చని అంచనాలు ఉన్నా కేంద్రం వైద్యారోగ్యశాఖకు పైసా పెంచలేదని విమర్శించారు. బ్యాంకులను అప్పుల్లో ముంచిపోయిన వాళ్లకు సబ్సిడీలు ఇస్తారు. కార్పొరేట్‌ శక్తులను పెంచి పోషించడం, మత పిచ్చి లేపి మంది మీద పడి ఏడ్చి అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. 


లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారు


ప్రపంచం ఆకలి సూచిలో భారత్ 101 స్థానంలో ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. పాకిస్థాన్, నేపాల్‌ కంటే వెనుకబడి ఉన్నామన్నారు. 115 దేశాల్లో సర్వే చేస్తే 101లో భారత్‌ ఉందన్నారు. ప్రధాని మోదీ ఏం చేస్తున్నాట్టో చెప్పాలన్నారు. లాభాల్లో ఉన్న ఎల్‌ఐసీని ఎందుకు అమ్ముతున్నారో ప్రజలకు చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. అమెరికాలో ఉన్న వారికి బ్రోకర్లుగా పని చేస్తున్నారా అంటూ నిలదీశారు. 2022కి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని కేంద్రం చెప్పిందని ఆ విషయం ఏమందైన్నారు. అన్ని ధరలు పెంచి రైతు పెట్టుబడిని డబుల్ చేస్తున్నారని మండిపడ్డారు. అందరికీ ఇళ్లు అన్నది ఏమైందో చెప్పాలని నిలదీశారు. బ్లాక్‌ మనీ బయటకు తీసుకొస్తామని మనిషికి రూ.పదిహేను లక్షలు ఇస్తామని చెప్పిన మాట సంగతి ఏంటని మోదీని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. 


గుజరాత్ మోడల్ విఫలమైంది 


అత్యంత దారుణమైన విద్యుత్ పాలసీ అమలుచేస్తున్నారని సీఎం కేసీఆర్ ఆరోపిస్తున్నారు. ప్రజల నుంచి ముక్కు పిండి విద్యుత్‌ ఛార్జీలు వసూలు చేయనున్నారన్నారు. 'గుజరాత్‌ మోడల్‌ పేరుతో మోదీ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఎనిమిదో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఎనభై శాతం కాలం పరిపాలించిన మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. కరోనాతో దేశం అల్లకల్లోలమైపోయింది. లక్షల మంది ప్రజలు కనీసం రైలు టికెట్‌ కూడా ఇవ్వలేదు. నడుచుకుంటూ వెళ్తూ వేల మంది చనిపోయారు. అయినా ప్రభుత్వం ఏ మాత్రం సాయం చేయలేదు. ఎస్సీ, ఎస్టీల జనాభాపై కేంద్రం చెప్పిన లెక్కలు తప్పు అన్నారు కేసీఆర్. తమ బడ్జెట్‌లో వాళ్లకు ఖర్చు పెట్టినంత కూడా కేంద్రం వాళ్లకు కేటాయించలేదన్నారు. ఆందోళన చేసిన రైతుల ప్రస్తావనే బడ్జెట్‌లో లేదు. ఇదే ప్రధానమంత్రి రైతులకు ఇచ్చిన గిఫ్ట్‌. గ్రామీణ ఉపాధి హామీపై పాతికవేల కోట్లు కోత పెట్టారు' సీఎం కేసీఆర్ ఆరోపించారు.